టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. వాటిని కూడా అవలీలగా నెగ్గుకు రాగలరు. తన పొలిటికల్ కెరీర్లో ఎన్నోడక్కా ముక్కీలు చూసి వచ్చారు. ప్రత్యేకించి.. పబ్లిసిటీలో చంద్రబాబు లాంటి ఐడియాలు ఇంకెవ్వరికీ అంత తొందరగా ఒంటబట్టవు. రావు కూడా. బేసిక్‌గా చంద్రబాబు ఎవరితో అయినా పనికాకపోతే వారిపై వేటు వేసేముందు వారిపై రకరకాల ఆరోపణలతో స్టోరీలు వండివారుస్తారు. ఆ తర్వాత వారిపై ఆయన సస్పెన్షో .. వేటో వేస్తారు. కానీ ఇప్పుడు చంద్రబాబు తన బలహీనతలను తనే బయట పెట్టుకుంటున్నారు. ఇది తెల్సి చేస్తున్నారా? లేక తెలియక అనుకోకుండా మనస్సులో మాటలు తెలిసో తెలియకో అన్యోపదేశంగా బయటకు వచ్చేస్తున్నాయి. ఇంతకీ ఏ విషయంలో చంద్రబాబు ఇలా బయటపడుతున్నారో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం..
తెలుగుదేశం పార్టీలో నాయకులు, ఎమ్మెల్యేలపై చంద్రబాబుకు గ్రిప్ పోతోందా? పార్టీలో అధినేత మాటను నాయకులు, నియోజకవర్గ ఇంచార్జిలు, ఎమ్మెల్యేలు ఏమాత్రం ఖాతరు చేయట్లేదా అంటే.. పైకి ఎవ్వరూ ఏమీ చెప్పకపోయినా పరోక్షంగా అలాంటి పరిస్థితే ఉందని అంటున్నారు. స్వయంగా చంద్రబాబే తన మనస్సులోని మాటల్ని వెల్లడిస్తున్నారు. లేదని.. ఆయన మాటల్ని బట్టే అర్థమవుతోంది! నాలుగోసారి ముఖ్యమంత్రిగా అధికారం నెరపుతున్న ఈ సీనియర్ నాయకుడు.. కనీసం తన సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద పట్టు చూపించలేకపోతున్నారా అని ప్రజలకు జాలి కలుగుతోంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి తన స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత.. అప్పటికి చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో చాలా మందిని పార్టీనుంచి బయటకు పంపారు. మరికొందరు రాజీ పడ్డారు. కానీ.. తర్వాతికాలంలో నాయకులుగా ఎదిగిన వాళ్లు చంద్రబాబు నాయకత్వాన్ని ఆమోదిస్తూ, ఆయన గుత్తాధిపత్యానికి లోబడి ఉంటున్నవాళ్లే. అలాంటి పరిస్థితుల్లోనూ.. ఎమ్మెల్యేలు తన మాట వినడం లేదని, దారిలోకి రావడం లేదని చంద్రబాబు స్వయంగా చెప్పుకోవడాన్ని గమనిస్తే రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. సొంత ఎమ్మెల్యేలు కూడా తన మాట విననందుకు చంద్రబాబునాయుడు దురపిల్లుతున్నారా? లేదా, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి అడ్డదారులు తొక్కుతోంటే, వారితో తనకు సంబంధం లేదని డిస్క్లయిమర్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సీఆర్డీయే సమావేశం తర్వాత కొందరు మంత్రులతో సమావేశమైన చంద్రబాబునాయుడు తన ఆక్రోశాన్ని, ఆగ్రహం రూపంలో వెళ్లగక్కారంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలోనూ బ్రేకింగ్స్ వచ్చాయి. అంటే ఇవి లీకులు అని అర్థం చేసుకోవాలి. 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి హెచ్చరించానని, అందులో కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దారిలోకొచ్చారని, మిగిలిన వారు మారలేదని చంద్రబాబు మండిపడ్డారట. అంటే ఇది నాయకత్వ వైఫల్యమే. నాయకుడు పిలిచి హెచ్చరించినా బేఖాతరు చేశారంటే దాని తీవ్రతను చంద్రబాబు అర్థం చేసుకోలేక పోతున్నారా లేక ఇక అధికారంలోకి రాము ఇళ్లు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలని ఫీలవుతున్నారా అన్నది చంద్రబాబే చెప్పాలి. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు పిలిచి ఎమ్మెల్యేలను మందలిస్తే 40లో 15 మంది మాత్రమే మాట విన్నారంటే.. ఎంత పరువు నష్టం అని ఇది విన్నవారంతా తెగ ఫీలైపోతున్నారు.తెలుగు తమ్ముళ్లైతే సోషల్ మీడియాలో దీనిపై నారేషన్ ఇస్తున్నారు. చంద్రబాబు అతి మంచితనమే పార్టీ నాయకులు అలుసుగా తీసుకుంటున్నారని సణుగుతున్నారు.
తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో అరాచకవాదులుగా, దారితప్పిన వారిగా చంద్రబాబు గుర్తించినది 40 మంది మాత్రమే. మరి, చంద్రబాబు రాడార్ కు చిక్కకుండా దందాలు సాగిస్తున్న ఎమ్మెల్యేలు, నాయకులు ఇంకెందరున్నారో ప్రస్తుతానికైనా తెలీదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం చంద్రబాబు పిలిచిన 40 మంది ఎమ్మెల్యేలోనూ 63 శాతం మంది అధినేత మాటను బేఖాతరు చేస్తున్నారు. పార్టీకి, ఆయన నాయకత్వానికి ప్రమాదఘంటికలు మోగుతున్న సంకేతం ఇది. త్వరలో నలుగురైదుగురిపై వేటు తప్పదని చంద్రబాబు హెచ్చరిస్తున్నట్లు లీకులు ఇస్తున్నారు. ఇంతగా దారితప్పిన ఎమ్మెల్యేలు 25 మంది ఉండగా.. కేవలం ఐదుగురిపై వేటు వేయడం ద్వారా చంద్రబాబు ఏం సంకేతాలు పంపాలని అనుకుంటున్నారని పొలిటికల్ క్రిటిక్స్ సెటైర్లు వేస్తున్నారు. దారి తప్పిన ఎమ్మెల్యేల్లో కొత్తవారే ఎక్కువని.. పాత వారు… ఏమో.. ఇకపై మాకు ఇది లాస్ట్ టైమని ఇప్పుడే మూటాముల్లె సర్దుకోవటం బెటరని డిసైడ్ అయిపోయారట. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ దాటిన వారే 20 మంది ఉన్నారని చెబుతున్నారట. అంటే 50 శాతం మంది పార్టీ అధినేత ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని ఆయన చెప్పదలచుకుంటున్నారా అనేది తెలియడం లేదని పార్టీలోని సీనియర్ నేతలు కూడా పరోక్షంగా మాట్లాడుతున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు పట్టు సన్నగిల్లుతోందనేది తనే ప్రత్యక్షంగా ఒప్పకోవటం ద్వారా భవిష్యత్ పరిణామాలకు తను కారణం కాదనే బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇవాళ్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్లీ కలుద్దాం. నమస్తే.. **