హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ‘నియోపొలిస్’ ప్రాంతం..గజం ధర కోట్లు పలికే చోట ఎకరాల కొద్దీ భూమి. ఆధ్యాత్మికత ముసుగులో రాజకీయ లబ్ధి జరిగిందా? లేక నిబంధనల ఉల్లంఘనతో ప్రభుత్వ ఖజానాకు గండి పడిందా? విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూముల చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక-రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. విశాఖ శారదా పీఠానికి గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నించడం, దానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా అడ్డుతగలడంతో అక్కడ ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. అసలు ఈ భూమి కథేంటి? జలమండలి ఎందుకు రంగంలోకి దిగింది? హరీష్ రావు చేసిన ఆరోపణలేంటి? చివరకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెనక్కి తగ్గారు? అనే అంశాలపై ప్రత్యేక కథనం.
శారదా పీఠం వివాదానికి పునాది ఎక్కడ పడింది? అంటే ప్రధానంగా రెండు అంశాల చుట్టూ తిరుగుతోంది.
మార్కెట్ విలువ ప్రకారం వందల కోట్లు పలికే భూమిని కేవలం నామమాత్రపు ధరకు కట్టబెట్టడం. కేబినెట్ నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందని, కేవలం ఒక పీఠాధిపతితో ఉన్న సాన్నిహిత్యం కోసమే ఈ భూమిని ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.
అసలు భూమి ఎవరు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు అనే వివరాలు ఓ సారి పరిశీలిద్దాం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ శారదా పీఠంపై ప్రత్యేక అభిమానం చూపించేవారట. ఆ సమయంలోనే 2021-2022 మధ్య కాలంలో ఈ ప్రక్రియ ప్రారంభించారట. కోకాపేట ఇది హైదరాబాద్లోనే అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ హబ్. పైగా 2 ఎకరాలు. ఎకరాకు కేవలం ఒక్క రూపాయి చొప్పున కేటాయింపు జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాస్తవానికి అక్కడ ఎకరా ధర రూ. 50 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు ధర పలుకుతుంది.
శారదా పీఠం స్థాపన నేపథ్యం ఓ సారి పరిశీలిస్తే..
విశాఖపట్నంలోని చినముషిడివాడ కేంద్రంగా పనిచేసే శారదా పీఠం, స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి నేతృత్వంలో కొనసాగుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశ్యామల యాగం వంటివి నిర్వహించి పీఠానికి అత్యంత సన్నిహితులుగా మారారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో పీఠం కార్యకలాపాల విస్తరణ కోసం, వేద పాఠశాల మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ భూమిని కోరారు.
ఇప్పుడెందుకు ఈ వివాదం ఎందుకు మొదలైందనే విషయానికి వద్దాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులపై ఆడిట్ నిర్వహించింది. ఈ క్రమంలో శారదా పీఠం భూముల్లోలోపాలను గుర్తించారట.ఆధ్యాత్మిక సంస్థలకు భూమి ఇచ్చేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను పక్కన పెట్టారనేది రేవంత్ సర్కారు ప్రధాన ఆరోపణ.ఈ భూమి కేటాయింపు వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 100 కోట్ల నష్టం వాటిల్లిందని స్పష్టం చేస్తుంది.పీఠం పేరుతో తీసుకున్న భూమిలో ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం శారద పీఠం భూమలపై ఎందుకు కీలక నిర్ణయం తీసుకోవలసి వచ్చిందంటే అనే ప్రశ్నలు ప్రధానంగా ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. “ప్రభుత్వ ఆస్తులు కొందరి వ్యక్తుల కోసమో, సంస్థల కోసమో ధారాదత్తం చేయకూడదు” అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కోకాపేటలోని శారదా పీఠం భూ కేటాయింపును రద్దు చేస్తూ అధికారిక నిర్ణయం తీసుకున్నారు.
ఇక తాజాగా జరిగిన సంఘటనకు వద్దాం. శారదా పీఠం భూములను ప్రభుత్వం తమకు కేటాయించిందని జలమండలి ప్రకటించడంతో రచ్చ మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలమండలి అధికారులు కోకాపేటలోని పీఠం భూములకు చేరుకున్నారు. అక్కడ ఉన్న నిర్మాణాలను పరిశీలించి, భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించారు.
