Rajanagaram Politics : రాజానగరంలో ‘షాడో ఎమ్మెల్యే’ దర్బార్.. చక్రం తిప్పుతున్న బలరామకృష్ణ సతీమణి!

చట్టం ఆయనది.. చక్రం ఆమెది! రాజానగరంలో నడుస్తోంది డబుల్ ఇంజన్ సర్కారా? లేక షాడో దర్బారా? రాజానగరం రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. ఎమ్మెల్యే ఎవరు? రిబ్బన్ కట్ చేయాలన్నా ఆమే రావాలి! కొబ్బరికాయ కొట్టాలన్నా ఆమే ఉండాలి! చివరికి ప్రభుత్వ చెక్కులు పంపిణీ చేయాలన్నా ఆమె హస్తం ఉండాల్సిందే! అసలు రాజానగరంలో ఏం జరుగుతోంది? రాజానగరంలో గెలిచిన ఎమ్మెల్యేనా? లేక ఆయన వెనక ఉండి చక్రం తిప్పుతున్నఆమెనా? ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ రాజ్యాంగేతర శక్తిగా ఆమే ఎందుకు చేస్తున్నారు? ఇది 2029 ముందస్తు వ్యూహమా? లేక అధికార పెత్తనమా?

 

ఓటు వేసింది ఆయనకు.. కానీ పెత్తనం ఆమెది! అసెంబ్లీలో ఆయన గొంతు విప్పుతుంటే.. నియోజకవర్గంలో ఆమె రిబ్బన్లు కట్ చేస్తున్నారు. రాజానగరం గడ్డపై ఇప్పుడు అంబేడ్కర్‌ రాజ్యాంగం కన్నా.. ఆ ‘రాజమాత’ శాసనమే నడుస్తోందట! రాజానగరం నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు చూస్తుంటే సామాన్యులకు ఒకటే సందేహం వస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అన్నది మిస్టరీగా మారింది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కేవలం ‘రబ్బర్ స్టాంప్’ మాత్రమేనా? అధికారులకు బాస్ ఎవరు? గెలిచిన ఎమ్మెల్యేనా? లేక ఆయన సతీమణి వెంకటలక్ష్మి గారా?కూటమిలో చిచ్చు పెడుతున్న ఈ ‘షాడో ఎమ్మెల్యే’ వ్యవహారంపై ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన వ్యక్తిగత వ్యవహారాల్లో బిజీగా ఉంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన భార్య వెంకటలక్ష్మి షాడో ఎమ్మెల్యేగా అవతారమెత్తారని కూటమి నేతల టాక్‌ ఇది.

 

రాజానగరంలో ప్రభుత్వ యంత్రాంగం నిలువునా మోకరిల్లింది! ఒక ఎమ్మెల్యే భార్యకు.. అధికారిక హోదా ఏముంటుంది? కానీ ఇక్కడ సీన్ రివర్స్. రహదారుల శంకుస్థాపన నుంచి పాఠశాల గదుల ప్రారంభోత్సవం వరకు.. అన్నీ ఆమె చేతుల మీదుగానే! దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రఘుదేవపురం ప్రభుత్వ పాఠశాల గదుల ప్రారంభోత్సవం ఘటనను చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవాన్ని ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే చేయాలి. కానీ అక్కడ రిబ్బన్ కట్ చేసింది వెంకటలక్ష్మి గారు.మరి, ఎమ్మెల్యే భార్య వెంకటలక్ష్మి ఏ హోదాలో రఘుదేవపురం స్కూల్ గదులను ప్రారంభించారన్న ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు.

 

 

ఇక రెండో విషయానికి వస్తే.. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వెంకటలక్ష్మినే పంపిణీ చేస్తున్నారు. మరి ఏ హోదాలో ఎమ్మెల్యే ఇవ్వాల్సిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసే అధికారం ఆమెకు ఎవరిచ్చారు? ఇది ప్రజాస్వామ్యమా? లేక కుటుంబ పాలనా? అని రాజానగరంలో కూటమి నేతలే కారాలు మిరియాలు నూరుతున్నారు. అధికారులు సైతం ‘ప్రోటోకాల్’ను గంగలో కలిపేసి.. ఆమె కనుసన్నల్లో ‘జీ హుజూర్’ అంటున్నారు.

ఈ పెత్తనం కేవలం ప్రతిపక్షాలకే కాదు, సాక్షాత్తూ కూటమిలోని మిత్రపక్షం టీడీపీకి కూడా మింగుడు పడటం లేదు. ఇక్కడ గెలిచింది కూటమి.. కానీ పవర్‌లో ఉన్నది మాత్రం జనసేన ఎమ్మెల్యే కాదు కాదు..ఆయన గారి సతీమణి అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.! టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి లాంటి సీనియర్ నేతలను కనీసం కరివేపాకులా కూడా చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఆయనను అధికారిక కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే భార్య పెత్తనంపై కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ కేడర్ అయితే గుర్రుగా ఉంది. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే ఎలా?” అని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

 

ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆమెకు “జీ హుజూర్” అనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.”మేము కష్టపడి గెలిపిస్తే.. పెత్తనం చేసేది ఆమెనా?” అంటూ తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఈ షాడో అనడం కంటే..అసలు ఎమ్మెల్యే ఆమెనే కరెక్ట్‌ అనే పరిస్థితి జనసేక కార్యకర్తలు అనుకుంటున్నారట. ఎందుకంటే కార్యకర్తలకు ఏది కావాల్సిన బాస్‌ కలిసిన ఉపయోగం లేదు.. మేడం ఎస్‌ అంటేనే ఒకే.. లేదంటే లేదట. మొత్తానికి ఈ వ్యవహారం రాజానగరం కూటమిలో ముసలం పుట్టిస్తోంది. ఇది వచ్చే ఎన్నికల నాటికి పెను తుపానుగా మారడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇదంతా ఒకెత్తయితే.. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరో ఎత్తు. అక్రమ మైనింగ్‌కు రాజానగరం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గత ప్రభుత్వంపై బురద జల్లి గెలిచిన బలరామకృష్ణ.. ఇప్పుడు సొంత కళ్ల ముందే కొండలు మాయమవుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? కూటమి ప్రభుత్వం వచ్చి సరిగ్గా రెండేళ్లు కావొస్తోంది.. కానీ అప్పుడే పది కొండలు మాయమయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొత్త తుంగపాడు, కొండ గుంటూరు, కానవరం గ్రామాల్లో అక్రమ గ్రావెల్ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది.

