ఆంధ్ర విశ్వవిద్యాలయ (AU) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు మరియు మెగా కల్చరల్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యార్థులను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. తనకు ఇక్కడ చదువుకునే అవకాశం రాకపోయినా, విద్యార్థుల ప్రేమాభిమానాల మధ్య ఈ వేదికపై నిలబడటం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు.
యూనివర్సిటీ లోగోలోని సూర్యుడు, తామరపువ్వు, లక్ష్మీ-సరస్వతుల కలయికను పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ ఎంబ్లమ్ జ్ఞానానికి, అభివృద్ధికి నిదర్శనమని, వర్సిటీ విజన్ మొత్తం ఇందులోనే ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
విద్యార్థుల ముందు మాట్లాడటమే నాకు పెద్ద సాహసంగా అనిపిస్తుందని పవన్ అన్నారు. వారి మనసు స్వచ్ఛమైనదని విద్యార్థులు అడిగే నిక్కచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టంగా ఉంటుందన్నారు. అందుకే మీ ముందు తెలివితేటలతో కాకుండా మనసుతో మాట్లాడుతున్నాను అని వ్యాఖ్యానించారు.
తన ఆత్మీయుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యూనివర్సిటీలోనే న్యూక్లియర్ ఫిజిక్స్ చదివారని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆయన ద్వారానే ఇక్కడి ప్రొఫెసర్ల నిబద్ధత, ఆంధ్ర విశ్వవిద్యాలయ వైభవం గురించి తనకు తెలిసిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మరియు అధ్యాపక బృందానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో విద్యార్థుల కోలాహలం, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.