Kadapa: షార్ట్ ఫిలిం షూటింగ్‌లో ఘోర విషాదం: పెన్నా నదిలో మునిగి ముగ్గురు యువకులు మృతి

సరదాగా షార్ట్ ఫిలిం తీద్దామని వెళ్లిన ఆ యువకుల కలలు పెన్నా నదిలో కలిసిపోయాయి. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి సమీపంలో పెన్నా నది వద్ద చిత్రీకరణకు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ప్రాణాలు తీసిన సరదా
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎనిమిది మంది యువకులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. వీరంతా కలిసి “ఫ్రంట్‌లైన్ ప్రెస్” (Frontline Press) అనే పేరుతో షార్ట్ ఫిలిమ్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ప్రాజెక్ట్ కోసం వల్లూరు మండలం పుష్పగిరి పరిధిలోని పెన్నా నది వద్దకు చేరుకున్నారు.

ప్రమాదం జరిగిందిలా..
షూటింగ్ చేస్తున్న సమయంలో హరిబాబు (25), హర్షవర్ధన్ (22), కృష్ణచైతన్య (20) అనే ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నదిలో లోతైన ప్రాంతానికి వెళ్లి మునిగిపోయారు. గమనించిన తోటి మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

కొనసాగుతున్న గాలింపు చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.ఇప్పటివరకు హరిబాబు, హర్షవర్ధన్ మృతదేహాలు లభ్యమయ్యాయి.కృష్ణచైతన్య మృతదేహం కోసం పోలీసులు, గాలింపు బృందాలు ఇంకా వెతుకుతూనే ఉన్నాయి.మృతి చెందిన యువకుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.