తెలంగాణలో కేసీఆర్ కూతురు పార్టీ దూకుడు..పార్టీ పేరు ప్రకటన ఎప్పుడంటే..?
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సరికొత్త పోరుబాట పట్టారు. ‘తెలంగాణ జాగృతి’ వేదికగా జనంలోకి వెళ్తున్న ఆమె, అటు కేడర్‌లో జోష్ నింపుతూనే.. ఇటు ప్రభుత్వంపై ప్రజా సమస్యల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే 19 జిల్లాల్లో ‘జనంబాట’ ముగించిన కవిత, ఇప్పుడు ‘రైతు సంఘర్షణ’ పేరుతో క్షేత్రస్థాయిలో యుద్ధం ప్రారంభించారు. కొంతకాలంగా వ్యూహాత్మక మౌనం పాటించిన ఆమె, ఇప్పుడు నిత్యం ప్రజల్లోనూ, మీడియాలోనూ ఉండేలా ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సొంత రాజకీయ అస్తిత్వాన్ని చాటుకునేందుకు జిల్లా పర్యటనలు, భారీ సభలకు ఆమె శ్రీకారం చుట్టబోతున్నారు.పార్టీ అధికారిక ప్రకటన వెలువడే లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టేయాలని కవిత నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు పక్కా ప్లాన్ రచించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా, ముఖ్యంగా ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను అందిపుచ్చుకునేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. నిత్యం ప్రజల్లోనూ, మీడియాలోనూ ఉంటూ కేడర్‌లో జోష్ నింపడమే లక్ష్యంగా ఆమె పర్యటనలు సాగనున్నాయి.
ఇప్పటికే ‘జనంబాట’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో పర్యటనలు ముగించిన కవిత, మిగిలిన జిల్లాల్లోనూ పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. కొత్త పార్టీ ప్రకటన వెలువడే లోపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను చుట్టేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ఆమె భావిస్తున్నారు.
ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన అజెండాగా కవిత ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం విస్మరించిన వర్గాలను ఆకట్టుకునేందుకు ఈ క్రింది అంశాలను ఎంచుకున్నారు:
రుణమాఫీ అమలులో ప్రభుత్వ వైఫల్యాలు, రైతు భరోసా, పంటలకు బోనస్ వంటి రైతు సమస్యలపై తన తొలి పోరాటంలో తొలి అంశంగా జాగృతి పార్టీ ఎంచుకుంది. నిరుద్యోగ వృద్ధి, విద్యా రంగ సమస్యలపై పోరు చేయడం ద్వారా నిరుద్యోగులతోపాటు యవతకు దగ్గరయ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహిళా సంఘాల బలోపేతం మరియు భద్రత కల్పించే అంశాలను తీసుకెళ్లడంతో మహిళలను సైతం తమ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పబోతున్నారు.రైతుల సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు జోగులాంబ గద్వాల జిల్లాను తొలి వేదికగా చేసుకున్నారు. రైతు సంఘర్షణ కార్యక్రమంలో రుణమాఫీ ఎందుకాలేదు.. అసలు ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేశారు తదితర అంశాలను రైతుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోన్నారు. ఆ అంశంపై ప్రభుత్వానికి వినతిపత్రం రూపంలో అందజేయనున్నారు. తెలంగాణ పేరు వచ్చేలా తన పార్టీ ఉంటుందని మే మొదటి వారంలో పార్టీ ప్రకటిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో పార్టీ కార్యక్రమాలను స్పీడ్ చేశారు. ముఖ్యంగా గులాబీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని వ్యూహాత్మక అడుగులు కవిత వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు అంతగా లేకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు కొంత స్తబ్దుగా ఉన్నారు. ఈ తరుణంలో కవిత స్వయంగా రంగంలోకి దిగడం, తెలంగాణ జాగృతి వేదికగా కార్యక్రమాలు చేపట్టడం బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. చాలామంది నేతలు ఇప్పుడు జాగృతి వైపు ఆసక్తిగా చూస్తున్నారు
రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు ప్రతి రోజూ ఒక అంశంపై ప్రస్తావించాలని కవిత నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గ్యారెంటీల అమలుకు నిధుల కేటాయింపు, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలపై మీడియా వేదికగా ఎండగట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా మహిళలకు స్క్రూటీ, తులం బంగారం, 2500 లు ప్రస్తావించి మహిళల గళం వినిపించాలని భావిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ లో వీటన్నింటికి ప్రధానంగా తీసుకొని నిధులు కేటాయించి అమలు చేసేలా ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు జాగృతి నేతలు తెలిపారు.
ఇప్పటికే ఉద్యమకారుల అంశంతో పాటు వారిని ఐక్యం చేసి పోరుబాట పట్టేందుకు ఆర్టీసీ కళాభవన్ లో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మహిళాలకు ఇచ్చిన హామీలపై పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. మరోసారి నిరసన కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా విద్యార్థి విభాగంతో ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ ఎదుట ధర్నా, మహిళతో ప్రెస్ మీట్లు ఇలా అనుబంధ సంఘాలను యాక్టీవ్ చేశారు. ప్రతి అంశాన్ని అనుకూలంగా మల్చుకునే ప్లాన్ చేస్తున్నారు. సందర్భాను సారంగా ఆయా ప్రోగ్రాంలను తీసుకోబోతున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. పార్టీని ప్రకటించేవరకు వరుస కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో, మీడియాలో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
కవిత వరుసకార్యక్రమాలతో గులాబీ బేజారవుతుంది. గులాబీపార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కేడర్ లోనూ నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ప్రజాసమస్యలపై గళం ఎత్తకపోవడం, కేవలం ఎప్పుడో ఒకసారి మాత్రమే వారికి గుర్తుకు వచ్చినప్పుడే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకపోవడం, మీడియా వేదికగానే విమర్శలు గుప్పిస్తుండటంతో పార్టీ సీనియర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కేడర్ ను యాక్టీవ్ చేయాలంటే అది కార్యక్రమాలతోనే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆదిశగా చేపట్టకపోవడంతో అసంతృప్తికి గురవుతున్నారు. కవిత మాత్రం రోజూ ఏదో ఒక కార్యక్రమంతో దూకుడు పెంచడంతో గులాబీ కేడర్ సైతం ఆమె వైపు చూస్తున్నట్లు సమాచారం.