రాజమండ్రిలో కల్తీ పాలు ఎలా అంటే..?

రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ విషాద ఘటనలో 5 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు . ప్రాథమిక పరీక్షల్లో బాధితుల రక్తంలో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగినట్లు తేలింది దీనివల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెప్పారు. ప్రభుత్వం ఈ సంఘటన పైన దర్యాప్తునకు ఆదేశించింది. పోలీసులు ప్రధాన నిందితుడైన పాల వ్యాపారిని గణేష్ ని అదుపులోకి తీసుకున్నారు. వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి సరఫరా అయిన పాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తూ ఉండటంతో ఆ డైరీ నుంచి సరఫరాను నిలిపివేశారు. పాల నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం పంపారు. ప్రజలు పాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 15 తర్వాత ఒకే ప్రాంతానికి చెందిన 14 మంది ప్రజలు తీవ్రమైన వాంతులు, కడుపుబ్బరం, మూత్రపిండాల పనితీరు దెబ్బతినటం వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. బాధితులు తాము వాడిన పాలు పెరుగు చేదుగా ఉన్నట్టు గమనించారు. మహాశివరాత్రి రోజున ఈ తేడాను స్పష్టంగా గుర్తించినట్లు వారు పోలీసులకు తెలిపారు .ఒకే ప్రాంతానికి చెందిన నలుగురు వృద్ధులు కిడ్నీ సమస్యలతో ఆసుపత్రికి రావడంతో కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆసుపత్రిలో గురైన వారందరికీ గణేష్ అనే ఒకే వ్యాపారి పాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారించటంతో ఈ మోసం బయటపడింది.ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురు మరణించారు. బాధితులలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు ఐదు నెలల పసికందు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అస్వస్థత గురి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార భద్రత అధికారులు పాల నమూనాలను సేకరించి విశాఖ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపారు. బాధితుల నుంచి సేకరించిన రక్త మూత్ర నమూనాలను ఇప్పటికే టాక్సీకాలేజీ పరీక్షల నిమిత్తం పంపారు . ఆ నివేదికలు వచ్చిన తర్వాతే కిడ్నీలు దెబ్బ తినటానికి వారి మరణాలకు పాలు కారణమా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది స్పష్టంగా వెల్లడవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పాలను తయారు చేసి లాభాలు గడించాలని ఉద్దేశంతో వ్యాపారులు పాలను కల్తీ చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ పాలలో అధిక మొత్తంలో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరగటానికి కారణమయ్యే ఇతర హానికరరసాయనాలు కలిపినట్లు గుర్తించారు. మరికొన్ని నివేదికల ప్రకారం ఇథిలిన్ గ్లైకాల్ వంటి విషపూరిత పదార్థాల ఉనికిని కూడా కనుగొన్నారు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని ఒక అనధికార డైరీ నుంచి సరఫరా అయిన పాలు ఈ విషాదానికి కారణమని అధికారులు గుర్తించి దానిని సీల్ చేశారు. ప్రజల్లో కల్తీ పాలను గుర్తించే అవగాహన తక్కువగా ఉండటం మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీలు చేయకపోవడం వంటివి ఇటువంటి ఘటనలకు దారి తీస్తున్నాయి.సాధారణంగా పాలను చిక్కగా మార్చటానికి నీళ్ళు, స్టార్చి, యూరియా వంటివి కలుపుతారు.   