తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇప్పట్లో ఆపేవారు ఎవ్వరూ లేరు. ఎందుకు అంటే..గత రెండేళ్లలో రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను రేవంత్ ఒంటి చేత్తో గెలిపించారు. గత రెండేళ్లలో రేవంత్ రెడ్డి నాయకత్వంపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల ప్రభావం కూడా ఈ ఉప ఎన్నికల్లో పనిచేయలేదు. ప్రత్యర్థులు చేసే విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదన్నది ఇటీవల జరిగిన స్థానిక పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా చూడాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంత సులువుగా ఎంపిక కాలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా నాటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడంలో విఫలమయింది. కానీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాక.. పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతిని అధిష్టానం గుర్తించింది.
టీడీపీ నుంచి వచ్చినా రేవంత్ రెడ్డిలో ఉన్న ఫైర్ ను చూసి కాంగ్రెస్ నాయకత్వం పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి నాడు పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నకేసీఆర్ పై రేవంత్ రెడ్డి మాటల దాడి కూడా ప్రజలను ఆకట్టుకుంది. ఫలితంగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందువల్లనే ఢిల్లీ నాయకత్వం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగించింది. సీనియర్లున్నా, పార్టీని తొలి నుంచి అంటిపెట్టుకున్న వారు పార్టీలో ఉన్నా వారందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం ఆయన పనితీరును పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంది. అయితే రేవంత్ రెడ్డి రాహుల్ దూరం పెడుతున్నారని కూడా ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారానికి ఇటీవల ఎన్నికల ఫలితాలతో చెక్ పెట్టినట్లయింది.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ముఖ్యమంత్రిని కూడా కేర్ చేయని ఎమ్మెల్యేలుంటారు. అలాంటి వారందరి నోళ్లు ఇటీవల ఎన్నికల ఫలితాలు మూత పడేలా చేసాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి పదవి కొట్లాడి తెచ్చుకున్నది కాదని, కష్టపడి తెచ్చుకున్నదని రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో సీఎం రేవంత్ నిరూపించుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీలో ఇక చెక్కు చెదరని విధంగా ఉందన్నది మరోసారి అర్థమయింది. ఆయన ప్రత్యర్థులకు రేవంత్ ఈ రకంగా జవాబు చెప్పినట్లయింది.
ఇంకోవైపు.. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డికి, అధినాయకత్వానికి దూరం పెరిగిందన్న ప్రచారం ఒట్టిదేనని రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికతో స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీలో తన మాటకు ఎదురు లేదని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ దూరం పాటిస్తున్నారని, హైకమాండ్ పక్కన పెట్టేసిందని ప్రత్యర్థులు చేస్తున్న వాదనలు దాదాపు వీగిపోయాయి. తన చిరకాల స్నేహితుడు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేయించడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. ఎందరో ఆశావహులున్నా, సీనియర్ నేతలను కాదని, హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఇచ్చిందంటే ఆయన తన స్థానాన్నిఎంతగా పార్టీలో పదిలపర్చుకున్నారో అర్థమవుతుంది.
నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా కాలం నుంచి రేవంత్ రెడ్డి ఆధిపత్యమే నడుస్తుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డి తో రాజీపడక తప్పని పరిస్థితి నెలకొంది. అంతేకాదు గత కొంత కాలం నుంచి పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు లేవని,దూరం పెట్టిందని అనేకమంది ప్రచారాలు చేశారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో అనేక మంది పోటీ పడ్డారు. పార్టీ సీనియర్ నేతలు వి. హనుమంతరావు, జీవన్ రెడ్డి, కుసుమ కుమార్ లాంటి వాళ్ళు ఈ ఒక్క సీటు కోసం రేసులో ఉన్నా సరే, అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే అధినాయకత్వం మొగ్గుచూపింది. ఢిల్లీకి వెళ్లి కూర్చుని మరీ రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకున్నారు.
పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించడం కూడా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిందంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వం పార్టీకి అవసరమని కూడా హైకమాండ్ గుర్తించింది. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎవరు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ ఆ మాత్రం గౌరవం ఇస్తే తప్పేముందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే సీనియర్లకు ఒకింత బాధ కలగడం సహజమే. ఈ పోటీ రాజకీయంలో సీనియర్ నేతలు తట్టుకోలేరు. అన్నింటికీ సిద్ధపడ్డ వారు మాత్రమే రాజకీయాల్లో రాణించగలరని రేవంత్ రెడ్డి నిరూపించారు. అందుకే తన సన్నిహితుడిని పెద్దల సభకుపంపి ప్రత్యర్థులకు గట్టి సంకేతాలను బలంగా పంపగలిగారు.
దీంతో పాటు ఢిల్లీలో తనకంటూ ఒక నమ్మకమైన వ్యక్తి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి స్నేహం కొనసాగుతుంది. అనేక సమయాల్లో, అనేక విషయాల్లో రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రభుత్వానికి అవసరమైన పనులు త్వరిత గతిన చేసేందుకు తన మనిషి ఉండాలని ఈ నిర్ణయం తీసుకుని నరేందర్ రెడ్డి కే రాజ్యసభ సీటును దక్కేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంలోనే కాదు పార్టీ లోనూ తనదే పైచేయి అని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలను తిప్పికొట్టి ఢిల్లీలో తన మిత్రుడిని పంపి, తనకు సహాయ సహకారాలు అందించేందుకు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ఉపయోగించు కున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే పార్టీలోనూ రైజింగ్ రేవంత్ అని అనాల్సి ఉంటుంది.