కూటమిలో ‘పచ్చ’గడ్డి వేస్తే భగ్గు.. అడ్రస్ లేని వైసీపీ: పాలకొండ పాలిటిక్స్‌లో అసలేం జరుగుతోంది?
శ్రీకాకుళం జిల్లా మొత్తం రాజకీయాలు ఒకలా ఉంటే పాలకొండ పాలిటిక్స్ మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అక్కడ టీడీపీ(TDP), జనసేన(Jansena) నేతల మధ్య ఆధిపత్యపోరు చిత్రవిచిత్రంగా తయారవుతోందంట. అధికార కూటమిలోని భాగస్వామ్యపక్షాల నేతలకు ప్రజా సమస్యలు పట్టవు. ప్రశ్నించడానికి ప్రతిపక్షం నోరెత్తదు. కూటమి పార్టీలు విభేదాలతో కుమ్ములాడుకుంటుంటే.. అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక వైసీపీ కూడా నిర్వీర్యంగా తయారవుతోందంట. అసలక్కడ పాలిటిక్స్ అంత డిఫరెంట్‌గా ఎందుకు తయారయ్యాయి?
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన, మన్యం ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న ఏరియాలను కనెక్ట్ చేసేది ఎస్టీ నియోజకవర్గమైన పాలకొండ. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన పోటీ చేసి గెలించింది. అక్కడ ఎమ్మెల్యే గెలుపు కూడా ఆసక్తికరంగానే జరిగింది. ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ ఇంచార్జ్ పడాల భూదేవి.. ఇద్దరు కూడా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ టికెట్ కోసం పోటీ పడ్డారు.
కానీ, పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్తుందని తెలుసుకున్న నిమ్మక జయకృష్ణ ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. ఆ వెంటనే టికెట్ కోసం పడాల భూదేవి కూడా జనసేన కండువా కప్పుకున్నారు. అయితే.. ముందుగానే అలర్టైన నిమ్మక జయకృష్ణకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చారు. దీంతో పడాల భూదేవి మళ్లీ సొంతగూటికి చేరి పసుపు కండువా కప్పుకున్నారు.
ఒకరు పాలకొండ టీడీపీ ఇంచార్జ్ గా, మరొకరు జనసేన ఎమ్మెల్యేగా కూటమిలో ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నుంచి తనకు ఆహ్వానం పంపడం లేదని పడాల భూదేవి పార్టీ అధిష్టానం దగ్గర ఫిర్యాదులు కూడా చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం కూడా ఇద్దరికీ రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా.. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవనే సామెతలను ఇద్దరూ రుజువు చేస్తున్నారంట.
అంతే కాదు.. నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోందని కలెక్టర్ కు పడాల భూదేవి ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఒకపక్క జనసేన ఎమ్మెల్యే మరో పక్క టీడీపీ ఇంచార్జ్ ఆధిపత్య పోరులో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకొండ రోడ్లే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు స్థానిక ప్రజలు.
పాలకొండ చుట్టూ ఉన్న రాజాం, పార్వతీపురం, సీతంపేట, ఆమదాలవలస రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. కానీ, పాలకొండ రోడ్లు మాత్రం అత్యంత దారుణంగా తయారయ్యాయి. పైన చెప్పుకున్న ప్రాంతాలన్నీ పాలకుండ కంటే చిన్నవే. పాలకొండ రోడ్లు బాగుపడితే అభివృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని స్థానికులు భావిస్తున్నా.. పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. కూటమి నేతల మధ్య వర్గపోరు తారాస్థాయిలో ఉండటంతో అభివృద్ధి ఆలోచనలే వారికి రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా నిమ్మక జయకృష్ణ పడాల భూదేవిలకు చీమ కుట్టినట్లైనా లేదంట.
పాలకొండ నియోజకవర్గంలో పలు రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ.. కూటమి నేతలపై వ్యతిరేకత పెరుగుతోందంటున్నారు. అయిన ప్రజల తరుఫున ప్రశ్నించడానికి వైసీపీలోని నేతలు కరువైయ్యారు. గత ఎన్నికల్లో రాజాం, పాలకొండలో వైసీపీని శాసించిన ఆ పార్టీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ వైసీపీ ఓటమి తర్వాత ప్రజాసమస్యలపై గొంతెత్తిన సందర్భాలు లేవు. వైసీపీ అధినేత పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు కూడా పాలకొండలో తూతూమంత్రంగానే సాగుతున్నాయి. ఇటీవల తిరుమల ప్రసాదాల కల్తీకి సంబంధించి జగన్ పిలుపు మేరకు ఆ వైసీపీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే , ప్రస్తుత పాలకొండ వైసీపీ ఇన్చార్జ్ విశ్వాసరాయి కళావతితో కలిసి పాలకొండ కార్గిల్ జంక్షన్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కాసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పార్టీ కార్యక్రమాల నిర్వాహణలో పాలకొండ నియోజకవర్గం నేతలు పట్టీపట్టనట్లు వ్వవహరిస్తుండటంతో వైసీపీ ఉనికే ప్రశ్నార్ధకంగా తయారవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానై వ్యవహరించిన విక్రాంత్.. ఇప్పుడు మాత్రం ప్రజాసమస్యలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మొత్తమ్మీద వర్గ విభేదాలతో కూటమి నేతలు, అధికారం లేక వైసీపీ నేతలు తమను పట్టించుకోకపోతుండటంతో పాలకొండ వాసులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంట.