శ్రీకాకుళంలో డయేరియా.. రాజమండ్రిలో కల్తీ పాలు! ఎమ్మెల్యేల విందు వినోదాలు!

ఏపీ రాజకీయాలు ఇప్పుడు పరాకాష్టకు చేరాయి. నైతికత అట్టడుగుకు పడిపోయింది. మనిషి ప్రాణం అంటే మున్సిపాలిటీ కుప్పలోని చెత్త కంటే హీనంగా మారిపోయింది. ఒకవైపు శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కోరలు చాచి సామాన్యుడి ప్రాణాలను తోడేస్తుంటే, మరోవైపు రాజమండ్రిలో కల్తీ మాఫియా తెల్లటి విషంతో మృత్యువును అమ్ముతోంది. ఇంత జరుగుతున్నా, సిగ్గుపడాల్సిన పాలకులు మాత్రం ప్రజల సొమ్ముతో మైదానాల్లో కబడ్డీ కూతలు కూస్తూ, ఫోజులిస్తూ వికృతానందం పొందుతున్నారు.   దాహార్తి.. డయేరియా.. చావు కేకలు! దాహం తీర్చాల్సిన నీళ్లే యమపాశాలై చుట్టుకుంటుంటే.. ఆ వాడల్లో కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి. డయేరియాతో ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే, “సురక్షిత తాగునీరు” అనే పదం ప్రభుత్వ డిక్షనరీలోనే లేదనిపిస్తోంది. ఆసుపత్రులు నరకకూపాల్లా మారాయి. బాధితులు నేల మీద పడి ఆర్తనాదాలు చేస్తుంటే, ఆ శబ్దాలు ఏసీ గదుల్లో ఉండే నేతల చెవికి సోకడం లేదు. ప్రజలు చస్తుంటే కనీసం పరామర్శించే తీరిక లేని ఈ ఎమ్మెల్యేలకు అసలు అధికారంలో ఉండే అర్హత ఉందా?   పాల రూపంలో ‘తెల్లటి విషం‘! పవిత్రమైన గోదావరి తీరాన ఇప్పుడు ‘విషపు చుక్కలు’ విక్రయిస్తున్నారు. కల్తీ పాల ముఠాలు రెచ్చిపోతుంటే, ఆ ముఠాల వెనుక ఉన్నది ఏ రాజకీయ హస్తం? చిన్నారులు తాగే పాలలో కూడా కెమికల్స్ కలిపి చంపుతుంటే, యంత్రాంగం ఎవరికి వత్తాసు పలుకుతోంది? ఈ కల్తీని అరికట్టలేని దౌర్భగ్య స్థితిలో ఉన్న ప్రభుత్వం, ఇంకేం సాధిస్తుందని ప్రజలు నమ్మాలి?   లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న కేటుగాళ్లు, పాలలో ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతూ చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఈ కల్తీ పాలు తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా, ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారు.కల్తీ పాల దందా అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటోంది. పాల రూపంలో తెల్లటి విషాన్ని ప్రజలకు అమ్ముతున్నా.. నిఘా పెట్టాల్సిన యంత్రాంగం నిద్రపోతోంది. తిన్న తిండి, తాగే పాలు.. ఏదీ నమ్మలేని స్థితిలో సామాన్యుడు భయం భయంగా బ్రతుకుతున్నాడు.   ప్రజలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉంటే, వారిని ఆదుకోవాల్సిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రజల సొమ్ముతో క్రీడా పోటీలు నిర్వహిస్తూ, రంగుల వేదికలపై సెల్ఫీలకు పోజులిస్తున్నారు.జిల్లాలో జనం చస్తుంటే.. మీరు కబడ్డీలు, క్రికెట్లు ఆడుతూ కేరింతలు కొట్టడం ధర్మమేనా? ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక బాధితులు అల్లాడుతుంటే.. మీరు మైదానాల్లో స్టేడియంలో నిర్మాణాల గురించి కబుర్లు చెబుతారా?   రాష్ట్రంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉంటే, ప్రజాప్రతినిధులుగా బాధ్యత తీసుకోవాల్సిన ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల సొమ్ముతో క్రీడా పోటీలు నిర్వహిస్తూ వినోదాల్లో మునిగిపోయారు.గొంతు ఎండిపోయి జనం చస్తుంటే.. మీరు గెలుపు గుర్రాలు ఎక్కుతారా?ఆసుపత్రుల్లో రోగులు ఏడుస్తుంటే.. మైదానాల్లో మీరు చప్పట్లు కొడతారా? కల్తీని ఆపడం చేతగాని మీరు.. కబడ్డీ కూతలు కూస్తారా? అంటూ వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.   ఇదేనా మీ బాధ్యత? ఓట్ల కోసం గడప గడపకు తిరిగే నాయకులకు, గడప దాటి బయటకు రాలేని స్థితిలో రోగాలతో ఉన్న ప్రజలు కనిపించడం లేదా? ప్రజల పన్నుల డబ్బుతో ఆటలు ఆడుకోవడమేనా మీరు నేర్చుకున్న రాజకీయం?పాలకులు ఇప్పటికైనా తమ స్వార్థ రాజకీయ క్రీడలను పక్కన పెట్టి, శ్రీకాకుళం డయేరియా బాధితులను, రాజమండ్రి కల్తీ పాల బాధితులను ఆదుకోవాలి. లేదంటే, రాబోయే రోజుల్లో ప్రజలే మీకు అసలైన ‘ఆట’ చూపిస్తారని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.