జగన్ ముందు బోరున విలపించిన సుప్రియ.. అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు హద్దులు దాటుతున్నాయనే విమర్శలకు పామర్రు ఘటన అద్దం పడుతోంది. తన తండ్రిపై అక్రమంగా నేరం మోపడాన్ని ప్రశ్నించినందుకు ఒక నర్సింగ్ విద్యార్థిని అని కూడా చూడకుండా పోలీసులు స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. బాధిత విద్యార్థిని సుప్రియ, మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి కన్నీరుమున్నీరైంది.

ఏం జరిగిందంటే? 

కృష్ణా జిల్లా పామర్రుకు(pamarru) చెందిన సుప్రియ తండ్రిని పోలీసులు ఒక కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. దీనిపై నిలదీసిన సుప్రియను(supriya) పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ ఆమెపై భౌతిక దాడికి దిగడమే కాకుండా, దారుణంగా కొట్టారని సుప్రియ ఆరోపించింది. ఒక మహిళా విద్యార్థిని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానవీయమని ఆమె వాపోయింది.

కలెక్టర్ స్పందనపై విస్మయం

తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్ బాలాజీకి గ్రీవియెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని సుప్రియ తెలిపింది. కలెక్టర్ తన అర్జీని తిరిగి సదరు పోలీసులకే అప్పగించారని, ఆ తర్వాత పోలీసులు మరింత రెచ్చిపోయి తనపైనే ఎదురుకేసులు పెట్టారని ఆమె కన్నీటి పర్యంతమైంది. స్థానిక టీడీపీ(TDP) నాయకుడు గణేష్ ఒత్తిడి మేరకే పోలీసులు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

“న్యాయం చేయాల్సిన కలెక్టర్ గారు నా అర్జీని మళ్లీ పోలీసులకే ఇచ్చారు. దాంతో వాళ్లు నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాకు దిక్కెవరు?” – సుప్రియ, బాధిత విద్యార్థిని

వైఎస్ జగన్ భరోసా

బాధితురాలి మాటలు విన్న వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. సుప్రియకు మరియు ఆమె కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నేతల కళ్లల్లో ఆనందం కోసం పోలీసులు ఇంత దిగజారి ప్రవర్తించడం తగదని ఆయన హెచ్చరించారు.