ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు దాకా ‘చినబాబు’ భజన వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

మంత్రి నారా లోకేష్‌ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు మరింత రాటుతేలిందని టీడీపీ నాయకులు అంటున్నారు. పార్టీలో ఇప్పుడు తిరుగులేని నాయకుడిగా లోకేష్ ఎదిగారని మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు తెగ పొగిడేస్తున్నారు. లోకేష్ నాయకత్వంలో యువత కోసం చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, సమాజ శ్రేయ స్సు కోసం చేపట్టిన సంస్కరణలతో ప్రజల మన్ననలు పొందుతున్నారని ప్రశంసిస్తున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాల స్వయంగా చూసిన లోకేష్‌ వాటిని విస్మరించకుండా సమ స్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నారని ఒకరి తర్వాత ఒకరు లోకేష్ విశాఖ టూర్‌లో పొగడానికి తెగ ప్రయత్నించారు.

ఎందుకు అంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో తమ పుత్రరత్నాలను, కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని టీడీపీ నాయకులు తెగ ట్రై చేస్తున్నారు. దీనికి లోకేష్ అంగీకరించాలి. దీంతో లోకేష్ దృష్టిలో పడటానికి ఒకరి తర్వాత ఒకరు తెగ పోటీ పడుతున్నారు. కొందరైతే ఇప్పటి నుంచే 2029 ఎన్నికల టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ట్రై చేస్తున్నారు. ఇంతకీ ఉత్తరాంధ్ర టీడీపీ నాయకుల పొగడ్తల జల్లుల వెనక ప్లాన్ ఏంటి..?

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లోకేష్ (Nara Lokesh) ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకుంటూ ప్రజల కన్నీళ్లు తుడుస్తున్నారని ఉత్తరాంధ్ర టీడీపీ (TDP) నాయకులు తెగ పొగిడేశారు. ఈ మాట అనటంతో తప్పేమీ లేదు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాదర్భార్‌లు ఎప్పుడు చేశారబ్బ ఆని అక్కడున్న మీడియా మిత్రులకు డౌట్లు వచ్చేశాయి. యువగళం అనుకుంటాలే.. అని సర్ది చెప్పుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌కు ఒక ట్వీట్ చేస్తే చాలు.. విదేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న తెలుగువారికి ఆపన్న హస్తం అందించి కాపాడుతున్నారని టీడీపీ నాయకులు మరో మాట అనేశారు.

 

ఇటీవల ఓ బాలికకు రూ.16 కోట్లు అవసరం అంటే… ప్రజల దగ్గర చందాలు వసూలు చేసుకోమన్నారన్న సంగతిని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. చివరికి.. రూ.10 కోట్లు ఆ పాపకు వస్తే.. ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారని ఆరోపించారు. టీడీపీ నాయకులు లోకేష్‌ను పొగుడుతుంటే ఆ వీడియోలతో వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP) సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. పిలిస్తే పలికే ప్రజా నాయకుడిగా లోకేష్‌ అనతికాలంలోనే పేరు తెచ్చుకోవడం గర్వకారణంగా ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు. లోకేష్‌ సారధ్యంలో సభ్యత్వ నమోదులో పార్టీ చరిత్ర తిరగరాసిందని… ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టీడీపీకే ఉన్నారంటే అది లోకేష్‌ కృషి వల్లేనని పేర్కొన్నారు. పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులై సభ్యత్వం తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను కుటుంబసభ్యుల్లా చూసుకుంటూ అండగా ఉంటున్నారు. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పైనే పెట్టుబడులు సాధించారు..విద్యా వ్యవ స్థలో మార్పులకు శ్రీకారం చుట్టి ప్రక్షాళన చేస్తున్నారని టీడీపీ నాయకులు లోకేష్‌ను ప్రశంసించారు.

 

ఉత్తరాంధ్ర నాయకులకు కంటే మేం మరో రెండు ఆకులే ఎక్కువ చదివామని నెల్లూరు నాయకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని(AP) అన్ని రంగాల అవకాశాల కేంద్రంగా మార్చాలన్న మంత్రి నారా లోకేష్ ముందుచూపుతో మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి తరలివచ్చిందని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తున్నార. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ప్రపంచంలోనే మొట్టమొదటి ‘అటానమస్ మారిటైం షిప్ యార్డు’ సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన నౌకల నిర్మాణానికి చిరునామాగా మారబోతోందని టీడీపీ నేతలు అనేస్తున్నారు.

 

భవిష్యత్తు అవసరాలను గుర్తించి, సముద్ర తీర ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చాలన్న లోకేష్ కృషితోనే ఈ ప్రాజెక్టు సాకారమవుతోంది. ఈ మారిటైం షిప్ యార్డ్ ఏర్పాటు కేవలం పరిశ్రమ స్థాపన మాత్రమే కాకుండా, దేశ రక్షణ , రవాణా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. మనుషుల ప్రమేయం లేకుండా స్వయంచాలితంగా పనిచేసే నౌకలను ఇక్కడ తయారు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అత్యాధునిక యార్డు మరెక్కడా లేదంటున్నారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా వాడుకోవడంలో మంత్రి లోకేష్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాలు ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నాయి.

 

సాగర్ డిఫెన్స్ వంటి అగ్రశ్రేణి సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక వాతావరణంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఇదంతా చినబాబు పుణ్యమే అని టీడీపీ నేతలు భజన చేసేస్తున్నారు. జువ్వలదిన్నెలో రానున్న ఈ షిప్ యార్డ్ ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెబుతున్నారు. కేవలం ఐటీ రంగమే కాకుండా, తయారీ , రక్షణ రంగాల్లోనూ ఏపీని అగ్రస్థానంలో నిలపాలన్న లోకేష్ లక్ష్యం ఈ ప్రాజెక్టుతో మరో అడుగు ముందుకు పడిందని స్థానిక నాయకులు చేస్తున్న ప్రచారం విని జనాలు ఔరా అనేస్తున్నారు. ఉత్తరాంధ్ర నాయకులది ఒక స్టైల్ అయితే.. నెల్లూరు నాయకులది మరో తీరు. ఓవరాల్‌గా అయితే.. లోకేష్ కళ్లలో ఆనందం చూడాలన్నది టీడీపీ నాయకుల ప్రయత్నం. ఇవన్నీ చూసిన వారంతా వహ్వా బావుంది మీ తీరు అనేస్తున్నారు.