టీటీడీలో ఇక పొలిటికల్ ఎంట్రీ ఉండదా? చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ జగన్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక సీఎం చంద్రబాబు అయితే.. తిరుమల వ్యవహారంలో వేలు పెట్టిన వారు ఎవ్వరూ బాగుపడిన చరిత్ర లేదంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్ రిపోర్టు పంపించిందన్న చంద్రబాబు.. అందుకే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలను తయారు చేశారని అన్నారు. నిపుణులు, అధికారులతో కలిసి అందరూ కుట్రలు చేశారని చంద్రబాబు విమర్శించారు. మహాపాపం పేరుతో లడ్డూ కల్తీ జరిగిన తీరును అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.ఈ విషయంలో రాజకీయ వివాదం ఉండకూడదనే ఉద్దేశంతో సెట్ ఏర్పాటు చేశారన్న చంద్రబాబు.. సుప్రీంకోర్టు సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. సీబీఐ సెట్ కూడా తప్పుచేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపించిందని వివరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వివరించారు. మరోవైపు తిరుమల లడ్డూనే కాకుండా అనే విషయాల్లో గతంలో తప్పులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో 59.71లక్షల లీటర్ల మేరకు కల్తీ నెయ్యి వినియోగించారని చంద్రబాబు ఆరోపించారు. రూ.231.51 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని శాసనసభలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయిన తర్వాత కూడా రిపోర్టును తొక్కిపెట్టారంటూ వైఎస్‌ఆర్‌సీపీపై విమర్ళలు గుప్పించారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టునే తాను చదివానన్న చంద్రబాబు.. ఆ భగవంతుడే తనతో చెప్పించాడని శాసనసభలో అన్నారు.   ఈ సందర్భగా తన కుటుంబ సంస్థ హెరిటేజ్’ గురించి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. హెరిటేజ్’ మా కుటుంబ వ్యాపార సంస్థ.. ప్రభుత్వ సంస్థలకు ఎక్కడా మా ఉత్పత్తులు సరఫరా కాలేదు. వాళ్ల పత్రికలో మాత్రం హెరిటేజ్‌కు వ్యతిరేకంగా కథనాలు రాశారు.. ప్రభుత్వ సహకారం లేకుండా హెరిటేజ్ నిజాయతీగా వ్యాపారం చేస్తోంది. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీకి ముడిపెట్టేందుకు ప్రయత్నించారు.. హెరిటేజ్ డెయిరీ నిత్యం 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. నెయ్యి విషయంలో ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు సంబంధం లేదు.. హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ తప్పుడు పనులు చేయదని చంద్రబాబు ప్రకటించారు. ఇంకోవైపు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులకు తప్పకుండా శిక్షపడాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. లఘు చర్చలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాలని అన్నారు. జంతు సంబంధిత రసాయనాలు ఉన్నాయని ఎన్‌డీడీబీ రిపోర్టు చెప్పిందన్న పవన్ కళ్యాణ్.. అసలు నెయ్యే కాదని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చిందన్నారు. కల్తీనెయ్యిలో ఏ కెమికల్స్ వాడారనేదీ ఆ పెరుమాళ్లకే తెలియాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈ కల్తీ నెయ్యి వెనుక గత ప్రభుత్వ హెడ్ అంటే మాజీ సీఎం జగన్ ఉన్నారని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే ఆయన నియమించిన బోర్డు వల్లే తప్పు జరిగిందని, అలాంటి వారిని సమర్థించడం దారుణమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ… ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయని చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యానని,. తప్పు జరిగిందనే పశ్చాత్తాపంతోనే దీక్ష చేశానని, హిందువుల కోసం సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశానన్నారు. కల్తీ నెయ్యిలో ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళ్లకే తెలియాలి. జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్డీడీబీ నివేదిక పేర్కొంది. అది అసలు నెయ్యే కాదని సీబీఐ నివేదిక తెలిపిందని అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది కేవలం ఆహార భద్రత సమస్య మాత్రమే కాకుండా, ధర్మానికి సంబంధించిన అంశంగా చూడాలని అన్నారు. అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ సంస్కృతి. టీటీడీ పాత బోర్డును మాజీ సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అంటే ఆయనకూ భాగం ఉన్నట్టే కదా?