కొలికపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగడం చర్చనీయమైంది. కొలికపూడి శ్రీనివాసరావు మాకు వద్దు అంటూ అక్కడి శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. ఇంతకీ కొలికపూడి మాకు వద్దు అంటూ సొంత కార్యకర్తలే ఎందుకు నినదిస్తున్నారు? ఆయన చుట్టూ నెలకొన్న వివాదం ఏమిటి? ఆందోళనలు చేస్తున్నవారి ఆరోపణలు ఏమిటి? కొలికపూడి ఏం చెప్తున్నారు? అసలు కొలికపూడి శ్రీనివాసరావు Vs కేశినేని చిన్ని.. మధ్య వివాదాలకు కారణాలు ఏమిటి? అసలు తిరువూరు టీడీపీలో ఏం జరుగుతోంది.
దళిత బహుజన నేత కొలికపూడి శ్రీనివాసరావు..అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ ఆయనకు తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అప్పటివరకు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ చివరి నిమిషంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంతో కొలికపూడికి ఆ టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో 20 వేల ఓట్లకు పైగా మెజారిటీతో కొలికపూడి శ్రీనివాసరావు విజయం సాధించారు. ఇంతవరకు కొలకపూడిని ఒక కోణంలోనే చూశారు అందరూ.అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత కొలకపూడిలో రెండో యాంగిల్ చూశాక టీడీపీ సీనియర్లకు కూడా మచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎమ్మెల్యేగా కొలకపూడి గెలిచిన తరువాత ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీపీ ఇంటిని దగ్గరుండి బుల్డోజర్‌తో కూల్చేందుకు ప్రయత్నించడం వివాదాలను సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే కొలికిపూడి మాట తీరుపై అభ్యంతరాలు వినిపించాయి. తిరువూరు టీడీపీ శ్రేణులకు, ఆయనకు మధ్య దూరం పెరగడంతో అక్కడ ఆయనకు వ్యతిరేకంగా అసంతృప్త వర్గం ఏర్పడిందని స్థానిక టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇది తిరువూరులో కొలకపూడికి ఎర్త్ పెట్టేలా వ్యవహారాలు నడుస్తున్నాయ్.
తెలుగుదేశం పార్టీ అంతర్గత ముఠా కుమ్ములాటలు ఒక రేంజిలో ఉంటాయి. ప్రత్యేకించి… తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ హైకమాండ్ కు కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు. తమ క్రమశిక్షణ గీతల్లో నడుచుకోవడం లేదేని ఆయనకు ఎన్నిసార్లు వార్నింగులు ఇచ్చినప్పటికీ, చంద్రబాబు స్వయంగా హూంకరించినప్పటికీ.. ఆయన ప్రవర్తన తీరులో పెద్దగా మార్పు కనిపించడం లేదు.నారా లోకేష్ ఆశీస్సులతో కొలికపూడిని పూర్తిగా తొక్కేయాలని చూస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారాలకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. తన నియోజకవర్గ పరిధిలోని ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఎంపీకి ప్రోటోకాల్ మర్యాదలు దక్కడాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అడ్డుకున్నారు. ఎంపీ కేశినేని చిన్నిపై పైచేయి సాధించారు. ఇది కేవలం చిన్నికి మాత్రమే కాదని, ఆయనకు ఆశీస్సులు అందిస్తున్న టీడీపీ అధిష్టానంకు కూడా షాకేనని పలువురు విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
తిరువూరు నియోజకవర్గం పరిధిలోని గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం సందర్భంగా ఈ నేతలిద్దరూ సతీసమేతంగా పాల్గొన్నారు. దేవస్థాన పురోహితులు ఎంపీ కేశినేని చిన్ని చేతికి స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను అందజేశారు. వారికి ఎదురుగా రెండో వైపు ఉన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. తనకు కూడా పట్టువస్త్రాలు ఇవ్వాలంటూ పురోహితులను అడిగారు. పట్టువస్త్రాలు ఒకరికి మాత్రమే ఇవ్వగలరు గనుక.. ఇబ్బంది పడిన పురోహితులు ఆయనకు ముత్యాల తలంబ్రాలు అందించారు. అయితే ఎంపీ చేతికి పట్టువస్త్రాలు ఇవ్వడం నచ్చని ఎమ్మెల్యే కొలికపూడి ఆయన చేతినుంచి వాటిని బలవంతంగా విసురుగా లాక్కున్నారు. తన తలపై పెట్టుకుని.. కల్యాణ మండపం వద్దకు బయల్దేరారు. ఇది కాస్తా దొమ్మీగా మారే పరిస్థితి ఏర్పడింది గానీ.. ఆలయ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి అక్కడితో సద్దుమణిగేలా చేశారు. ఎంపీ నుంచి ఎమ్మెల్యే పట్టువస్త్రాలు లాక్కోగా.. ఎంపీ వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో ఎమ్మెల్యే వర్గీయులు తలపడ్డారు. వాగ్వాదం ముదిరి ఘర్షణ అయ్యేలోగా సద్దుమణిగింది. తన నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని కొలికపూడి చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యనేత కుమారుడి పేరు చెప్పుకుంటూ.. ఎంపీ చిన్ని దందాలు సాగిస్తున్నారని కూడా పలుమార్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొలికపూడిని పిలిపించి తీవ్రస్థాయిలో మందలించి పంపినట్టుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో నెమలి ఆలయంలో జరిగిన వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
ఈ వివాదంలో మరోవైపు తన వర్గీయులను ఎంపీ శివనాథ్ వారించారు. కల్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనుక వరుసలో ఎంపీ దంపతులు కూర్చున్నారు. స్వామి కల్యాణంలో కన్యాదానం చేయడానికి 250 మంది దంపతులు వచ్చారు. చిన్ని దంపతులు వారి మధ్యలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కల్యాణానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల నుంచి పది వేల మందికి పైగా హాజరయ్యారు. మరోవైపు.. పట్టు వస్ర్తాల వివాదం నేపథ్యంలో రెండు వర్గాల నడుమ గొడవలు జరుగుతాయేమోనన్న ఆందోళనతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఇంతకు ముందు కూడా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాల్లో ఇరుక్కున్నారు. వివాదాలు ఆయన తన స్టేటస్ గా పెట్టుకుని కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పల్లె కన్నీరు పెడుతోందంటూ కొలికపూడి శ్రీనివాసరావు పెట్టుకున్న స్టేటస్ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకన్నారు. దీంతో అసెంబ్లీ లాబీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి వ్యవహార శైలిని ఇక ఉపేక్షించే అవకాశం లేదని, ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు లేకపోతే ఎలా? అని పల్లా శ్రీనివాస్ కొలికపూడి శ్రీనివాసరావును ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలోనూ పరోక్షంగా పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేయడం క్రమశిక్షణ కమిటీ ఎదుటకు హాజరయి వివరణ ఇచ్చినా మార్పు రాలేదని పల్లా అన్నారని తెలిసింది.
కొంతకాలం క్రితం కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం రచ్చ కెక్కింది. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై సీరియస్ అయ్యారు. కొలికపూడి శ్రీనివాసరావు మరొకసారి వివాదాస్పద పోస్టులు పెట్టడంపై ఇప్పుడు కొందరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చర్యలు తీసుకోకుంటే కొలికపూడి నుంచి సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల మరింత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాయని భావిస్తున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు ను అందుకే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ లాబీల్లోనే హెచ్చరించినట్లు సమాచారం.
వాట్సాప్ లో పెట్టుకున్న స్టేటస్ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేసినట్లు స్పష్టంగా కనపడుతుంది. మూడు రోజుల్లో తాను ముప్ఫయి ఐదు గ్రామాలను పర్యటించానని, 485 కుటుంబాలతో ఆత్మీయ కలయికను చేపట్టినట్లు స్టేటస్ లో తెలిపారు. ఇంతటి తో ఆగకుండా రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు.. పల్లె కన్నీరు పెడుతోంది అంటూ ఆయన స్టేటస్ పెట్టడాన్ని అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో కొలికపూడికి ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేదని, ఏదో ఒక చర్య తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే తిరువూరు నియోజకవర్గంలో ముఖ్యమైన బాధ్యతలు వేరే వారికి పార్టీకి అప్పగించడం కూడా ఆయనలో ఆగ్రహానికి కారణమంటున్నారు. అయితే అనుభవరాహిత్యంతోనే తాను ఇలాంటి పోస్టులు పెడుతున్నానని, సీనియర్లు తనకు మార్గనిర్దేశనం చేయాలని పల్లా శ్రీనివాస్ తో చెప్పినట్లు తెలిసింది. ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఉన్నత చదువులు చదివిన కొలికపూడికి సీనియర్ల సలహా అవసరమా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కొద్ది నెలల క్రితమే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ చిన్ని వద్ద అసెంబ్లీ టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. చిన్ని ఆ ఆరోపణలను ఖండించారు. ఈ వివాదంపై టిడిపి క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి నివేదికను చంద్రబాబుకు సమర్పించింది. రాజకీయంగా చురుకైన కృష్ణా జిల్లాలో ఈ వివాదం టిడిపి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చంద్రబాబు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కొలకపూడి వ్యవహారంలో ఎలా అన్నది కాలమే సమాధానం చెబుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇంకోవైపు.. టీడీపీ అధిష్ఠానం జోక్యం చేసుకున్నా.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పాటు అధికారం వుంది. అలాంటిది టీడీపీ ఎమ్మెల్యేగా అధికారాన్ని సొమ్ము చేసుకోవడం నేటి పరిస్థితిలో తెలివైన నాయకుడి లక్షణంగా భావిస్తారు. అందుకు విరుద్ధంగా సొంతపార్టీపై ధిక్కార స్వరం వినిపించడం కొలికపూడి శ్రీనివాసరావుకు రాజకీయంగా, ఇతరత్రా నష్టమే.అయితే కొలికపూడిని నడిపించే అదృశ్య శక్తి టీడీపీలోనే ఉందని అత్యంత విశ్వసనీయ సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నుంచి ఎదురవుతున్న ప్రతి ఇబ్బందిని టీడీపీలోని ఆ ప్రజాప్రతినిధికి ఎప్పటికప్పుడు కొలికపూడి నివేదిస్తున్నారని తెలిసింది. కోస్తా జిల్లాలకు చెందిన ఆ కీలక, డైనమిక్ లీడర్‌గా టీడీపీ శ్రేణులు అభిమానించే ప్రజాప్రతినిధి దిశానిర్దేశం మేరకే కొలికపూడి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. మనసులో మాటను బయట పెట్టకుండా ఉండలేని ప్రజాప్రతినిధిగా ఆయనకు గుర్తింపు వుంది. కోస్తా జిల్లాలకు చెందిన ఆ ప్రజాప్రతినిధిలోని సుగుణాలే వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకులకు దగ్గర చేశాయి. ఆ తర్వాత టీడీపీలో చేరి, ఆశించిన పదవి కాకపోయినా, ఏదో ఒకటిలే అన్నట్టుగా ఆయనపై సీఎం చంద్రబాబు దయచూపారు. అప్పుడప్పుడు తనలోని అసంతృప్తిని ఆయనగారు బయట పెడుతుంటారు. సదరు ప్రజాప్రతినిధిని రాజకీయ గురువుగా కొలికపూడి భావిస్తున్నారు. అవకాశం వుంటే నేరుగా, లేదంటే సెల్‌ఫోన్‌లో నిత్యం మాట్లాడుకుంటుంటారు. తిరువూరులో తన ఉనికికే ప్రమాదం వచ్చేలా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరిస్తున్నారనే ఆవేదన, ఆగ్రహంతో కొలికపూడి తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. కొలికపూడిపై వేటు వేస్తే… టీడీపీకి రాజకీయంగా భారీ నష్టం. ఎందుకంటే, చంద్రబాబు సామాజిక వర్గం కావడంతో పాటు బాగా డబ్బుందన్న కారణంతో కేశినేని చిన్ని తప్పుల్ని వెనకేసుకొస్తున్నారనే అపప్రదను భరించాల్సి వస్తుంది. దీంతో కొలకపూడిని టీడీపీ అధిష్టానం భరిస్తోందన్న టాక్ వినవస్తోంది.
తిరువూరులో కొలికిపూడి శ్రీనివాసరావుకు, చిట్యాల సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు తలెత్తాయి. పేకాట ఆడిస్తున్నాననే ఆరోపణతో తిరువూరు పోలీసులు తుమ్మలపూడి శ్రీనివాసరావును స్టేషన్‌కు పిలిపించారు. దీంతో తుమ్మలపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని ఆశ్రయించారు. ఆ తరువాత తనను తిరువూరులోని ఒక సెంటర్‌లో కొలికపూడి శ్రీనివాసరావు తుమ్మలపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం ప్రారంభ అయింది. ఇది ఇద్దరి మధ్య వివాదం మరింత పెరగడానికి కారణమైంది. ఈ వివాదం సాగుతుండగానే కొలికపూడి శ్రీనివాసరావు తనను వేధించారని ఆరోపిస్తూ తుమ్మలపూడి శ్రీనివాసరావు భార్య, వీఆర్వో కవిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఆమె పరిస్థితి విషమించడంతో తిరువూరు నుంచి విజయవాడకు.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తుమ్మలపూడి శ్రీనివాసరావు నేతృత్వంలోని కొందరు టీడీపీ కార్యకర్తలు కొలికపూడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ తిరువూరు టీడీపీ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. తిరువూరుతో పాటు విజయవాడలోనూ కొలికపూడికి వ్యతిరేకంగా నిరసనలు జరిపారు. ప్రస్తుతం కొలకపూడి శ్రీనివాసరావును టచ్ చేస్తే.. ఏమి అవుతుందో ఎక్కడ కొత్త సమస్యలు వస్తాయో అని అందరూ భయపడుతున్నారు.