హైదరాబాద్‌లో ప్రతి అగ్నిప్రమాదం జరిగేటప్పుడే నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి, కానీ ప్రమాదం జరగకముందే నిరంతర తనిఖీలు ఎందుకు లేవు అనే ప్రశ్నకు ఎలాంటి సమాధానం లేదు. భవనాల సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై స్పష్టమైన డేటా లేకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది.నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ భవనాల ఎత్తు పెరుగుతున్నప్పటికీ, భద్రతా ఏర్పాట్లు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఎంత మంది ప్రాణాలు కోల్పోయినా, ప్రభుత్వ విభాగాలకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. శాఖల మధ్య సమన్వయం లోపం..ఆయా శాఖల సత్తువ లేని అధికారాలే నగరాన్ని అగ్ని ప్రమాదాలకు బలిపెడుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అగ్నిమాపకశాఖ నెలకు వందల్లోనే భవనాలను తనిఖీ చేస్తోంది. ఈ శాఖకు నిబంధనలు ఉల్లంఘించే భవన యజమానులపై తక్షణ చర్యలు తీసుకునే పరిమిత అధికారాలు ఉండటం మరో పెద్ద సమస్యగా మారింది.ప్రస్తుతం, 15 మీటర్లకంటే తక్కువ ఎత్తు ఉన్న జీప్లస్-5 కమర్షియల్ భవనాలు, షాపింగ్ కాంప్లెక్సులు, ఆసుపత్రులు మరియు 18 మీటర్లకంటే తక్కువ ఎత్తు ఉన్న ఐదంతస్తుల నివాస సముదాయాలు జీహెచ్ఎంసీ తనిఖీ చేసి, నిరభ్యంతర పత్రం జారీ చేస్తుంది.
కానీ, ఈ ఎత్తు మించిన భవనాలకు మాత్రమే అగ్నిమాపకశాఖ ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత, నిబంధనలు పాటించకపోతే భవనాన్ని సీజ్ చేయడానికి అధికారం లేకపోవడం తీవ్ర సమస్య. ఇదే అవకాశంగా కొంతమంది భవన యజమానులు అధికారులు సమీపంలో ఉన్నప్పుడు కొంత ముట్టజెప్పి, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.నగరంలో భవనాల ఎత్తు పెరుగుతున్న కొద్దీ, ఈ నియంత్రణల లోపం భద్రతను కేవలం పత్రాలపై పరిమితం చేస్తోంది.
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాల ఎక్కువ కారణం షార్ట్‌సర్క్యూట్ అని అగ్నిమాపక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి, పాత భవనాల్లో విద్యుత్ తీగలు, పరికరాలు భద్రతా ప్రమాణాలకు తగినట్లుగా లేవు.విద్యుత్ సరఫరాకు ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన తీగలను మాత్రమే వినియోగించాలి.15 ఏళ్లు దాటిన భవనాల్లో పాత విద్యుత్తు వైర్లు మార్చి, కొత్త విద్యుత్ ఇంటర్నల్ లైన్ ఏర్పాటు చేయాలి.
ఏసీలు, లైటింగ్, కొత్త ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగిస్తే, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.వ్యాపార యజమానులు తమ ఉద్యోగులకు ఫైర్ సేఫ్టీ పై నిరంతరం శిక్షణ ఇవ్వడం, మాక్ డ్రిల్స్ నిర్వహించడం తప్పనిసరి. అలాగే, ఎన్వోసీ లేని భవనాలపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని భవనాలకు నోటీసులు ఇచ్చి, చట్టప్రకారం సీజ్ చేయడం ద్వారా మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. కానీ ఇవేమి హైదరాబాద్ నగరంలో కనిపించవు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మాత్రమే చెప్పుకోవడం సంతోషకరమేకానీ భద్రతా ప్రమాణాలు పాటించకుంటే అగ్నిప్రమాదాల వల్ల జరిగే తీరు నగర ప్రతిష్ట మసకబారడంతోపాటు ఎందరో ప్రాణాలు బలి కావాల్సిన ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్ నగరంలో కొద్ది నెలలుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పది, ఇరవై మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే భవన యజమానులు – భవన సెల్లార్లను గోదాంలుగా మార్చడం, అక్రమ రసాయన నిల్వలపై చూసీచూడని అధికార యంత్రాంగంతోనే ఫైర్ సేఫ్టీ తనిఖీల చర్యలు ఆలస్యంగానే ప్రమాదాల జరుగుతున్నట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది.
ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలను పరిశీలిస్తే రెండేళ్ల క్రితం బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9మంది మృత్యువాతకు సెల్లార్లో అక్రమంగా నిల్వ చేసిన రసాయనాలే కారణంగా గుర్తించారు. అంతేకాదు నాంపల్లి జరిగిన మరో అగ్ని ప్రమాదంలో 5మంది మరణానికి నిర్లక్ష్యమే మూల కారణంగా గుర్తించారు. వీటితోపాటు నాలుగేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో బ్యాటరీ బైకులు సెల్లార్లులో ఉంచగా షార్ట్ సర్కూట్ కారణంగా 8మంది మృత్యువాత పడ్డారు.
