తెలంగాణ విద్యా రంగంపై నార్త్ ఇండియా విద్యాసంస్థల ఆధిపత్యం పెరుగుతోందని, దీనివల్ల స్థానిక లెక్చరర్లు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేసింది. ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని మరియు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీసింది.
నార్త్ ఇండియన్ స్కూల్స్.. లోకల్ వాళ్లకు నో ఎంట్రీ!
రాష్ట్రంలో కొత్తగా వెలుస్తున్న అలెన్, ఎక్సలెన్స్, రెజనెన్స్ వంటి నార్త్ ఇండియా విద్యాసంస్థలు స్థానిక ఫ్యాకల్టీని కాదని, కేవలం తమ ప్రాంతం వారికే ఉద్యోగాలు ఇస్తున్నాయని నేతలు మండిపడ్డారు.రిసెప్షనిస్ట్ నుంచి క్లీనర్ల వరకు అందరినీ బయటి రాష్ట్రాల నుంచే తెచ్చుకుంటున్నారని, మరి తెలంగాణ లెక్చరర్లు, టీచర్లు ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నించారు.తెలంగాణ నిరుద్యోగ యువత విద్యాసంస్థలు పెట్టుకుంటామంటే అనుమతులు ఇవ్వని ప్రభుత్వం, నార్త్ ఇండియన్ లాబీకి ఎలా రెడ్ కార్పెట్ పరుస్తోందని నిలదీశారు. త్వరలోనే ఈ అడ్డగోలు అనుమతుల చిట్టా విప్పుతామని హెచ్చరించారు.
ఫీజుల దోపిడీపై పోరాటం: ‘అసెంబ్లీ సెషన్ పెట్టాల్సిందే’
జూన్, జూలై నెలల్లో ప్రైవేట్ పాఠశాలలు పెంచబోయే అడ్డగోలు ఫీజుల నుంచి పేరెంట్స్ ను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, ఫీజు నియంత్రణ చట్టాన్ని పాస్ చేయాలి. 8 నుంచి 10 శాతం కంటే ఎక్కువ ఫీజులు పెంచే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ధర్నాలకు సిద్ధం!
కొన్ని పాఠశాలలు పేరెంట్స్ ను కనీసం లోపలికి కూడా రానివ్వకుండా అగౌరవపరుస్తున్నాయని, అటువంటి యాజమాన్యాల తీరు మారాలని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి ఫీజులను నియంత్రించకపోతే, తాము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని.. ప్రతి స్కూల్ ముందు పేరెంట్స్ పక్షాన ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.తెలంగాణ విద్యార్థులను, ఉపాధ్యాయులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జై తెలంగాణ! అని పిలుపునిచ్చారు.