AP: మదనపల్లె ‘ఆపరేషన్ రికార్డ్స్’ వెనుక అసలు బాస్ ఎవరు? సీఐడీ స్కెచ్ రెడీ!

ఏపీ పాలిటిక్స్‌లో బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ కు చేరిందా? మదనపల్లె ఫైళ్ల దహన కేసులో అసలు కింగ్ పిన్స్ జోలికి సిఐడి వెళ్లబోతోందా? ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత చుట్టూ స్కెచ్ వేస్తున్నారా? త్వరలో ఆ ఫ్యామిలీ నుంచి ఒకరిని అరెస్టు చేయబోతున్నారా? అనే సందేహాలు ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితులు సిఐడికి చిక్కడంతో చిత్తూరు జిల్లా రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. కీలక అనుచరులు ఇద్దరు అరెస్ట్ అవ్వటంతో మాజీ మంత్రికి టెన్షన్ పట్టుకుందని అంటున్నారు.

 

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు ఎట్టకేలకు కీలక దశకు వచ్చేసిందని సీఐడీ అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ముని తుకారాంని, కీలక అనుచరుడు మాధవరెడ్డిని సిఐడి అధికారులు అరెస్ట్ చేయడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్‌లో సంచలనం సృష్టించింది. ఈ అరెస్టులు భవిష్యత్‌లో చిత్తూరు జిల్లా పాలిటిక్స్‌ను పూర్తిగా మార్చే అవకాశం ఉందని పొలిటికల్ క్రిటిక్స్అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. దర్యాప్తుకు ఆదేశించింది. అయితే.. కేవలం కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడం కాకుండా ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారులు ఎవరు అనే దిశగా దర్యాప్తును విస్తరించింది.

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఈ ఫైల్స్ దహనానికి ఎవరు ఆదేశించారు ఈ స్కామ్ వెనుక ఉన్న కింగ్ పిన్ ఎవరనే దిశగా సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. గత వైఎస్ఆర్‌సీపీ హయంలో పుంగనూరు మదనపల్లెలో జరిగిన భూ వ్యవహారాల్లో పెద్దల ప్రమేయంతోనే అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయడం జరిగిందిన టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యేకించి.. పేదల భూములని అక్రమంగా మ్యూటేషన్ చేయడంతో ఇది రాజకీయ అంశంగా మారింది. ఈ కేసులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో కావాలని తగలబెట్టడం చేశారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై సీఐడీ విచారణ జరుగుతోంది.

 

ఇప్పుడు అరెస్ట్ అయిన పెద్దిరెడ్డి పీఏ, కీలక అనుచరుడు ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. వీరు విచారణలో కీలక విషయాలను వెల్లడిస్తే ఈ కేసు మరింత పెద్ద తలకాయల వరకు వెళ్ళే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మునితుకారం, మాధవరెడ్డి ఇద్దరు అమెరికా నుంచి వచ్చారు. అయితే.. చాలా కాలంగా ఆజ్ఞాతంలో ఉన్న వీరు.. సుప్రీం కోర్టును ఆశ్రయించినా వారికి ఊరట దక్కలేదు. దీంతో.. వీరిద్దరి లొకేషన్ తెలియటంతో సీఐడీ వీరిని తిరుపతి జిల్లా పనపాకం టోల్ ప్లాజా వద్ద కాఫీ తాగుతుండగా అదుపులోకి తీసుకున్నారు.

 

2400కు పైగా భూ రికార్డులను బుగ్గి చేసిన ఈ ఆపరేషన్ రికార్డ్స్ వెనుక అసలు బాస్ ఎవరనే దానిపై సీఐడీ ఫోకస్ చేసింది. ఈ ఇద్దరి అరెస్ట్‌తో ఇప్పుడు పెద్దిరెడ్డి గడపలో వణకు మొదలైందని టీడీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. అసలు సిఐడి విచారణలో ఎలాంటి నిజాలు బయట పడబోతున్నాయి. తిరుపతి సిఐడి ఆఫీస్ వైపే అందరి చూపులు ఉన్నాయి.

 

వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో మదనపల్లెలో చక్రం తిప్పిన వ్యక్తులు కటకటాల వెనక్కి వెళ్లారు. పెద్దిరెడ్డికి కుడిభుజం మునితుకారం ఎడమ భుజం లాంటి మాధవరెడ్డి ఇద్దరు అరెస్ట్ కావడం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2024 జూలై 21వ తేదీన భూకబ్జాల ఆధారాలని మాయం చేసేందుకు ఫైళ్లకు నిప్పు పెట్టారని వీరిపై ఆరోపణలు వస్తున్నాయి. సిఐడి వేసిన పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే ఈ ఇద్దరు నోరు విప్పితే పెద్దిరెడ్డి ఇంటివైపు పోలీసులు వెళ్లబోతున్నారంటూ ప్రచారం స్టార్ట్ చేశాయి కూటమి నేతలు. ఈ ఇద్దరి అరెస్టుతో పెద్దిరెడ్డి అనుచరుల్లో సిఐడి పుట్టిస్తుందని చెప్పాలి. ఈ అరెస్టులు కేవలం ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందుందని కూటమి నేతలు పెద్దిరెడ్డిపై ఒంటికాలుతో లేస్తున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి పెద్దిరెడ్డి బ్యాచ్‌కి సినిమా చూపిస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు.

 

సిఐడి వర్గాల సమాచారం ప్రకారం ఈ అరెస్టులు కేవలం ఆరంభం మాత్రమేనని మునితుకారం విచారణ తర్వాత స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆయనను విచారణకు కూడా పిలిచేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిందితులు అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఎవరితో మాట్లాడారు ఎవరి అండదండలతో ఇన్నాళ్ళు తప్పించుకొని తిరిగారు అన్న దానిపై సిఐడి వద్ద కాల్ డేటా రికార్డ్స్ సిద్ధంగా ఉన్నాయని కూటమి నేతలు హింట్స్ ఇస్తున్నారట. ఈ కేసులో ఏ4 గా ఉన్న మునిద్దుకారం ఏ3 గా ఉన్న మాధవరెడ్డి ఉన్నారని సీఐడీ అధికారులు భావిస్తున్నారట.

 

దగ్దమైన 22ఏ ఫైల్లలో అధిక శాతం పెద్దిరెడ్డి వర్గీయుల కబ్జాలో ఉన్న భూమిలే అని వాటిని క్లియర్ చేసేందుకే ఈ ఆపరేషన్ రికార్డ్స్ జరిగిందని అధికారులు ప్రాథమికంగా సీఐడీ అధికారులు నిర్ధారణకు వచ్చారట. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి అనుచురుల స్టేట్‌మెంట్ ఆధారంగా మదనపల్లె కేసు ఎటువైపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.