పాలు త్వరగా పాడవకుండా ఉండటానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా ఇతర రసాయనాలను పరిమితికి మించి వాడటం వల్ల కూడా అవి విషతుల్యంగా మారుతున్నాయి. కల్తీ పాలు తాగడం వల్ల బాధితులు.. అనూరియా.. అంటే మూత్రం విసర్జించలేకపోవటం వంటి తీవ్రమైన కిడ్నీ సమస్యల గురై మరణించారు. పాల శీతలీకరణ యంత్రాల నుంచి లీకైన ఇథలీన్ గ్లైకాల్ అనే విష పదార్థం పాలలో కలిసిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇది కిడ్నీలను దెబ్బతీస్తుంది. లాలాచెరువు ప్రాంతంలో ఒకే సరఫరాదారు నుంచి పాలు తీసుకున్న కుటుంబాలు తీవ్ర అనారోగ్యాన్ని గురి అయ్యాయి. ఇది సరఫరాదారు నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది.  పాలలో కల్తీని గుర్తించడం ఎలా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. నునుపుగా ఏటవాలు ఉపరితలం అంటే టైర్లు లేదా పలక పైన ఒక చుక్క పాలను వేయాలి. స్వచ్ఛమైన పాలు నెమ్మదిగా కిందకు జారుతూ వెనక తెల్లని గీతను వదిలివేస్తాయి.‌అదే నీళ్లు కలిపిన పాలు ఎటువంటి గీత లేకుండా వేగంగా కిందకు జారిపోతాయి.ఇక డిటర్జెంట్ కల్తీ ని గుర్తించడానికి కొద్దిగా పాలను ఒక బాటిల్లో తీసుకుని బాగా కలపండి.‌ పాలు చక్కటి నురుగుని ఏర్పరిచి ఆ నురుగు ఎక్కువ సేపు అలాగే ఉంటే అందులో డిటర్జెంట్ కలిపినట్లు అర్థం.‌ఒక టీ స్పూన్ పాలలో చిటికెడు పసుపు వేయండి. పాలు ఎరుపు లేదా నారింజ రంగు లోకి మారితే అందులో యూరియా ఉన్నట్లు గుర్తించాలి. యూరియాని గుర్తించడానికి సోయాబీన్ పౌడర్ మరియు పేపర్ కూడా వాడవచ్చు. పేపర్ నీలం రంగులోకి మారుతుంది. పాలను మరిగించి చల్లార్చిన తర్వాత రెండు చుక్కల అయోడిన్ ద్రావణం కలపండి.‌ పాలు నీలం రంగులోకి మారితే అందులో స్టార్చ్ అంటే పిండి కలిపినట్లు అర్థం. ఇక సింథటిక్ పాలు చేదు రుచిని కలిగి ఉంటాయి. వేళ్ళ మధ్య రుద్దినప్పుడు సబ్బు లాంటి అనుభూతిని ఇస్తాయి. వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. పాలను బాగా మరిగించినప్పుడు పైన మందపాటి మీగడ కడితే అవి స్వచ్ఛమైనవే పాలు అర్థం. పాల కల్తీ కి సంబంధించిన ఇతర సమాచారం కోసం భారత ప్రభుత్వ ఆహార భద్రత సంస్థ .. ఎఫ్ ఎస్ ఏ ఐ డాట్ బుక్ ని పరిశీలించవచ్చు.కల్తీ పాల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. లాలాచెరువు చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు అందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని దీని గురించి ఆందోళన చెందవద్దని బాధితుల కుటుంబాలకు సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్యశాఖ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని ఉన్నతా ధికారులను ఆదేశించారు. కల్తీకి పాల్పడే వారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన శిక్షలు తప్పు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కల్తీ పాల ఘటనపై వైసీపీ అధినేత వైయస్ జగన్ స్పందించారు. కల్తీ పాలు తాగి ఐదుగురు మరణించడం మరి కొంతమంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న సంఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ఇందులో కారణం అని.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి బాధితులకు సమగ్ర వైద్యం అందే చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో రాజమండ్రి. చౌడేశ్వరి నగర్ స్వరూప్ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.కల్తీ పాల బాధితుల సమాచారం కోసం 9494060060 నంబర్ ను సంప్రదించవచ్చు. పాలు లేదా ఇతర ఆహార పదార్థాలు కల్తీపై జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ 1915 లేదా 1800- 11 -4000 కు ఫిర్యాదు చేయవచ్చు. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా అస్వస్థత గురైతే వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిని సంప్రదించండి. అలాగే పైన పేర్కొన్న హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి.