లోకేష్ .. ప్యూచర్ సీఎం అని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాంటి లోకేష్ కూడా ఒకరి పేరు చెబితే.. యస్ అంటారు. అతనే కిలారు రాజేశ్. ఇప్పుడు టీడీపీ వర్గాల్లో లోకేష్ .. కిలారు రాజేష్‌లను వైఎస్ఆర్.. కేవీపీలతో పోలుస్తున్నారు. ఇంతకీ కిలారి రాజేష్ ఎవరు..? అని టీడీపీ వ్యవహారాలు తెలియని వారు అడిగితే ఓకే. మీడియాలో కిలారి రాజేష్ పేరు ఎప్పటి నుంచో సుపరిచయమే. లోకేష్ తర్వాత అంతటి పవర్ సెంటర్ కిలారి రాజేష్. బేసిగ్గా రాజకీయాల్లో అన్నీ లెక్కలే. తేడా వస్తే తీసివేతలు తప్ప కూడికలు ఉండవు. అలాంటిది టీడీపీ కోసం.. ప్రత్యేకించి నారా లోకేష్ కోసం కిలారి రాజేష్ చాలానే వదులుకున్నాడనేది టాక్. ఇప్పుడు లోకేష్ పగ్గాలు పట్టుకున్నాడు… పార్టీ, ప్రభుత్వంలో లోకేషే సర్వాంతర్యామి. లోకేష్ మాటే చెల్లుబాటు అవుతోంది ప్రస్తుతం. లోకేష్ కూడా ప్యూచర్ టీం బిల్డప్ చేసుకునే పనిలో ఉన్నాడు. దానిలో భాగమే రాజ్యసభకు కిలారి రాజేష్‌ను ఎంపిక చేయనున్నారని టాక్ వినవస్తోంది.
కూటమి సర్కిల్స్‌లోనే కాదు.. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ మధ్య కిలారు రాజేష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. దీనికి కారణం పవర్ సెంటర్‌గా కిలారు రాజేష్ మారిపోవటమే. అయితే లోఫ్రొఫైల్ మెయింటైన్ చేసే కిలారు రాజేష్. తను ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ చేస్తున్న సేవలు చూస్తే, చాలా కీలకం అని టీడీపీలోని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అతనికి కేబినెట్ ర్యాంక్ కూడా సరిపోదని అంతటి క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నడని అంటున్నారు. మనోడైతే చాలు.. అనుకునే ఈ రోజుల్లో అంతా తనై పనులు చేస్తుంటే.. అలాంటి వ్యక్తికి ఎలాంటి పదవి ఇవ్వాలి. కిలారు రాజేష్ పదవులను ఏనాడూ ఆశించలేదని .. అలా ఆశించే వ్యక్తే అయితే.. ఏనాడో ఏదో ఒక పదవిని లోకేష్, చంద్రబాబులు ఇచ్చేవారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కిలారు రాజేష్ ప్రయార్టీ ఇప్పుడు మరింత పెరిగింది. ప్రత్యేకించి .. లోకేష్ చూడాల్సిన వ్యవహారాలన్నీ ముందుగా కిలారు రాజేష్ దృష్టికి వెళ్లాల్సిందే. కిలారు రాజేష్ ఆమోదం ఉంటేనే అవి లోకేష్ ఓకే చేస్తారని టాక్. కిలారు రాజేష్ ఓకే అన్నారంటే.. దాన్ని లోకేష్ కూడా ఆమోదముద్ర పడినట్లేనని టీడీపీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోందంటే.. ఆయనపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.ప్రజెంట్ చంద్రబాబు వైపు నుంచి లోకేష్ ఒక్కొక్కటిగా అధికార బాధ్యతలు తీసుకుంటున్నారు. బాబు నుంచి లోకేష్‌కు ఇలా పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతోంది. ఈ టైంలో పార్టీలోని అనేక కీలక బాధ్యతలను లోకేష్‌కి చంద్రబాబు అప్పగించేశారు. టీడీపీలో ఏ కార్యక్రమం అయినా పేరుకే చంద్రబాబు వస్తున్నారు తప్ప.. అన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలో లోకేష్ పట్టును మరింత పెరిగేలా చేస్తున్న వ్యక్తిగా కిలారు రాజేష్ అందరి నోళ్లలో వస్తోంది. దీనికి ప్రత్యేకంగా కొన్ని ఉదాహరణలను పార్ట వర్గాల నుంచి వినిపిస్తోంది. అదేమిటి అంటే.