హైదరాబాద్ నగరంలో 2025లో మొత్తం 1300 అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే 2026లో, నెల కూడా పూర్తి అవ్వకముందే 106కి పైగా ప్రమాదాలు నమోదయ్యాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 2025లో 788 ప్రమాదాలు, 2026లో ఇప్పటివరకు 60కు పైగా ప్రమాదాలు సంభవించాయి. మేడ్చల్‌లో 2025లో 575 ప్రమాదాలు, 2026లో ఇప్పటివరకు 34కు పైగా జరిగినట్లు ప్రభుత్వం చెబుతున్న అధికారిక లెక్కలు.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వాటి నివారణకు ‘హైడ్రా’ కఠిన చర్యలకు ఉపక్రమించింది. నగరంలోని వాణిజ్య భవనాలు, షాపింగ్ మాల్స్‌లో అగ్నిమాపక భద్రతా నిబంధనల అమలుపై నేటి నుంచే ప్రత్యేక తనిఖీలు చేపట్టనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే భవనాలకు తాళాలు వేయడంతో పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.
ఇటీవల నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదమే ఈ కఠిన నిర్ణయాలకు కారణమైంది. పార్కింగ్ కోసం ఉద్దేశించిన సెల్లార్‌ను గోదాముగా మార్చి, మండే స్వభావం ఉన్న వస్తువులను నిల్వ చేయడంతోనే ప్రాణ నష్టం తీవ్రత పెరిగిందని సమీక్షలో తేలింది. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని వాణిజ్య సంస్థలు తమ సెల్లార్లను వెంటనే ఖాళీ చేసి, కేవలం పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల్లో సెల్లార్లను గోదాములుగా వాడుతున్నట్లు తేలితే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.
బుద్ధభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని భవనాల ముందు ‘ప్రమాదకరం’ అని బోర్డులు ఏర్పాటు చేయాలని, వాటికి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. మెట్లు, కారిడార్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను ఖాళీగా ఉంచాలని, ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేసే స్థితిలో ఉండాలని స్పష్టం చేశారు.
గతేడాది నగరంలో నెలకు సగటున మూడు చొప్పున 36 భారీ అగ్ని ప్రమాదాలు జరగడం ఆందోళనకరమని కమిషనర్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలు, గోదాముల సమాచారాన్ని ఫొటోలు, వీడియోలతో 90001 13667 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా నివాస ప్రాంతాల్లో మండే స్వభావం ఉన్న వస్తువులను నిల్వ చేసే గోదాములపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక నాలాలు, చెరువులతో పాటు ప్రభుత్వ స్థలాలు కాపాడేందుకు హైడ్రాను నెలకొల్పింది. ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేసి కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. మొదట్లో హైడ్రా దూకుడు చూసి స్థానికంగా భారీగా వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం అధికారాలు కొంత మేర సడలింపు ఇచ్చినా సర్కారు భూముల రక్షణకు పెద్దపీట వేసింది. ఇటీవల సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ ప్రాంతంలో చెరువును ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. అలాగే ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు, తద్వారా భవిష్యత్తులో ఆక్రమణలను నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. చెరువు వంటి నీటి నిల్వపై ఆక్రమించిన స్థలాల నుండి భూమిని క్లియర్ చేసి, చెరువుకు గూఢంగుండా ఫెన్సింగ్ పెట్టడం వంటి చర్యలు చేపట్టున్నారు.
నగరంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని వాణిజ్య భవనాలపై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. కొన్ని షోరూమ్‌లు కూడా సీజ్ చేశారు. ఈ చర్య పబ్లిక్ ప్రాపర్టీ భద్రతతో పాటు ప్రజల సురక్షణను పెంచే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ GHMC చట్టాన్ని మార్చి హైడ్రాకు పబ్లిక్ ప్రాపర్టీ రోడ్లు, నీటి నిల్వలు, వాగులు, పార్కులు వంటి వాటిని ఆక్రమణ నుండి రక్షించే అధికారాలు ఇచ్చింది.ఇదే అధికారాన్ని కోర్టులు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. హైకోర్టు కొన్ని సందర్భాల్లో హైడ్రా అధికారం కఠినంగా లేదని, చర్యలు చట్టానికి అనుగుణంగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని సందర్భాల్లో మియాపూర్‌లో ప్రభుత్వ భూముల మీద నిర్మించిన 5 అంతస్తుల భవనం వంటి అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది. అగ్నిమాపకశాఖ ఇచ్చే అనుమతులు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే కఠినమైన అధికారాలు ఇస్తేనే అగ్ని ప్రమాదాల నుంచి హైదరాబాద్ రక్షించుకోవచ్చనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.