రేవంత్ సర్కార్ రిపోర్ట్ కార్డ్: ‘విజన్ 2047’ దిశగా మార్పుల బాట.. అధికారులకు స్కోర్ కార్డ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలనపై పట్టు బిగిస్తున్నారు. కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, కార్పొరేట్ స్థాయిలో శాఖలు, జిల్లాలు, అధికారుల పనితీరును తూకం వేస్తూ రూపొందించిన ‘ప్రభుత్వ స్కోర్ కార్డ్’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక ఆధారంగా రాబోయే మూడేళ్ల కాలానికి ‘విజన్ 2047’ లక్ష్యంగా సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను సీఎం సిద్ధం చేశారు.

రాజకీయం అంటే కేవలం ఎన్నికలు కాదు, అది నిరంతర నిర్వహణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నారు. ఒక కార్పొరేట్ సంస్థ తరహాలో ‘పనితీరు స్కోర్ కార్డ్’ సిద్ధం చేసి, పాలనలో పట్టు బిగించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.

ప్రభుత్వం అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ సర్వే ప్రధానంగా మూడు స్తంభాల ఆధారంగా సాగింది. శాఖల వారీగా ఫైళ్ల కదలిక, జిల్లాల వారీగా పథకాల అమలు, మరియు క్షేత్రస్థాయిలో ప్రజల సంతృప్తిని ప్రాతిపదికగా తీసుకున్నారు.ఏ శాఖలో అవినీతి ఛాయలు ఉన్నాయి? ఏ మంత్రి తన పరిధిలోని పనులను వేగవంతం చేస్తున్నారు?కలెక్టర్ల పనితీరు నుంచి స్థానిక నేతల ప్రజాదరణ వరకు అన్నింటినీ లెక్కగడుతున్నారు. ఈ స్కోర్ కార్డ్ ఆధారంగానే రాబోయే కాలంలో నిధుల కేటాయింపు, బదిలీలు ఉండబోతున్నాయని అధికార వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం. ఈ రిపోర్టు ఇప్పటికే ముఖ్యమంత్రి టేబుల్ పైకి చేరినట్లు తెలుస్తోంది. ఇందులో తక్కువ మార్కులు వచ్చిన జిల్లాలు, శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ దృష్టి సారించారట. తక్కువ స్కోర్ వచ్చిన శాఖల ఆయా మంత్రులు, ఉన్నతాధికారులకు ఇప్పటికే అంతర్గత హెచ్చరికలు పంపిచారట.

ఏయే జిల్లాల్లో ప్రజల అసంతృప్తి ఎక్కువగా ఉందో, ఆ జిల్లాల పర్యటనలకూ సీఎం ప్రత్యేక ‘రూట్ మ్యాప్’ సిద్ధం చేసుకున్నారు. స్వయంగా రంగంలోకి దిగి లోపాలను సవరించనున్నారు.సర్వే ఫలితాల ప్రకారం.. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి.గ్లోబల్ కంపెనీల రాకతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కుతోంది.మున్సిపల్ సేవల డిజిటలైజేషన్ ఇక్కడ సత్ఫలితాలను ఇస్తోంది.రెవెన్యూ ఫైల్స్‌ను వేగంగా పరిష్కరించడంలో ఈ జిల్లాలు టాప్ స్కోర్ సాధించాయి. ప్రభుత్వ ఖజానాకు సింహభాగం ఆదాయం ఇక్కడి నుంచే వస్తుండటం విశేషం.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వ్యవసాయం, విద్యారంగాల్లో గణనీయమైన పురోగతి ఉన్నట్లు సర్వే గుర్తించింది. అయితే, ఇక్కడ ఒక ప్రధాన సమస్య ప్రభుత్వానికి సవాలుగా మారింది.శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందడంలో జాప్యం జరుగుతోంది. మంత్రులు, అధికారుల మధ్య ‘కమ్యూనికేషన్ గ్యాప్’ వల్ల కొన్ని ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నట్లు నివేదిక స్పష్టం చేస్తున్నాయట.

