వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు రూటు మార్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన అడుగులు ఇప్పుడు సరికొత్త రాజకీయ వ్యూహానికి సంకేతం ఇస్తున్నాయి. తనపై జరిగిన దాడిని, అరెస్టును కేవలం వ్యక్తిగత అంశంగా కాకుండా.. ఒక సామాజిక వర్గంపై జరుగుతున్న అణచివేతగా చిత్రీకరిస్తూ ‘విక్టిమ్ కార్డ్’ను బలంగా ప్రయోగిస్తున్నారు. దశాబ్దాల క్రితంటి వంగవీటి రంగా హత్య ఉదంతాన్ని, ముద్రగడ పద్మనాభంపై జరిగిన వేధింపులను ప్రస్తుత పరిణామాలతో ముడిపెడుతూ.. కాపు సామాజిక వర్గంలో సెంటిమెంట్ రగిల్చేలా అంబటి వేస్తున్న స్కెచ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఆయన గళం పెంచడం వెనుక వైసీపీ భారీ వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో 18 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిన ఆయన, ఇప్పుడు దూకుడు పెంచారు. తాజాగా విశాఖపట్నంలో పర్యటించిన అంబటి, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన అరెస్ట్, తన ఇంటిపై జరిగిన దాడి కేవలం యాదృచ్ఛికం కాదని, దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
విశాఖలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అంబటి, తన నివాసంపై జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.గుంటూరులో నా ఇంటిపై జరిగిన దాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. గంటల తరబడి విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్వయంగా మానిటరింగ్ చేశారని, వారి కనుసన్నల్లోనే ఈ దౌర్జన్యం జరిగిందని ఆరోపించారు.లోకేష్ ‘రెడ్ బుక్’ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ముఖ్యంగా దివంగత నేత వంగవీటి మోహన రంగా హత్య ఉదంతాన్ని తనపై జరిగిన దాడితో పోల్చుతూ ఆయన చేసిన విశ్లేషణ తీవ్ర చర్చకు దారితీసింది.నాడు వంగవీటి రంగా హత్య పోలీసుల సహకారంతోనే జరిగింది. నేడు నా ఇంటిపై జరిగిన దాడి కూడా అదే పద్ధతిలో సాగింది. పోలీసుల సమక్షంలోనే విధ్వంసం సృష్టించారు. నన్ను చంపినా అడిగే దిక్కు లేని పరిస్థితి కల్పించారు. అదే జరిగి ఉంటే ఇవాల్టికి నా చావుకు 30 రోజులు గడిచిపోయేవి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేవలం సీఎంను విమర్శించినందుకే తనను 18 రోజులు జైలుకు పంపారని, ఇదేనా మీ గవర్నెన్స్? అని చంద్రబాబును ప్రశ్నించారు. జైలుకు వెళ్తే కనీసం నెల లేదా మూడు నెలలు పడుతుందని భావించానని, కానీ 18 రోజులకే బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చారు.
కేవలం తనపై జరిగిన దాడిని మాత్రమే కాకుండా, గతంలో కాపు సామాజిక వర్గ నేతలు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన వరుసగా ఏకరువు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో కాపు నేతలు లక్ష్యంగా చేసుకోబడ్డారనే వాదనను ఆయన గట్టిగా వినిపిస్తున్నారు.రంగా హత్యకు ముందు ఆయన శిబిరంలో పోలీసులు తనిఖీలు చేసి వెళ్లారు. ఆ తర్వాతే దాడి జరిగింది. ఇప్పుడు నా విషయంలోనూ అదే జరిగింది. నా ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు తనిఖీలు పేరుతో లోపలికి వచ్చి, బయట అరాచకానికి మార్గం సుగమం చేశారు” అని ఆయన ఆరోపించారు. పోలీసుల సహకారం లేకుండా ఇలాంటి దాడులు సాధ్యం కాదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దాడేనని ఆయన స్పష్టం చేశారు.
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంశాన్ని కూడా అంబటి తెరపైకి తెచ్చారు.ముద్రగడను ఉద్యమ బాట పట్టించింది చంద్రబాబు కాదా? కాపులను బీసీల్లో చేరుస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా?” అని ప్రశ్నించారు. గతంలో ముద్రగడను హతమార్చడానికి కుట్రలు జరిగాయని, ఆనాడు అందరం కలిసి అడ్డుకున్నామని గుర్తు చేశారు. ముద్రగడ కుటుంబం ఎదుర్కొన్న అవమానాలను మళ్ళీ చర్చకు తెచ్చారు.
టీడీపీ నేతలు తనను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తన గళం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని స్పష్టం చేశారు.నేను జైలు నుంచి వచ్చాక నా వాయిస్ తగ్గుతుందని, రెడ్ బుక్ దెబ్బకు వణికిపోతానని టీడీపీ నేతలు అనుకున్నారు. కానీ నా పొగరు, నా వాయిస్ ఏమాత్రం తగ్గలేదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, బాబు పతనం మొదలైంది అని హెచ్చరించారు.
తన కష్టకాలంలో అండగా నిలిచిన కాపు సామాజిక వర్గ నేతలకు అంబటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీలకు అతీతంగా తనకు మద్దతుగా నిలిచిన కాపు నేతలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో అరాచక పాలన: గత రెండేళ్లుగా ఏపీలో అత్యంత దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని, దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మొత్తానికి, అంబటి రాంబాబు తన 18 రోజుల జైలు జీవితాన్ని ఒక రాజకీయ మైలేజీగా మార్చుకునే పనిలో పడ్డారు. “నాడు రంగా.. నేడు అంబటి” అనే తరహాలో సాగుతున్న ఈ ప్రచారం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని కాపు నేతలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. అభివృద్ధి, పాలన కంటే.. ‘ఆత్మగౌరవం, అణచివేత’ అనే అంశాల చుట్టూ రాజకీయాన్ని తిప్పడం ద్వారా కూటమి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఒకవైపు రెడ్ బుక్ అమలుపై ప్రభుత్వం ధీమాగా ఉంటే, మరోవైపు అదే రెడ్ బుక్ తనను ఏమీ చేయలేదని అంబటి సవాల్ చేస్తున్నారు. ఈ ‘సెంటిమెంట్ పాలిటిక్స్’ రాబోయే రోజుల్లో ఏపీలో ఏ తరహా సామాజిక సమీకరణాలకు దారితీస్తుందో వేచి చూడాలి. చంద్రబాబు పతనం మొదలైందని అంబటి చేస్తున్న హెచ్చరికలు కేవలం ఆవేశమేనా లేక వెనుక ఏదైనా బలమైన సామాజిక మద్దతు ఉందా అనేది కాలమే నిర్ణయించాలి.