AP: ఖాకీలకే షాక్ ఇచ్చిన జూదగాళ్లు: భీమవరంలో నెలకు రూ. 30 లక్షల మామూళ్లు.. పవన్ కళ్యాణ్ నిశ్శబ్దం ఎందుకు?

కోడి పందేలకు కేరాఫ్ అడ్రస్.. బెట్టింగులకు బ్రాండ్ అంబాసిడర్.. భీమవరంలో ఇప్పుడు ‘కోత’ ముక్క కలకలం రేపుతోంది! ఖాకీల లాఠీలు అక్కడ పనిచేయవా? ప్రజాప్రతినిధుల అండతో పేకాట క్లబ్‌లు మాఫియాలా మారిపోయాయా? ఏకంగా ఒక డీఎస్పీ స్థాయి అధికారి బదిలీ వెనుక ఈ జూదగాళ్ల హస్తం ఉందా? నెలకు లక్షల రూపాయల మామూళ్లు.. కోట్లలో చేతులు మారే జూదం. భీమవరం పేకాట పంచాయితీలో ఏం జరుగుతోంది.

 

భీమవరం.. పేరు వింటేనే సంక్రాంతి సందడి, కోడి పందేల హోరు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ 365 రోజులూ ‘కొయ్ రాజా కొయ్’ అంటూ పేకాట క్లబ్‌లు జోరుగా సాగుతున్నాయి. పది వేల నుంచి పది లక్షల దాకా.. ఏ రేంజ్‌కి ఆ రేంజ్ ఆట! ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జూదగాళ్లకు ఇక్కడ కొత్త అల్లుళ్ల మర్యాదలు జరుగుతుంటాయి. అయితే, ఇది కేవలం ఆట కాదు.. ఒక వ్యవస్థీకృత మాఫియాగా రూపాంతరం చెందిందన్నది తాజా ఆరోపణ.

ఈ మాఫియా పవర్ ఎంతంటే.. అడ్డుపడితే ఎంతటి ఆఫీసరైనా షాక్ తినాల్సిందే! ఇటీవల భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీనే ఇందుకు నిదర్శనమని స్థానికులు చర్చించుకుంటున్నారు. పేకాట క్లబ్బులను అరికట్టాలని చూసినందుకు ఆయన్ని వీఆర్‌కు పంపించారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేకు నెలకు 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.ఎమ్మెల్యే సన్నిహితుడైన ఒక చోటా నేత కొత్త క్లబ్‌ను ఏర్పాటు చేయడం.. ఉన్నతాధికారులు దాన్ని మూయించే ప్రయత్నం చేయడంతోనే అసలు కథ మొదలైందట. ఇదే అక్కడ పోలీసు ఉన్నతాధికారి బదిలీకి కారణమైందట.

 

డీఎస్పీని పక్కకు తట్టేసిన ఉత్సాహంలో ఉన్న నిర్వాహకులు.. ఇప్పుడు మరింత బరితెగిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ మొదలవుతుండటంతో 30 క్లబ్‌లు, 300 ఆటలు అన్న చందంగా సిద్ధమవుతున్నారు. పోలీసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా “జాగ్రత్తగా” చూసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారట. మరోవైపు అధికారులపై చర్యలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. యధేచ్ఛగా సాగుతున్న ఈ పేకాట క్లబ్బుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

భీమవరాన్ని జూద కేంద్రంగా మారుస్తున్న ఈ క్లబ్ నిర్వాహకులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందా? లేక రాజకీయ అండదండలతో ఈ మాఫియా ఇలాగే చెలరేగిపోతుందా? ‘భీమవరంపై స్పెషల్ ఫోకస్ పెడతా’ అన్న పవన్ కళ్యాణ్.. ఈ కోత ముక్క రాయుళ్ల ఆట కట్టిస్తారా లేదా అన్నది వేచి చూడాలని స్థానికులు అంటున్నారు. చూశారుగా.. చట్టాన్ని చుట్టేస్తున్న పేకాట మాఫియా ఆగడాలు. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో చూడాలంటున్నారు.