VijayasaiRedd: ‘అగ్నాస్త్రం’.. టార్గెట్ పురుగులా? రాజకీయ శత్రువులా? నెల్లూరు మిరప తోటలో ఎంపీ కొత్త అవతారం!

విజయసాయిరెడ్డి రూటు మార్చారు! రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ‘అగ్నాస్త్రం’ పడుతున్నారు. నెల్లూరులో మిరప తోటలకు సేంద్రియ మందులు స్ప్రే చేస్తూ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రాజకీయాలు వదిలేసి విజయసాయి ఇప్పుడు చేస్తున్న సేద్యం వెనక ఏమైనా పరమార్థం ఉందా అని పొలిటికల్ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, విజయసాయి రెడ్డి రూటు మారుతోందా? ఆయన గమ్యం ఎటువైపు వెళ్లబోతోంది.

 

వైఎస్సార్సీపీలో ఒకప్పుడు నెంబర్ టూ.. ఇప్పుడు పొలం గట్టున రైతు! ఎంపీ పదవికి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి, నెల్లూరు శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో బిజీ అయిపోయారు. గోమూత్రం, వేపాకులు, పొగాకుతో స్వయంగా ‘అగ్నాస్త్రం’ (Agnastram) తయారు చేసి మిరప చెట్లకు స్ప్రే చేస్తున్నారు. రాజకీయ సెటైర్ల స్థానంలో ఇప్పుడు వ్యవసాయ పాఠాలు కనిపిస్తున్నాయి. మరి ఇది నిజంగానే రాజకీయ సన్యాసమా? లేక వ్యూహాత్మక మౌనమా? సోషల్ మీడియాలో ఇప్పుడు సాయిరెడ్డి వీడియో హల్చల్ చేస్తోంది. సూటు బూటు వదిలేసి.. సామాన్యుడిలా మిరప తోటలో స్ప్రే కొడుతుంటే నెటిజన్లు షాక్ అవుతున్నారు. “రాజకీయాల కంటే వ్యవసాయమే మిన్న” అని కొందరు అంటుంటే.. “ఇదంతా వచ్చే ఎన్నికల కోసమేనా?” అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి (VijayasaiReddy) స్టైల్ మార్చారు. రాజకీయ అస్త్రాల కంటే ‘అగ్నాస్త్రం’ మిన్న అని నిరూపిస్తున్నారు.

రాజకీయాల్లో శత్రువుల మీద అస్త్రాలు సంధించిన సాయిరెడ్డి.. ఇప్పుడు పురుగుల మీద పిచికారీ చేస్తున్నారు. మద్యం స్కాంలో సీఐడీ దర్యాప్తు తర్వాత మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తానన్న ఆయన.. సడన్‌గా నెల్లూరు పొలాల్లో ప్రత్యక్షమయ్యారు. వైఎస్సార్సీపీలో సజ్జల వర్గం హవా నడుస్తుండటంతో జగన్ దగ్గర ఆయనకు దారులు మూసుకుపోయాయన్న చర్చ నడుస్తోంది. అందుకే అటు వైపు వెళ్లకుండా.. ఇటు హిందూత్వ వాదాన్ని, అటు ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకున్నారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

 

ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన ఈ చార్టర్డ్ అకౌంటెంట్.. ఇప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ముల దగ్గర అగ్నాస్త్రం తయారు చేస్తున్నారు. గోమూత్రం, వెల్లుల్లి, మిరపకాయల మిశ్రమంతో ప్రకృతి వ్యవసాయం (OrganicFarming) ఎలా చేయాలో వీడియో తీసి మరీ చూపిస్తున్నారు. 24 గంటలు నిల్వ ఉంచి, వడపోసి, మరగబెట్టి.. స్వచ్ఛమైన సేంద్రియ పద్ధతిలో మిరప తోటను కాపాడుకుంటున్నారు. రాజకీయ వేడి కంటే పొలం గాలి బాగుందని సాయిరెడ్డి ఫీలవుతున్నారా? అని పొలిటికల్ సెటైర్లు ఆన్‌లైన్‌లో పేలుతున్నాయి.

 

విజయసాయిరెడ్డి వ్యవసాయం వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు విశ్లేషకులు. ఒకవైపు పొలంలో పనులు చేస్తూనే.. మరోవైపు ట్విట్టర్‌లో మతమార్పిడులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కరుడుగట్టిన హిందూత్వ వాదాన్ని వినిపిస్తూ కమలం పార్టీకి సంకేతాలు పంపుతున్నారా..? అని ఆయన వ్యతిరేకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

వైఎస్ఆర్‌ సీపీలో పొమ్మనలేక పొగ పెడుతుండటంతో.. నెల్లూరు గడ్డపై నుంచి కొత్త రాజకీయానికి పునాది వేస్తున్నారా..? అని పొలిటికల్ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీగాక, విజయసాయిరెడ్డి మాటలకు అర్థాలే వేరులే అనేవారు లేకపోలేదు. అయితే ఇప్పుడు విజయసాయి కొత్త అవతారంలో కనిపించే సరికి ఆయన అభిమానులు సైతం నిర్ఘాంత పోతున్నారట.