Basara: బాసర క్షేత్రానికి నూతన వైభవం: రూ. 225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం.. మాస్టర్ ప్లాన్ విశేషాలివే!

దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన ఏకైక అక్షర క్షేత్రం.. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం త్వరలో నూతన రూపును సంతరించుకోనుంది. వేద వ్యాస మహర్షి స్వయంగా ప్రతిష్టించిన ఈ ముగ్గురు అమ్మల ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

సుమారు రూ. 225 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చారిత్రక క్షేత్రాన్ని పునర్నిర్మించనున్నారు. ఆగమ శాస్త్రం మరియు సంప్రదాయాలకు ఏమాత్రం భంగం కలగకుండా.. అద్భుతమైన రాజగోపురం, విశాలమైన కోనేరు, ఉత్తర ద్వార అభివృద్ధి పనులతో పాటు భక్తుల కోసం ప్రత్యేక ధ్యాన మందిరాలను నిర్మించబోతున్నారు.వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం, పునఃనిర్మాణం తర్వాత ఆధ్యాత్మికంగా మరింత శోభను సంతరించుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక పనులకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు.

ద‌క్షిణ గంగగా గుర్తింపు పొందిన ప‌విత్ర గోదావ‌రి న‌దీ తీరంలోని బాస‌ర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు.. కురుక్షేత్ర యుద్ధానంత‌రం ప్రశాంతత కోసం వేద వ్యాస మ‌హ‌ర్షి గోదావ‌రి తీరానికి వ‌చ్చి బాస‌ర‌లో నివ‌సించార‌ట‌.. ఆ స‌మ‌యంలో స్వయంగా ఆయ‌నే గోదావ‌రి ఇసుక‌తో జ్ఞాన సరస్వతితో పాటు మ‌హా ల‌క్ష్మి, మ‌హా కాళి అమ్మ వార్ల మూర్తుల‌ను ప్రతిష్టించారని స్థల పురాణం.. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాస‌ర ప్రసిద్ధి చెందింది.

బాసర క్షేత్రంపై సీఎం రేవంత్ రెడ్డి భారీ మాస్టర్ ప్లాన్!

చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రం అక్షరాభ్యాసాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి ఏటా వసంత పంచమితో పాటు విశేష పర్వదినాల్లో వేలాది మంది చిన్నారులు ఇక్కడ విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తుంటారు. అయితే, భక్తుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడం, ప్రాచీన ఆలయం కావడంతో ఏళ్ల తరబడి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భక్తుల ఈ అవస్థలను గమనించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు, బాసర క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని దృఢంగా సంకల్పించారు. కేవలం మొక్కుబడి పనులు కాకుండా, ఆలయ సంప్రదాయాలు మరియు ఆగమ శాస్త్రాలకు భంగం కలగకుండా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ భారీ అభివృద్ధి పనులతో అక్షరాభ్యాసాలకు వచ్చే భక్తులకు ఇకపై మెరుగైన వసతులు అందనున్నాయి.

జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. కేవలం ఆధునీకరణ మాత్రమే కాకుండా, ఆలయ పవిత్రత మరియు సంప్రదాయాలు ఉట్టిపడేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ముందే అధికారులు శృంగేరి శారదా పీఠాధిపతులను సంప్రదించి వారి అమూల్యమైన సూచనలను స్వీకరించారు.

ఆలయ ప్రధాన భాగాలు అయిన గర్భాలయం, అర్ధ మండపం, రాజగోపురం, ఇతర ఉప గోపురాలు, మాడ వీధులు, పవిత్ర కోనేరు మరియు ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల నుంచి ప్రత్యేక అనుమతులు మరియు దిశానిర్దేశం పొందారు.

వారి సూచనల మేరకు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా, ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి ఈ తుది మాస్టర్ ప్లాన్‌ను అధికారులు రూపొందించారు. దీనివల్ల బాసర క్షేత్రం భవిష్యత్తులో మరింత ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా విరాజిల్లనుంది.

భ‌క్తుల సంఖ్య.. భ‌విష్యత్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉన్న గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పాన్ని 5 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెంచుతున్నారు. ఉత్తరం వైపున 9 అంత‌స్తుల రాజ‌గోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడ‌ల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించ‌నున్నారు. మొత్తంగా ఆల‌య విస్తీర్ణాన్ని 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల నుంచి 62 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెంచుతున్నారు.

బాసర క్షేత్రం ఇక కార్పొరేట్ స్థాయిలో!

బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, భక్తుల సౌకర్యార్థం అంతర్జాతీయ ప్రమాణాలతో సాగనుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత విశేషం ఏమిటంటే, ఆలయ ప్రాంగణంలోని ప్రతి నిర్మాణాన్నీ అత్యంత పవిత్రమైన శిలలతో చేపట్టనున్నారు.

మాస్టర్ ప్లాన్ విశేషాలు:

70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఒకేసారి 6 వేల మంది భక్తులు వేచి ఉండేలా క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ఫీడింగ్ రూమ్స్, ఫుడ్ స్టాల్స్, అత్యాధునిక టాయిలెట్స్ వంటి వసతులు ఉంటాయి.200 మంది ఏకకాలంలో ధ్యానం చేసుకునేలా ప్రత్యేక ధ్యాన మందిరం, ఈశాన్య దిశలో పవిత్ర కోనేరు, తూర్పున అద్భుతమైన తోరణాలతో సమాచార కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక వంటశాల, భోజనశాల మరియు ప్రసాద వితరణ కేంద్రాలు రానున్నాయి.ఆలయానికి ఉత్తర, తూర్పు దిశల్లో రోడ్ల విస్తరణతో పాటు భక్తుల కోసం ప్రత్యేక అండర్ పాస్ నిర్మిస్తారు. సోలార్ రూప్‌టాప్‌తో కూడిన విశాలమైన పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ఆలయ ప్రాంగణంలో మనోహరమైన పుష్పవనం, భవిష్యత్తు అవసరాల కోసం భారీ వృక్షాలతో కూడిన నందనవనం పెంచనున్నారు. భక్తుల అత్యవసర చికిత్సల కోసం ప్రాంగణం వెలుపల ప్రత్యేక హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

గోదావరి పుష్కరాలకు బాసర సిద్ధం
వచ్చే ఏడాది 2027 జూన్‌లో జరగనున్న అత్యంత పవిత్రమైన గోదావరి నది పుష్కరాల కోసం బాసర క్షేత్రం ముస్తాబవుతోంది. పుష్కరాల సమయంలో గోదావరి తీరానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల పుణ్యస్నానాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అమలవుతున్న ఆలయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే పుష్కరాల ప్రత్యేక సౌకర్యాలను కూడా పొందుపరిచారు.

భక్తుల విశ్వాసాలకు, ఆలయ ఆచారాలకు ఏమాత్రం భంగం కలగకుండా.. ప్రతి ఒక్కరికీ మెరుగైన వసతులు అందాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఘాట్‌ల విస్తరణ, రవాణా సౌకర్యాలు మరియు భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ భారీ ప్రణాళికతో పుష్కరాలకు వచ్చే భక్తులకు బాసరలో సరికొత్త అనుభూతి కలగనుంది.