ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని సీఎం చంద్రబాబు అన్నారు. దాదాపు 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత, పార్లమెంట్ ఉభయ సభలు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవంగా ఆమోదించడం ఐదు కోట్ల ఆంధ్రుల విజయంగా పేర్కొన్నారు. శుక్రవారం ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విభజన నాటి కష్టాల నుంచి నేటి చట్టబద్ధత వరకు జరిగిన పరిణామాలను వివరిస్తూ, భవిష్యత్తులో రాజధానిపై ఎవరూ కుట్రలు చేయలేని విధంగా గట్టి పునాది పడిందని స్పష్టమైంది.
50 పార్టీల మద్దతు.. ఒక్క ‘వైసీపీ’ వ్యతిరేకత
అమరావతికి దక్కిన ఈ గౌరవం వెనుక దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీల సహకారం ఉంది.పార్లమెంట్ చర్చ: లోక్‌సభ, రాజ్యసభల్లో జరిగిన చర్చల్లో 11 పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనగా, మొత్తం 50 పార్టీలు అమరావతికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటించాయి.దేశమంతా ఒకదారిలో నడిస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాజధానిని వ్యతిరేకించడం గమనార్హం. రాష్ట్రం నాశనమైనా పర్వాలేదు అన్న పట్టుదలతో వైసీపీ చేసిన కుట్రలను దాటుకుని అమరావతి గెలిచింది.
ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు
అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో ముందుండి నడిపించిన ప్రధాని నరేంద్ర మోదీకి, ప్రక్రియను వేగవంతం చేసిన హోం మంత్రి అమిత్ షాకు ఐదు కోట్ల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి అధికారికంగా చలామణిలోకి రానుంది.
విభజన గాయాలు.. నిర్మాణ సంకల్పం
2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆదాయం లేక, రాజధాని లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడ్డ మనోవేదన వర్ణనాతీతం. ఆనాడు సైబరాబాద్‌ను నిర్మించిన అనుభవంతో, నవ్యాంధ్రకు కూడా ఒక అద్భుతమైన రాజధాని కావాలని సంకల్పించాం.విభజన సమయంలో రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని కోరుకున్నాం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం, గుండెకాయ లాంటి అమరావతి.. ఈ రెండూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలని ఆనాడే గుర్తించాం.
కేంద్ర రాజముద్రతో స్పష్టత
రాజధానిపై గత కొన్నేళ్లుగా సాగుతున్న సందిగ్ధతకు కేంద్ర రాజముద్రతో తెరపడింది. ఇది కేవలం ఒక నగరం కాదు, ప్రజల ఆశలు, ఆశయాల ప్రతిరూపం. భవిష్యత్తులో ఎవరు ఎన్ని మాట్లాడినా, పార్లమెంట్ చేసిన ఈ చట్టం అమరావతికి రక్షణ కవచంలా నిలుస్తుంది.