 

ఐదెకరాల అనుమతితో పదెకరాలు తవ్వేస్తున్నారనేది స్థానికుల వాదన. నిత్యం వందలాది లారీలు వే-బిల్లులు లేకుండానే పొరుగు జిల్లాలకు తరలిపోతున్నాయి. గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసి గెలిచిన బల రామకృష్ణ.. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దోపిడీని ఎందుకు అడ్డుకోవడం కాదు..తానే దోపిడికి ముఠా నాయకుడు అవతారం ఎత్తారని స్థానికులు గుసగుసలాడుతున్నారు. కొత్త తుంగపాడు నుంచి నల్లగొండ వరకు.. ఎక్కడ చూసినా భూమాత గుండెల్ని పిండేస్తున్న గనులు వీరు. దీని వెనుక ఉన్న హస్తం ఎవరిది? మేడం ఆశీస్సులు వీళ్లకు ఉన్నాయా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.అసలు ఎమ్మెల్యే గారు తన భార్యను ఇంతలా ప్రోత్సహించడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికే ఈ ప్లాన్ అని అంటున్నారు. ప్రత్యేకించి.. అక్రమ మైనింగ్, అధికారులపై మితిమీరిన పెత్తనం వల్ల ఎమ్మెల్యేపై ఇప్పటికే వ్యతిరేకత మొదలైంది.

2029 ఎన్నికల్లో జనసేన టికెట్ తనకు కాదంటే, తన భార్య వెంకటలక్ష్మిని బరిలోకి దించాలని బలరామకృష్ణ భావిస్తున్నారట. అందుకే మహిళలు రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎమ్మెల్యే గారు స్టేజ్ మీద ఈ మద్య తెగ స్పీచ్‌లు ఇస్తున్నారు. ఆ మాటలకు అసలు అర్థం తన భార్యకు లైన్ క్లియర్ చేయడమేనని టాక్.షాడో ఎమ్మెల్యేగా బత్తుల వెంకటలక్ష్మి వ్యవహారశైలిపైన ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే అది అబద్ధమనో, అసత్యమనో చెప్పకుండా.. అసభ్యంగా సభ్య సమాజం వినలేని భాషను ఉపయోగించటం ఏమాత్రం మర్యాద కాదని నియోజకవర్గ ప్రజలు కూడా భావిస్తున్నారు. నియోజకవర్గంలోని కొండలను అక్రమంగా తవ్వి గ్రావైల్స్ తరలింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ప్రత్యర్థులతో పాటు మీడియా సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి. షాడో ఎమ్మెల్యే తీరే అంతేనని సొంత కేడర్‌ కూడా అనుకుంటున్నారు. అంతెందుకు గతేడాది చెరువుల తవ్వకంపై తన వద్దకు వచ్చిన జనసేన కార్యకర్తను ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ ఘటనను మరోసారి నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

 

మరోవైపు బత్తుల తీరుతో టీడీపీ కేడర్‌లోనూ అసంతృప్తి రాజుకుంటోంది. నియోజకవర్గంలోని కొండలను గుండు చేస్తూ, గ్రావెల్ తరలిస్తున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్యే వివరణ ఇవ్వాల్సింది పోయి, ప్రశ్నించే వారిపై బూతులతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఇసుక తవ్వకాల వల్ల గట్లు బలహీనపడతాయని సాక్షాత్తు రైతులే ధర్నాకు దిగడంతో ఎమ్మెల్యే అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు.గతేడాది ఆదికవి నన్నయ్య యూనివర్శిటీపై షాడో ఎమ్మెల్యే అనుచరులతో కలసి వీసీ ఛాంబర్‌మీద దాడి చేశారు. ఈ సందర్భంగా వీసీపై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు ఆమె చేశారని ఆరోపణలు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ అక్రమాలను ప్రశ్నిస్తుంటే, వాటికి సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగడం బత్తుల ఫ్యామిలీకి అలవాటుగా మారింది. స్వల్ప కాలంలోనే ఇన్ని ఆరోపణలు, కేడర్‌ నుంచి వ్యతిరేకత రావడంపై రాజానగరం ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

మొత్తానికి రాజానగరంలో ఎమ్మెల్యే సతీమణి హడావుడి వెనుక భారీ రాజకీయ వ్యూహమే కనిపిస్తోంది. కానీ, అధికారిక ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ‘షాడో ఎమ్మెల్యే’గా వ్యవహరించడం కూటమిలో ఎలాంటి కుంపటి రాజేస్తుందో చూడాలి. అక్రమ మైనింగ్ ఆరోపణలు, మిత్రపక్షాల అసంతృప్తి మధ్య.. బలరామకృష్ణ తన రాజకీయ వారసురాలిగా భార్యని నిలబెట్టగలరా? దీనికి కాలమే సమాధానం చెబుతుందని కూటమి నాయకులే కామెంట్స్ చేస్తుండటం నియోజకవర్గంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోందనొచ్చు. ఇది ఇవాళ్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీలో కలుద్దాం. నమస్తే..