పదేళ్లూ వెలుగు వెలిగారు.. జిల్లా రాజకీయాలను శాసించారు.. వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనంగా సాగింది. కానీ, అధికారం చేజారగానే సీన్ రివర్స్ అయింది. నిన్నటి దాకా ‘చక్రం’ తిప్పిన మాజీ అమాత్యులు ఇప్పుడు ‘సైలెంట్’ మోడ్‌లోకి వెళ్లిపోయారు. గులాబీ పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అధిష్టానం పిలుపునిచ్చినా.. కేడర్ ఎదురుచూస్తున్నా.. మాజీ మంత్రులు మాత్రం ‘అంటీముట్టనట్లు’ వ్యవహరిస్తుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో సదరు నేతలు ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం, అండదండలతో జిల్లాల్లో తమ మాటే నెగ్గేలా చూసుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారైనా సరే, మంత్రులుగా అపరిమితమైన అధికారాలు అనుభవించారు. అయితే, ఎప్పుడైతే అధికారం పోయిందో.. అప్పటి నుంచి వీరిలో మునుపటి జోష్ కనిపించడం లేదు. ఇద్దరు ముగ్గురు నేతలు మినహా, మిగతా మాజీలంతా జనానికి దూరంగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకప్పుడు ఆ భవనం నిత్యం నేతలతో, కార్యకర్తలతో కళకళలాడేది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే గులాబీ శ్రేణులతో ‘తెలంగాణ భవన్’ ఎప్పుడూ కిటకిటలాడేది. కానీ, సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అధికారం ఉన్నప్పుడు అక్కడే తిష్టవేసిన మాజీ అమాత్యులు, ఇప్పుడు అటువైపు చూడటానికే ఇష్టపడటం లేదు. చుట్టపు చూపుగా కూడా రాకపోవడంతో.. అధికారం లేకపోతే పార్టీ ఆఫీస్ అంటరానిదా? అంటూ కేడర్ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తోంది.దేళ్లపాటు చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు నియోజకవర్గాలకు, జిల్లాలకు పరిమితమయ్యారా అంటే అదీ లేదు. కనీసం కార్యకర్తలకు ముఖం చూపించడానికి కూడా వారు వెనుకాడటం చర్చనీయాంశంగా మారింది.
ప్రజా సమస్యలపై పోరాడటం అటుంచి, కనీసం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం కూడా గగనమైపోయింది.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన నాయకులు, “మాకేం పట్టనట్లు” వ్యవహరించడంపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి.తెలంగాణ భవన్ వైపు చూడకపోవడానికి వెనుక బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో హల్ చల్ చేసిన వారు, ఇప్పుడు ఓటమి భారంతో బయటకు రావడానికి మొగ్గు చూపడం లేదు.కొందరు నేతలు తమ వ్యాపారాలను కాపాడుకోవడానికే సైలెంట్ అయ్యారని, అధికార పక్షంతో గొడవ ఎందుకనే ధోరణిలో ఉన్నారని సమాచారం. పార్టీ భవిష్యత్తుపై స్పష్టత లేక, వేరే దారి చూసుకోవాలా? లేక వేచి చూడాలా? అన్న ‘సొంత లెక్కల్లో’ మునిగిపోయినట్లు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఎంతమంది మాజీలు ఉన్నా, కేవలం ఇద్దరు నేతలు మాత్రమే ప్రస్తుతం పార్టీకి కవచంలా నిలుస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చినా, ఇవ్వకపోయినా నిత్యం తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కనిపిస్తూ, కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా నేతగా సబితా ఇంద్రారెడ్డి: క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పార్టీ కార్యక్రమాలను భుజానికెత్తుకుంటున్నారు. ఈ ఇద్దరు మినహా మిగతా గ్రేటర్ మాజీలంతా ‘సైలెంట్ మోడ్’లోకి వెళ్ళిపోయారనే విమర్శలు వస్తున్నాయి.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మాత్రం నియోజకవర్గాల్లో పట్టు సడలకుండా చూసుకుంటున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కేడర్‌కు భరోసా ఇస్తున్నారు.ఖమ్మం జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీరుపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సొంత నియోజకవర్గమైన ఖమ్మంలో కూడా ఆయన పర్యటించడం లేదని, కేవలం పార్టీ అగ్రనేతలు వచ్చినప్పుడు మాత్రమే ‘ముఖం’ చూపిస్తున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. యాక్టివ్ పాలిటిక్స్‌కు ఆయన దూరంగా ఉంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అధికారం ఉన్నప్పుడు అంతా తామై నడిపించిన నేతలు, ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోకపోవడం దారుణం. తెలంగాణ భవన్‌కు రావడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలా?” అని సీనియర్ కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో పార్టీకి ఎదురుగాలి వీయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో కార్యకర్తలకు అండగా నిలవాల్సిన మాజీలు, కనీసం నియోజకవర్గాల్లో పర్యటించకపోవడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది.గత పదేళ్లుగా తిరుగులేని పట్టున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సైతం ఓటమి ఎదురుకావడంతో.. ఇది నాయకత్వ లోపమేనని కేడర్ బాహాటంగానే వాపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి మాజీ అమాత్యుల ‘మౌనమే’ ప్రధాన కారణమని పార్టీ పెద్దలు సైతం ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.
మంత్రులుగా ఉన్నప్పుడు నిత్యం విస్తృత పర్యటనలు, భారీ బహిరంగ సభలతో హడావుడి చేసిన నేతలు.. అధికారం పోగానే ‘సైలెంట్ మోడ్’లోకి వెళ్లిపోవడం గులాబీ బాస్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఏదైనా పార్టీ ముఖ్యనేత వస్తే తప్ప క్షేత్రస్థాయికి వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంపై పోరాడటంలోనూ, ప్రజా సమస్యలను హైలైట్ చేయడంలోనూ మాజీ మంత్రులు వెనుకబడ్డారని, దీంతో కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటోందని విశ్లేషణలు సాగుతున్నాయి. కొందరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై డైలమాలో ఉండి, పార్టీకి దూరంగా ఉంటున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మా కోసం నిలబడే నాథుడే లేడు” అని ద్వితీయ శ్రేణి నాయకత్వం మండిపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకున్న నేతలు, ఇప్పుడు అవసరమైనప్పుడు ముఖం చాటేయడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులపై బీఆర్ఎస్ అధిష్టానం ఒక నివేదిక సిద్ధం చేస్తోందని, పనిచేయని నేతలపై కఠిన చర్యలు ఉంటాయనే ప్రచారం తెలంగాణ భవన్లో జోరుగా సాగుతోంది.
మొత్తానికి, స్థానిక సంస్థల ఫలితాలు గులాబీ పార్టీకి ఒక ‘వేక్ అప్ కాల్’ లాంటివి. మరి ఇప్పటికైనా ఈ మాజీలు తమ తీరు మార్చుకుని బయటకు వస్తారా? లేక ఇలాగే మౌనంగా ఉండి పార్టీకి మరింత నష్టం చేకూరుస్తారా? అన్నది వేచి చూడాలి.