అంటూ ప్రశ్నించారు. ఇది హిందూ మతానికి కాకుండా వేరే ఎవరికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేదని మరోసారి హిందువులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మొదట చంద్రబాబు జంతు కొవ్వుల ఆరోపణలు చేయగా, పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష పేరుతో సనాతన ధర్మం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని కొన్ని రోజుల పాటు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ నివేదికలో జంతు కొవ్వుల ప్రస్తావన లేకపోవడంతో, తాజాగా బాత్‌రూమ్ క్లీనింగ్ కోసం వాడే కెమికల్ కలిసిందని సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ, తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరోవైపు మండలిలో హెరిటేజ్-ఇందాపూర్ సంబంధంపై చర్చకు అనుమతి ఇవ్వడం లేదని వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. ఇంకోవైపు తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదం కల్తీ, అపవిత్రంపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సి రావడం బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై చర్చ జరిగింది. ఈ చర్చను మంత్రి ఆనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఆర్ డెయిరీతో పాటు అనుబంధ డెయిరీలు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ప్రొక్యూర్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్ పి.మురళీ కృష్ణ ఫిర్యాదుతో లడ్డూ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు 2024 సెప్టెంబర్ 25న ఆహార కల్తీ, మోసం, కుట్ర అభియోగాలతో కేసు నమోదైందని గుర్తు చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. ఆ తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించామని చెప్పారు. వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో ఓ వార్త కనిపించింది… అదేమిటంటే..? అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం నిర్వహణ తీరు, అక్కడ అమలయ్యే చట్టం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది కదా, అచ్చంగా అదే చట్టాన్ని టీటీడీలో అమలు చేయాలనే ఆలోచనతో సమగ్ర అధ్యయనం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించాడని ఆ వార్త సారాంశం.ఎస్, ఇదొక డైవర్షన్ టాక్టిస్. మాజీ సీఎం జగన్‌ను హిందూ ద్రోహిగా, చిత్రీకరించే క్రమంలో తీసుకున్న తప్పుడు నిర్ణయంగా వైఎస్ఆర్‌సీపీ భావిస్తోంది. చూద్దాం.. కూటమి ప్రభుత్వం ఎదుటి వాళ్లపై బురద చల్లబోయి తనే బురదలోకి కూరుకుపోతోందని వైఎస్‌ఆర్‌సీపీ వర్షన్. జగన్ అండ్ కో తిరుమలను ఎంత భ్రష్టుపట్టించారో జనం మొత్తం చూస్తోంది, వింటోంది, చదువుతోందని టీడీపీ గట్టిగా అంటోంది. సుప్రీం కనుసన్నల్లో సాగిన సీబీఐ సిట్ విచారణ జంతుకొవ్వును గాకుండా నెయ్యి గాని నెయ్యిని చూపించిందని టీడీపీ అండ్ కో గట్టిగా సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. గతంలో ఎన్డీడీబీ ల్యాబ్ జంతుకొవ్వు అవశేషాలు చెప్పినా సరే, సిట్ దాన్ని పక్కన పెట్టేసింది… కానీ చంద్రబాబు వదలడం లేదు… పదే పదే జంతుకొవ్వు పేరిట జగన్‌ను ద్రోహి ద్రోహి అని చెబుతోంది… ఆ జంతుకొవ్వును మళ్లీ జనంలోకి తీసుకురావడం కోసమే మాజీ సీఎస్ దినేష్ కుమార్ కమిషన్ వేశారనేది బహిరంగ రహస్యం… పక్కా పొలిటికల్ మూవ్…కానీ ఎక్కడో ఓ ఫుల్ స్టాప్ పడాలి, కానీ చంద్రబాబు పడనివ్వడు… ఇప్పుడట, ఏకంగా టీటీడీకి అమృత్‌సర్ తరహా చట్టం తీసుకొస్తాడట… చంద్రబాబు మార్క్ రాజకీయాలు తెలిసినవారెవ్వరూ ఈ నిర్ణయాన్ని నమ్మరు… స్వర్ణ దేవాలయం చట్టం 1925లో బ్రిటీషర్లు సిక్కు గురుద్వారాల కోసం తెచ్చారు. దేవాలయాలను స్వతంత్రంగా, రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించాలని ఏర్పాటు చేశారు. ఈ గురుద్వారాల్లో రాజకీయ జోక్యం ఉండదు..: ప్రభుత్వానికి ఈ కమిటీలో లేదా దేవాలయ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ఉండదు… సేవ చేసేవారిని భక్తులే ఎన్నుకుంటారు. ఆర్థిక పారదర్శకత, నిధుల వినియోగంపై ఆడిటింగ్ ఉంటుంది, భక్తులకు వివరాలు అందుబాటులో ఉంటాయి. మరి, ఇలాంటివి టీటీడీలో చేయాలంటే రాజకీయ నాయకులు ఒప్పుకుంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసెంబ్లీలోనూ.. మీడియా ముందు ఊకదంపుడు ప్రసంగాలు చెప్పే నాయకులు దేవుడి మాన్యం భూముల విషయంలోనే సవాలక్ష రాజకీయాలు చేస్తున్నారు. అలాంటిది వద్దన్నా వేల కోట్ల ఆదాయం వచ్చే టీటీడీని అంత ఈజీగా వదిలేస్తారా అని ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి ఈ తిరుమల కల్తీ వ్యవహారం ఎన్నికల వరకూ సాగదీసే అవకాశాలు ఉన్నాయని ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారంలో ఎవరు ఎవర్ని బుక్ చేస్తారో కానీ.. వ్యవహారం మాత్రం బూమరాంగ్ అవ్వటం ఖాయం అని పొలిటికల్ అనలిస్టులు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి.. ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందనేది. ఇది ఇవాళ్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్లీ కలుద్దాం. నమస్తే..