ఇంకేముంది బీఆర్ఎస్ రంగంలోకి దిగింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు వెంటనే కోకాపేటకు చేరుకున్నారు. అక్కడ అధికారుల తీరుపై మండిపడ్డారు.కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలన్న కక్షతో ప్రభుత్వం దిగజారుతోంది. రాజకీయ వైరం కోసం గుళ్లను, మఠాలను ధ్వంసం చేయడం ధర్మం కాదు. హిందూ ధర్మ పరిరక్షణకు అడ్డంకులు సృష్టిస్తే ప్రజలు క్షమించరు” అని హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శారదా పీఠం భూమి కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరగలేదని హరీష్ రావు స్పష్టం చేశారు.2019లో కేసీఆర్ ప్రభుత్వం సర్వే నం. 240లో 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే, పీఠం నిర్వాహకులు రూ. 1.05 కోట్లు చట్టబద్ధంగా ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెల్లడించారు.
కేవలం భూమి తీసుకోవడమే కాకుండా, నిర్మాణాల కోసం HMDAకి రూ. 23 లక్షలు ఫీజు కట్టి మరీ అనుమతులు పొందారని ఆయన గుర్తుచేశారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు స్వాధీనం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
జలమండలికి శారద పీఠం భూములే ఎందుకు కావాల్సి వచ్చిందని నిలదీస్తూనే, సీఎం రేవంత్ రెడ్డి బంధువులపై సంచలన ఆరోపణలు చేశారు. పీఠానికి ఎదురుగా ఉన్న సర్వే నం. 239, 240లలో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి తన అల్లుడు, మేనల్లుళ్లు మరియు అనుచరులకు చెందిన ‘భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్’కు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు.
ప్రభుత్వం 10 ఎకరాలు ఇస్తే, వారు ఏకంగా 17 ఎకరాలు కబ్జా చేశారని.. ఈ భూమిని బహిరంగ వేలం వేస్తే ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం వచ్చేదని ఆయన వాదించారు. నామినేషన్ పద్ధతిలో దోచిపెట్టారని విమర్శించారు.
ఔటర్ రింగ్ రోడ్డు నిబంధనల ప్రకారం, కిలోమీటరు పరిధిలో ఎలాంటి క్రషర్లు ఉండకూడదని హరీష్ రావు గుర్తుచేశారు. సీఎం తన అల్లుడి ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ 5 రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు పెట్టించారని ఆరోపించారు.నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆ ప్లాంట్లను తక్షణమే తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శారదాపీఠం భూములు మరింత రాజకీయ వర్గాల్లో వివాదానికి కేంద్రబింధువుగా మారింది. దీంతో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రానికి సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు.
పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో, అక్కడ అప్పటికే ఉన్న నిర్మాణాల గురించి తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి చేసిన భూ కేటాయింపులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. ఆ భూములను శారదా పీఠానికే కొనసాగించాలని స్పష్టం చేస్తూనే.. పీఠం ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును కలిసి అక్కడ ఉన్న నిర్మాణాలు, వాస్తవ పరిస్థితులపై వివరణ ఇవ్వాలని సూచించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని హరీష్ రావు స్వాగతించారు. ఇది రాజశ్యామల అమ్మవారి కృపతో లభించిన ‘ధర్మ విజయం’ అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గడం శుభపరిణామమని పేర్కొన్నారు.
మొత్తానికి 8గంటల పాటు శారదా పీఠం భూముల హైడ్రమా వ్యవహారం ప్రస్తుతానికి సద్దుమణిగింది. కానీ ఈ ఉదంతం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో ‘భూ కేటాయింపులు’ మరియు ‘బంధుప్రీతి’ ఆరోపణలు మరోసారి చర్చకు వచ్చాయి. ప్రభుత్వం అభివృద్ధిని చూస్తుందా లేక సెంటిమెంట్లను గౌరవిస్తుందా అన్న సందిగ్ధంలో చివరకు రేవంత్ సర్కార్ ఆధ్యాత్మికతకే మొగ్గు చూపడం గమనార్హం.