సాధారణంగా స్వీపర్ అంటే జనాలకు చిన్నచూపు. వారు చాలా తక్కువస్థాయి ఉద్యోగులని అభిప్రాయం. ‘ఓహో…స్వీపర్ పని చేస్తున్నాడా?’ చాలా చీప్‌గా మాట్లాడతారు. పెదవి విరుస్తారు. స్వీపర్ఉద్యోగం తక్కువ స్థాయిదే కావొచ్చు. కాని వారికి వచ్చే జీతం మామూలుగా లేదు. వామ్మో ఇంత జీతమా? అని నోరెళ్లబెట్టాల్సిందే.
ఈ పరిస్థితి ఎక్కడో కాదు. తెలంగాణలోనే ఉంది. అవును…ఈ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ కంటే స్వీపర్శాలరీయే ఎక్కువ. చెప్రాసి అయినా సరే సర్కార్ నౌకరీయే మంచిది అంటారు పెద్దలు. ఎందుకంటే ఉద్యోగ భద్రత, టైంకి వచ్చే జీతమే ఇందుకు కారణం. ఈ స్వీపర్ నెల జీతం గురించి తెలిస్తే అటెండర్ ఉద్యోగం అయినా ఓకే అంటారు. ఎందుకంటే కలెక్టర్ జీతం కంటే ఎక్కువ. నెలకు రూ. 2 లక్షలు జీతం వస్తుంది మరి. పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీనియర్ ఐఏఎస్‌ల జీతం రూ.1.5 లక్షల వరకు ఉంటే.. సీనియర్ స్వీపర్ జీతం మాత్రం రూ.2 లక్షల వరకు ఉంది. ఈ విషయాన్ని ఎవరో కాదు సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణారావు వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేస్తోన్న సీనియర్ స్వీపర్ జీతం రూ.2లక్షల వరకూ ఉందన్నారు. ఇలా జీతం ఉండటానికి కారణం వరుస పీఆర్సీలేనని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ప్రతి నెలా రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2014లో ఇది కేవలం 1500 కోట్లుగా ఉండేదని ఇప్పుడు రూ.6 వేల కోట్లకు చేరిందన్నారు. కేవలం విద్యుత్ శాఖలోనే కాదు.. మున్సిపల్ శాఖలోనూ జీతాల మోత గట్టిగానే ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ లో రెగ్యులరైజ్ అయిన శానిటేషన్ వర్కర్లు సగటున రూ.70 వేలు అందుకుంటున్నారు. 30 ఏళ్ల సర్వీస్ ఉన్న డ్రైవర్లు, శానిటేషన్ సిబ్బందికి లక్ష రూపాయలకు పైగా జీతం అందుతోందట. ప్రతి నాలుగు ఏళ్లకోసారి జరుగుతున్న పే-రివిజన్లు, ఎన్నికల హామీలు ఈ స్థాయి జీతాలకు కారణమని తెలుస్తోంది. జీతాలు ఈ రేంజ్‌లో ఉన్నాయి కాబట్టే.. నోటిఫికేషన్ పడగానే నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఎగబడుతున్నారు. మొన్నటి గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ఒక్కో పోస్టుకు ఏకంగా 799 మంది పోటీ పడ్డారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ, ప్రాణం పెట్టి చదువుతున్నారంటే.. ఆ వెనుక ఉన్న ఆకర్షణ ఈ భారీ శాలరీలే. తెలంగాణ సర్కార్ ఖజానాకు శాలరీ సెగ తగులుతోంది. పదేళ్ల కిందట ఉన్న పరిస్థితికి, ఇప్పటికీ నక్కకు లోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నెలకు రూ.15వందల కోట్లుగా ఉన్న జీతాలు, పెన్షన్ల ఖర్చు.. ఇప్పుడు ఏకంగా రూ.6వేల కోట్లకు చేరింది. అంటే గడచిన 10 ఏళ్ల కాలంలో ఖర్చులు 300 శాతం పెరగటం గమనార్హం. దీనిపై సీఎస్ రామకృష్ణారావు వెల్లడించిన లెక్కలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. రేవంత్ సర్కార్ ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా ఉన్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో పనిచేసే చీఫ్ ఇంజనీర్లు నెలకు రూ.7 లక్షల వరకు వేతనం అందుకుంటున్నారు. ఇది ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర గవర్నర్ జీతం కంటే కూడా ఎక్కువే. స్వీపర్ జీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అన్ని శాఖల్లోని స్వీపర్లకు ఇలా జీతాలు ఉండవు. కేవలం విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు మాత్రమే భారీగా జీతాలు అందుతున్నాయి. అందుకు కారణం విద్యుత్ శాఖలో సంస్కరణలు. రాష్ట్రంలో ప్రస్తుతం కరువు భత్యం ప్రాథమిక వేతనంలో 33.67 శాతంగా ఉంది. వివిధ గ్రూపుల వేతనాల వివరాలు ఒకసారి చూస్తే.. గ్రూప్ 1: రూ. 80,000 నుండి రూ. 1.5 లక్షల పైచిలుకు. గ్రూప్ 2: రూ. 60,000 నుండి రూ. 1.2 లక్షల వరకు. గ్రూప్ 4: ఎంట్రీ లెవల్‌లో రూ. 35,000 నుండి రూ. 50,000 వరకు జీతాలు ఉన్నాయి. రాష్ట్ర ఆదాయంలో సుమారు 45 శాతం వాటా కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీలకే సరిపోతోంది. అయినప్పటికీ, తెలంగాణ జీఎస్‌డీపీ 10 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటుతో ఉండటం, తలసరి ఆదాయం దేశంలోనే అగ్రస్థానంలో ఉండటంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, వేతనాల చెల్లింపులను సమర్థవంతంగా నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో వరుసగా వేతన సవరణలు జరగడం వల్లే ఈ అధిక వేతనం లభిస్తోందని అధికారులు తెలిపారు.