రేవంత్ రెడ్డి మైండ్ గేమ్.. ఆ మంత్రులకు చెక్! ఆగస్టులో కొత్త క్యాబినెట్?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి అప్పుడే రెండున్నరేళ్లు ముగిసిపోయాయి. వచ్చే రెండున్నరేళ్ల కాలాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అటు పరిపాలనలో, ఇటు రాజకీయాల్లో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఒక పక్కా ‘ఎలక్షన్ టీమ్’ను రంగంలోకి దించేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

 గేరు మార్చిన రేవంత్.. ‘టాస్క్ 2.5’ షురూ!

“మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. అప్పుడే సగం పదవీకాలాన్ని పూర్తి చేసుకుంది. ఇక మిగిలిన రెండున్నరేళ్ల కాలంలో దూకుడు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) ఎన్నికలు, ఎంటిపిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గాంధీభవన్ వర్గాల టాక్ ప్రకారం.. వచ్చే నెల రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.

బ్యూరోక్రసీలో కుదుపు.. లూప్ లైన్‌లోకి ఆ ఐఏఎస్‌లు?

రేవంత్ మార్క్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇప్పటికే కొత్త డీజీపీ నియామకంతో పోలీస్ శాఖలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు అందరి కళ్ళు సెక్రటేరియట్ వైపు మళ్లాయి.

  • కొత్త సీఎస్ ఎంట్రీ: ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణారావు ఎక్స్‌టెన్షన్ గడువు ఈ నెల ఆఖరుతో ముగియనుంది. జూలైలో కొత్త సీఎస్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

  • ఐఏఎస్ అధికారుల బదిలీలు: దాదాపు 7 నుంచి 8 మంది కీలక ఐఏఎస్ అధికారుల బదిలీల లిస్ట్ రెడీ అయినట్లు సమాచారం.

  • ముఖ్యంగా కొందరు మంత్రుల పేషీల్లో తిష్టవేసి, వివాదాస్పద నిర్ణయాలకు కారణమైన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులకు సీఎం రేవంత్ షాక్ ఇవ్వబోతున్నట్లు ఐఏఎస్ వర్గాల్లో గుబులు మొదలైంది.

 ఆగస్టులో కొత్త క్యాబినెట్.. బీజేపీకి కౌంటర్‌గా ‘సోషల్ ఇంజనీరింగ్’

అటు అడ్మినిస్ట్రేషన్ మార్పులతో పాటు ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో క్యాబినెట్ ప్రక్షాళన హాట్ టాపిక్‌గా మారింది. ఆగస్టు మొదటి వారంలోనే కొత్త మంత్రివర్గం కొలువుదీరనుందని లీకులు వస్తున్నాయి.

పెద్దల వ్యూహం: కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ చేసిన క్యాస్ట్ ఈక్వేషన్స్, సోషల్ బ్యాలెన్స్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నిశితంగా పరిశీలించింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రధాన శత్రువు బీజేపీనే కావడంతో.. దానికి కౌంటర్‌గా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ‘సోషల్ ఇంజనీరింగ్’ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు.. పనితీరు బాగోలేని ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ మంత్రులకు ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది.

 రేవంత్ టీమ్‌కు పొంచి ఉన్న ముప్పులేంటి?

కొత్త ఎలక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డికి అంత ఈజీ కాదనే చర్చ నడుస్తోంది. ఈ మార్పులు కొత్త తలనొప్పులకు దారి తీసే అవకాశం ఉంది:

  1. మంత్రుల అసంతృప్తి: తమకు నమ్మకమైన అధికారులను బదిలీ చేస్తే ఆయా అమాత్యులు హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

  2. కోల్డ్ వార్ భయం: మంత్రి పదవులు కోల్పోయిన వారు రచ్చకెక్కడం లేదా ప్రాధాన్యత లేని శాఖలు కేటాయిస్తే ప్రభుత్వంలో అంతర్గత ‘కోల్డ్ వార్’ మొదలయ్యే ప్రమాదం ఉంది.

  3. సీనియర్ అధికారుల అలక: సీనియర్ ఐఏఎస్ అధికారులలో ఈ ఆకస్మిక బదిలీలు అసంతృప్తిని రాజేసే అవకాశం ఉంది.

ఏది ఏమైనా రాబోయే నెల రోజులు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కాబోతున్నాయి. జూలైలో కొత్త సీఎస్, ఆగస్టులో కొత్త క్యాబినెట్, మధ్యలో ఐఏఎస్, ఐపీఎస్‌ల భారీ బదిలీలు! ఈ మైండ్ గేమ్‌తో రేవంత్ రెడ్డి అనుకున్నట్లు ‘ఎలక్షన్ టీమ్’ సెట్ అవుతుందా లేక కొత్త వివాదాలకు కేంద్రబిందువు అవుతుందా అనేది వేచి చూడాలి.