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్‌ను సీనియర్లు చాలా మంది వ్యతిరేకించినా.. లోకేష్ సత్తా చూపటానికి కిలారు రాజేష్ చాలా వ్యూహాలే అమలు చేశారని.. అంటున్నారు. అంతెందుకు యువగళం పాదయాత్ర సక్సెస్ అవ్వటంలో కిలారు రాజేష్ కీ రోల్ పోషించారని టాక్. దాదాపు 3,132 కిలో మీటర్ల పాటు లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలో అన్నీ తానై కిలారు రాజేష్ వ్యవహరించారు. లోకేష్ పాదయాత్ర టైంలో ఎప్పటికప్పుడు పొలిటికల్‌గా ఏం చేయాలి.. ఎలాంటి క్యాంపెయిన్లు నిర్వహించాలి.. ఏ రకంగా ప్రజల దృష్టిని ఆకర్షించాలో మొత్తం క్యాంపెయిన్ విజయవంతం చేయటానికి సర్వం తానై కిలారు రాజేష్ పనిచేశారు. కూటమి అధికారంలోకి రావడానికి కిలారు రాజేష్ కూడా తనవంతు పాత్ర పోషించారని టీడీపీ సర్కిల్స్‌లోనూ ఒప్పుకుంటారు. ఒకరకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ ఇమేజ్ వేరు.. పాదయాత్ర తర్వాత లోకేష్ ఇమేజ్ వేరు. ఇలా లోకేష్‌ను ఓ మాస్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేసిన ఘనత కిలారు రాజేష్‌దే అని టీడీపీలో అందరూ ఒప్పుకుంటారు.
![]()
యువగళం యాత్రలో పబ్లిక్ని, తనను వ్యతిరేకించే వారిని కూడా లోకేష్ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు.. కిలారు రాజేష్ చేసిన సూచనలను ఎప్పటికప్పుడు లోకేష్ ఆచరణలో పెట్టారు. లోకేష్ యాత్ర చేస్తున్న టైంలోనే ఆంధ్రప్రదేశ్ సీఐడీ కిలారు రాజేష్‌ను వివిధ కేసుల్లో విచారణకు పిలిపించి హెరాస్ చేసింది. అయినా ఆయన ముఖ్యుల పేర్లు ఎవ్వరివీ చెప్పలేదు. ఏపీ ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులలోనూ కిలారు రాజేష్ పేరు తెచ్చి ఇబ్బంది పెట్టారు. అయినా.. అన్నీ ఓపిగ్గా భరించారు. నారా లోకేష్‌తో కిలారు రాజేష్ 35 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. లోకేష్, రాజేష్‌లు ఇద్దరూ.. హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో క్లాస్మేట్లు. వీరిద్దరి నేపథ్యం వేర్వేరు. లోకేష్ కుటుంబం పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే.. కిలారు రాజేష్‌ది మిడిల్ క్లాస్. సొంతూరు విజయవాడ. రాజేష్ వాళ్ల నాన్న చార్టెడ్ అకౌంటెంట్. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాక అమెరికా వెళ్లి అక్కడ రాబర్ట్ మోరీస్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడు రాజేష్.
ఇప్పటి వరకు బ్యాక్‌గ్రౌండ్‌లో పార్టీ వ్యవహారాలు నడిపిన కిలారు రాజేష్ ఇకపై నుంచి తెర ముందుకు రాబోతున్నట్లు టీడీపీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. త్వరలో పొలిట్ బ్యూరో పునర్వ్యవస్థీకరణ జరిగే ఛాన్స్ ఉందని టాక్. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న పొలిట్ బ్యూరోలోకి కిలారు రాజేష్ ఎంట్రీ చేయించాలని లోకేష్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. ఇప్పటి వరకు తెరవెనక చక్రం తిప్పిన కిలారు రాజేష్ పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి అవుతాడని తెలుగుదేశంలోని విశ్వసనీయ వర్గాలు సమాచారం. చంద్రబాబు గతానికి భిన్నంగా ఈసారి వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం.. లోకేష్‌కు ప్రాధాన్యత పెంచటంతో పాటు..ఆయన సొంత టీం ఏర్పాటుకు బాబు ఓకే చెప్పటమే. అందుకోసమే.. కేబినెట్లోనూ ఈసారి మొదటి సారి గెలిచిన చాలా మందికి ఛాన్స్ ఇచ్చారు. మహామహులైన సీనియర్లను కూడా చంద్రబాబు పక్కనబెట్టారు.
ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలన్నీ లోకేష్ కోసమే చంద్రబాబు తీసుకుంటున్నారు. వారసుడిని భవిష్యత్ పార్టీ సారధి చేయటంతో పాటు సీఎం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవైపు పార్టీలోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ లోకేష్ టీంకు లైన్ క్లియర్ చేస్తున్న పనులే అనే ఒపీనియన్ టీడీపీ సీనియర్ నేతల్లోనూ ఉంది. కేబినెట్ ఏర్పాటు చేసిన మోడల్ లోనే ఇప్పుడు పొలిట్ బ్యూరోతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ లోకేష్ టీంను తీసుకు వస్తున్నారని టాక్ నడుస్తోంది. దాంట్లో భాగమే త్వరలో కిలారి రాజేష్ సేవలకు తగిన విధంగా కీ పోస్ట్ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. పొలిట్ బ్యూరోలోకి ఎంట్రీ ఇచ్చాక.. రాజ్య సభ కు పంపే ఆలోచనలో లోకేష్ ఉన్నారని పార్టీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే.. గతేడాది సానా సతీష్‌కు రాజ్య సభ సభ్యత్వం దక్కటం కూడా మంత్రి నారా లోకేషే కారణం. దీనికి సానా సతీష్ .. లోకేష్‌కు అత్యంత క్లోజ్ సర్కిల్స్‌లో ఒకడిగా ఉండటమే దీనికి కారణం.
ఇటీవల మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించినప్పుడు పార్టీ సీనియర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడుసార్లకు మించి పార్టీ పదవులు ఎవరికీ ఉండడకూడదని.. దాంట్లో భాగంగా తాను కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇది పూర్తిగా తన పర్సనల్ ఒపీనియన్ అని .. పార్టీ ఏ పదవి ఇస్తే దాని ప్రకారం పని చేస్తానని లోకేష్ ప్రకటించారు. ఇదేమీ ఆషామాషీగా నారా లోకేష్ చేసిన ప్రకటన కాదు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని.. పార్టీ పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు ఓ ప్రణాళిక ప్రకారమే లోకేష్ అన్నారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక కీలక నిర్ణయాలన్నీ లోకేష్ ఇష్టానుసారమే జరుగుతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇకపై లోకేష్ కోరినట్లు మూడు సార్లు మించిన వారిని పక్కన పెడితే.. కిలారి రాజేష్ పొలిట్ బ్యూరోలోకి ఎంట్రీ నామమాత్రమే. అంతేకాదు.. త్వరలో రాజ్యసభకీ కిలారి రాజేష్‌ను నామినేట్ చేస్తారు. ఇంతకాలం బ్యాక్ ఎండ్‌లో నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ వర్క్ చేస్తూ వచ్చిన కిలారి రాజేష్ ఇకపై ఎంపీ కిలారి రాజేష్ అవ్వనున్నారు. టీడీపీ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ సమాచారం ప్రకారం కిలారి రాజేష్‌కి పొలిట్ బ్యూరో పదవి కానీ రాజ్యసభ కానీ దక్కితే తెలుగుదేశం పార్టీలో యువ రక్తం ప్రభావం పెరుగుతున్నట్లే అని భావించాలి. మొత్తానికి ఒక సాధారణ కుటుంబంలో పెరిగి.. తెలుగుదేశం పార్టీలో అగ్రనాయకత్వానికి చేదోడుగా ఎదగటం అనేది అసామాన్యమైన విషయంగా చెప్పుకోవాలి.