సర్వేలో అత్యంత ఆందోళనకరమైన ఫలితాలు ప్రధానంగా ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలు. ఇక్కడ పాలన మందగించిందని సర్వే తేల్చిందట.గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కొరత తీవ్రంగా ఉంది. దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాల పరిష్కారంలో యంత్రాంగం విఫలమైంది. ఇక్కడ ప్రతిపాదించిన పారిశ్రామిక ప్రాజెక్టులు వేగవంతం కాకపోవడంతో నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. ఇది ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ప్రతికూల అంశంగా మారింది.

ప్రభుత్వం భారీ స్థాయిలో అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ, అభివృద్ధి కేవలం హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతమైంది.జిల్లాలకు విస్తరించేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. జిల్లాల్లోనూ హైదరాబాద్ తరహా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం త్వరలోనే భారీ ‘ఇన్ ఫ్రాస్ట్రక్చర్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేస్తోంది.రైతు పథకాల కొనసాగింపుపై క్షేత్రస్థాయిలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.

అంతేగాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఏ పంట వేయాలో, మార్కెట్ మద్దతు ఎలా ఉంటుందో అన్న విషయంలో రైతులకు స్పష్టమైన మార్గనిర్దేశం లేదని సర్వే తేల్చింది. ముఖ్యంగా ‘భూ భారతి’ వంటి కార్యక్రమాలు తెచ్చినప్పటికీ, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌లో జాప్యం, పాత వివాదాల పరిష్కారంలో నత్తనడక ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని తగ్గించాయి.

సామాన్యుడికి అత్యంత కీలకమైన ఈ రెండు రంగాలైన విద్య, వైద్యంపై ప్రభుత్వం బలమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.చాలా జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదనే నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.జిల్లా ఆసుపత్రులను ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, డాక్టర్ల కొరత మరియు గ్రామీణ ప్రాంతాల్లో సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది.

రోజురోజుకు తెలంగాణలో పాలనా ముఖచిత్రం మారుతూ వస్తుందని చెప్పవచ్చు. ఎందుకుంటే గత పదేళ్ల కాలంలో సాగిన ‘కేంద్రీకృత’ పాలనకు భిన్నంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘వికేంద్రీకరణ’ మంత్రాన్ని జపిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. అయితే, అధికారం కిందిస్థాయికి వెళ్తున్న కొద్దీ, పర్యవేక్షణ లోపించి ఫలితాలు తలకిందులవుతున్నాయనే ఆందోళన సైతం ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. అందులో భాగంగా రెండేళ్ల పాలనపై సిద్ధమైన ‘స్కోర్ కార్డ్’ సంచలన వాస్తవాలతోనే భారీ మొత్తంలో ఉన్నాతాధికారులు బదిలీలు కారణంగా భావిస్తున్నారు.

గత ప్రభుత్వంలో కీలక నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వెలువడేవి. మార్గదర్శకాలు, అమలు తీరు అంతా ఒకే కేంద్రం నుంచి నియంత్రించబడేది. కానీ, రేవంత్ సర్కార్‌లో మంత్రులు, సెక్రటరీలు మరియు జిల్లా కలెక్టర్లకు స్వేచ్ఛనిచ్చారు.అధికారం వికేంద్రీకరణ జరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అనేక వివాదాలు, విమర్శలు తలెత్తాయి. అప్పుడే కొన్ని శాఖల్లో సమన్వయ లోపం వల్ల ప్రభుత్వం విపక్షాల విమర్శలకు గురవ్వాల్సి వచ్చిందని సీఎం భావించారట.

కేవలం సెక్రటేరియట్ నుంచి వచ్చే నివేదికలే కాకుండా, జిల్లాల్లో సంక్షేమ పథకాల అమలుపై ‘గ్రౌండ్ రిపోర్ట్’ ఆధారంగా కలెక్టర్ల స్కోర్ కార్డ్ తయారు చేస్తున్నారు.పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా? లేదా మధ్యలోనే ఆగిపోతున్నాయా? అనే అంశంపై కలెక్టర్ల పనితీరును తూకం వేయనున్నారు. తక్కువ స్కోర్ వచ్చిన జిల్లాల అధికారులతో సీఎం స్వయంగా ముఖాముఖి చర్చించి, లోపాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు.సెక్రటేరియట్ నుంచి ఫీల్డ్ లెవల్ వరకు పాలనను ఒక గాడిలో పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. “అధికారం ఇచ్చాం.. బాధ్యత కూడా మీదే” అని అధికారులకు, నేతలకు ఆయన స్పష్టమైన సందేశం పంపారు.

రెండేళ్లు గడిచినా భూ సమస్యలు, వైద్య సేవలు, విద్యా రంగాల్లో ప్రజలకు పూర్తి నమ్మకాన్ని కలిగించలేకపోయామనే ఫీడ్ బ్యాక్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఈ లోపాలను సవరించుకోకపోతే రాబోయే ఎన్నికల నాటికి ఇది ప్రభుత్వానికి పెద్ద మైనస్ అయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈక్రమంలోనే పాలనలో వేగం పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ స్థాయిలో పర్యవేక్షణకు సిద్ధమయ్యారు.ప్రతి శాఖ పనితీరును ప్రజలు గమనించేలా జిల్లా స్థాయి కార్యాలయాల్లో డ్యాష్‌బోర్డ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఏ పని ఎక్కడ ఆగిందో, ఏ అధికారి దగ్గర ఫైల్ ఉందో ఇక సామాన్యుడికి కూడా తెలిసిపోతుంది. బదిలీల్లో రాజకీయ సిఫార్సులకు తావులేకుండా, పనితీరు ఆధారంగా మాత్రమే ఉండేలా కొత్త బదిలీ విధానాన్ని రూపొందిస్తున్నారు.

రాబోయే మూడేళ్లలో రాష్ట్ర రూపురేఖలు మార్చేలా ‘విజన్ 2047’ డాక్యుమెంట్ ఆధారంగా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఒప్పందాల స్థాయి నుంచి ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో మొదలయ్యేలా కఠిన పర్యవేక్షణ చేయబోతుంది.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది కొరత తీర్చడం, మెడికల్ కాలేజీల సమర్థ నిర్వహణ, మరియు పాఠశాలల్లో విద్యార్థుల ‘లెర్నింగ్ అవుట్‌కమ్’ ఆధారంగా ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేస్తారట.

కేవలం సాగుకే కాకుండా, పండిన పంటకు మార్కెట్ లింకేజ్ బలోపేతం చేయడం ద్వారా రైతుకు లాభం చేకూర్చే ప్రయత్నం చేయబోతున్నారు. భూ వివాదాల పరిష్కారానికి కాలపరిమితి విధిస్తూ, శాఖల మధ్య డేటా సమన్వయం పెంచేలా రెవెన్యూ శాఖలో మార్పులు తీసుకోస్తున్నారు. ఈ స్కోర్ కార్డ్ విశ్లేషణలో ఒక విప్లవాత్మక ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఎంత వరకు పనిచేసింది, ఏయే లక్ష్యాలు సాధించింది అనే అంశంపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ‘పాలనా వైట్ పేపర్’ విడుదల చేయనున్నారు.

జిల్లా కలెక్టర్లకు నిర్దిష్ట లక్ష్యాలు విధించనున్నారు. ఇచ్చిన సమయంలో పని పూర్తి చేయని పక్షంలో స్కోర్ కార్డ్‌లో మార్కులు తగ్గి, అది వారి సర్వీస్ రికార్డుపై ప్రభావం చూపేలా చర్యలు ఉండనున్నాయి.అధికారుల బదిలీల్లోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. కేవలం సిఫార్సులకే కాకుండా, పనితీరు ఆధారంగానే పోస్టింగ్‌లు ఇచ్చేలా పారదర్శక విధానాన్ని తీసుకురానున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరిపాలనా పనితీరుపై ‘వైట్ పేపర్’ విడుదల చేస్తామని ప్రకటించడం ద్వారా జవాబుదారీతనాన్ని పెంచాలని రేవంత్ భావిస్తున్నారు.

పని చేసేవారికే పదవి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు” అనే సంకేతాన్ని రేవంత్ రెడ్డి ఈ స్కోర్ కార్డ్ ద్వారా స్పష్టం చేశారు. భూ వివాదాల పరిష్కారం, వైద్య-విద్యా రంగాల బలోపేతంపై రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కాంగ్రెస్ సర్కార్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.