అమరావతిపై జగన్ ‘మావిగన్’ రాజకీయం: పార్లమెంట్‌లో వాకౌట్.. సోషల్ మీడియాలో ట్రోల్స్! కూటమి నేతల ఫైర్.

రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే.. మరోవైపు పార్లమెంట్‌లో దానికి చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా ప్రెస్ మీట్, అందులో ఆయన ప్రతిపాదించిన ‘మావిగన్’ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు వేదికవుతోంది.

 

అమరావతిని ఐదు సంవత్సరాలపాటు నాన్చినట్లే.. ఇప్పుడు మాటలే ఇప్పుడూ జగన్ చెబుతున్నాయి. సొంత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి తాను పాతాళంలోకి పడిపోయినా సిగ్గు తెచ్చుకోలేదు. అమరావతికి చట్టబద్ధత వస్తూంటే.. ఇప్పుడు ప్రెస్మీట్ పెట్టి తప్పుడు ప్రచారాలు గంటల తరబడి చేశారని కూటమి నేతలు విమర్శనాస్త్రాలు చేశారు. ఇందులో కొత్త విషయాలు ఏమైనా చెప్పారా అంటే.. ఎప్పటి నుండో చెబుతున్న ఖర్చు గురించి చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు కావాలని ఎక్కడి నుంచి వస్తాయని.. అప్పులు చేస్తున్నారని ఇతర ప్రాంతాలు ఏం కావాలని అంటున్నారు. అమరావతికి ఇప్పటి వరకూ 48వేల కోట్లు అప్పు చేశారని కూడా చెప్పారు. ఆ అప్పులు ఒకే సారి రావు. నిర్మాణం అవుతున్నకొద్దీ వస్తాయి. ఆ అప్పుల్ని అమరావతి భూముల్ని అమ్మడం ద్వారా తీరుస్తారు.. అందులో ప్రపంచబ్యాంక్ అప్పులు కేంద్రం కడుతుంది. ఇవన్నీ మాజీ సీఎంగా జగన్‌కి తెలియక కాదు. తెలిసినా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, తనను నమ్మేవాళ్లను పిచ్చి వాళ్లను చేయడానికి ఆయన వాడే రాజకీయం అని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు.

 

 

జగన్ గంటల తరబడి మాట్లాడిన ఆయన తాము వస్తే అమరావతిలోనే రాజధాని ఉంచుతామని మాత్రం చెప్పలేదు. పదే పదే వ్యతిరేకం కాదంటారు. వ్యతిరేకం కాదన్నదానికి ఇంతలా నెగిటివిటీ పెంచేలా మాట్లాడటం ఎందుకు.. అదంతా వ్యతిరేకం కాదా అంటే… అక్కడే వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయం ఉంటుంది. జగన్ మార్క్ పాలిటిక్స్ ఉంటాయి. అమరావతికి రైతులు ఇచ్చిన భూములతో రాజకీయం చేశారు. రైతుల్ని రోడ్డున పడేశారు. తాను మళ్లీ రాకపోయినా అమరావతి ఇక ఎప్పటికీ పట్టాలెక్కదు అనుకున్నంతగా ఆలస్యం చేశారు. కానీ ఇప్పుడు అన్నీ పనులు మళ్లీ ప్రారంభమై..పరుగులు పెడుతూంటే.. కొత్తగా అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడుతున్నారు.

 

జగన్ ప్రెస్మీట్ లో ఏం చెప్పినా దానికి ప్రాతిపదిక ఉండదు. అన్నీ అబద్దాలు, అవాస్తవాలే అని ఆర్థిక మంత్రి పయ్యావుల ఇటీవల వ్యాఖ్యలు చేశారు. నిజం అందరికీ తెలిసినా ఆయన అబద్దాలే చెబుతారు. ఎందుకంటే.. తనను నమ్మే వాళ్లను ఆయన గొర్రెలుగా చూస్తారు. తాను చెప్పిందే నమ్ముతారని అనుకుంటారు. మొదటి దశలో అమరావతిపై ఎన్నో ఆరోపణలు కుట్రలు చేశారు. జగన్ సీఎం అయిన ఐదేళ్లలో ఒక్కటీ నిరూపించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ అవే చేస్తున్నారు. జగన్ ఒక్క సారి కూడా అధికారంలో లేనప్పుడు.. ఆయన మాటల్ని నమ్మారేమో కానీ.. ఓ సారి చాన్స్ ఇచ్చి చూసి ఆయన పని తనం.. నిజాయితీ చూశాక.. ఇంకెవరూ నమ్మే చాన్స్ ఉండదు. ఆ విషయం మాత్రం ఆయనకు అర్థం కావడం లేదు.

 

జగన్ రాజధానిపై పెట్టిన ప్రెస్మీట్‌లోనూ అంచనాలకు మించి కంటెంట్ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఆయన సూచించిన కొత్త రాజధాని హైలెట్ . మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు వరకూ కొత్త రాజధానిని ప్రకటించాలని.. దానికి మావిగన్అని పేరు పెట్టాలని ఆయన అన్నారు. దీనికి మావిగన్ అని పేరు ఎందుకంటే.. మచిలీపట్నంలో మొదటి రెండు అక్షరాలు.. విజయవాడలోని మొదటి రెండు అక్షరాలు, గుంటూరులోని మొదటి మూడక్షరాలతో ఈ పేరు పెట్టాలట.

 

జగన్ మాటలు విని మీడియా సమావేశంలో ఉన్న వారికి ఎలా ఉందో కానీ ఆయన మాటల్ని లైవ్ లో చూస్తున్న వారికి మాత్రం తాము కరెక్ట్ గానే విన్నామా అని ఆశ్చర్యపోయారు. జగన్ ఇప్పటికి రాజధానిపై ఎన్ని మాటలు చెప్పారో అందరూ చూశారు. ఇప్పుడు కొత్తగా తన పేరు స్ఫురించేలా మావిగన్ అంటున్నారు. అసలు రాజధాని అంటే జగన్ ఏమనుకుంటున్నాడో కానీ విభజిత ఏపీతో ఓ ఆట ఆడుకుంటున్నాడు. అధికారం పోగానే.. ఆయన బెంగళూరు ప్యాలెస్ కు మకాం మార్చారు. వారానికి రెండురోజులు వచ్చి ఏపీలో ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారు.ఆయన తీరుతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కూడా ఇదేమిటి అనుకోకుండా ఉండలేకపోతున్నారు. రాజధానిపై ఓ క్లారిటీ కూడా లేకుండా పోయిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.ఓ వైపు పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరుగుతూంటే.. జగన్ ఈ డ్రామాలు ఏంటని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

 

అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని జగన్ బయటకు చెబుతున్నా.. పార్లమెంట్ లోకి వచ్చే సరికి ఆ పార్టీ వ్యతిరేకించటంపై సర్వత్రా ఆశ్చర్యపోతున్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సీపీ ఎంపీలు చర్చ సందర్భంగా వాకౌట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 చర్చ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నైజం బయటపడిందని కూటమి మండిపడుతోంది. బయట తాము అమరావతికి వ్యతిరేకం కాదని, కేవలం వికేంద్రీకరణను మాత్రమే కోరుతున్నామని చెబుతున్న వైఎస్ఆర్ సీపీ నాయకత్వం, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టగానే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

 

బిల్లు ఆమోద ప్రక్రియకు సహకరించకుండా సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా తమ వ్యతిరేకతను వైఎస్ఆర్ సీపీ ఎంపీలు బహిరంగపరిచారు. ప్రస్తుత బిల్లు రూపంలో తమకు సమ్మతం కాదని.. అయితే అమరావతికి వ్యతిరేకం కాదని మిథున్‌రెడ్డి విచిత్ర వాదన చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైఎస్ఆర్ సీపీ ఇలా చేయడం ఏమిటని ఇతర పార్టీల సభ్యులు కూడా విస్మయానికి గురి అయ్యారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీల ఈ చర్యపై అధికార పక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది. గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని ఎన్డీయే నేతలు ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంటరీ చట్టబద్ధత కల్పిస్తుంటే, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ద్వారా అమరావతిపై వైఎస్ఆర్ సీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని విమర్శించారు.

 

మొత్తానికి.. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పేరుతో అమరావతిని అంధకారంలోకి నెట్టిన జగన్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుతగులుతున్నారనేది కూటమి నేతల ప్రధాన ఆరోపణ. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చిన జగన్.. బెంగళూరు ప్యాలెస్ నుంచి వారానికి రెండు రోజులు వచ్చి చేసే ఈ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ‘మావిగన్’ రాజకీయం, అమరావతి చట్టబద్దత బిల్లు మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలని నిపుణులు అంటున్నారు.