విత కొత్త రూట్.. ‘గులాబీ’కి షాక్ ఇచ్చేలా సొంత పార్టీ వ్యూహం? నిజామాబాద్ వేదికగా పాలిటిక్స్ రీస్టార్ట్!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోబోతుందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ తర్వాత కల్వకుంట్ల కవిత తన రూటు మార్చేశారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న కవిత, ఇప్పుడు సరికొత్త వ్యూహంతో క్షేత్రస్థాయిలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా, తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వం కోసం కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.తన రాజకీయ పునాదులు ఉన్న నిజామాబాద్ జిల్లానే వేదికగా చేసుకుని పాలిటిక్స్ రీస్టార్ట్ చేయాలని ఆమె భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ జాగృతి, ఇప్పుడు ఒక రాజకీయ ఆయుధంగా మారుతోంది. బీఆర్ఎస్‌తో విభేదించిన తర్వాత కవిత తన పూర్తి ఫోకస్‌ను జాగృతిపైనే పెట్టారు.రాష్ట్రంలో ఎక్కడ చిన్న సమస్య తలెత్తినా, జాగృతి కార్యకర్తలు అక్కడ వాలిపోతున్నారు.ప్రజల పక్షాన నిలబడి, రాజీలేని పోరాటానికి కవిత సిద్ధమవ్వడం ఆమె భవిష్యత్ కార్యాచరణకు నిదర్శనం.

తెలంగాణ ఉద్యమ గడ్డపై నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కవిత, నిజామాబాద్ ఎంపీగా జాతీయ రాజకీయాల్లోనూ తన ముద్ర వేశారు.ఉద్యమ కాలం నాటి ఆవేశం.. ఎంపీగా సంపాదించిన అనుభవం.. ఇప్పుడు ఆమెను సరికొత్త రాజకీయ శక్తిగా నిలబెడుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.నా ఫస్ట్ ఛాయిస్ సిద్దిపేట.. సెకండ్ ఛాయిస్ బోధన్ అని కవిత ప్రకటించడం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. సిద్దిపేటను ఎంచుకోవడం ద్వారా హరీష్ రావు కోటలో పాగా వేయాలని, బోధన్ ద్వారా తన పాత నిజామాబాద్ పట్టును నిరూపించుకోవాలని ఆమె భావిస్తున్నారు.

ఏప్రిల్ నెలలో కవిత తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు.పార్టీ పేరును ఇప్పటికే దాదాపుగా ఖరారు చేశారని, అయితే వ్యూహాత్మకంగా దానిని గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించేలా పేరు ఉండబోతున్నట్లు సమాచారం. తెర వెనుక ఇప్పటికే కీలక నేతలు, మేధావులు, మరియు ఉద్యమకారులతో కవిత నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.రాజకీయాల్లో వ్యూహప్రతివ్యూహాల కంటే ముహూర్తాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్ శైలినే కవిత కూడా అనుసరిస్తున్నారట.సరైన ముహూర్తం చూసి, గ్రహబలాలు అనుకూలించినప్పుడే జెండా ఎగరేయాలని కవిత భావిస్తున్నారు. అందుకే అన్ని సిద్ధమైనా, అధికారిక ప్రకటన కోసం ఆ ముహూర్తం వచ్చే వరకు వేచి చూస్తున్నారు.

 

దశాబ్ద కాలానికి పైగా తెలంగాణ జాగృతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ కవితకు బలమైన అనుచరగణం ఉంది. ఇప్పుడు అదే వ్యవస్థను ఒక రాజకీయ శక్తిగా మార్చడమే ఆమె ప్రధాన లక్ష్యం ఉన్నారు.ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ తన విధేయులతో కవిత ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ ప్రకటన రాగానే క్షేత్రస్థాయిలో పనిచేసేలా ఒక ‘షాడో టీమ్’ సిద్ధమైందని టాక్.జాగృతి వాలంటీర్లు మాత్రమే కాకుండా, మహిళా సంఘాలు, యువజన విభాగాలు పెద్ద ఎత్తున ఆమె వెంటే నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారట.

 

ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ కవులు, కళాకారులు, మరియు ఉద్యమకారులతో కవిత రహస్యంగా సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులతో చర్చించి.. రాష్ట్రంలోని ప్రస్తుత సమస్యలకు పరిష్కారంగా తమ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండాలో ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చారట.పార్టీని ప్రకటించిన రోజునే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూడా కవిత గూటికి చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

కవిత తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మెట్టినిల్లు నుంచే తన కొత్త పార్టీ జెండాను ఎగురవేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.నిజామాబాద్ జిల్లాలో ఆమెకు ఉన్న పట్టు, కేడర్ మద్దతు దృష్ట్యా అక్కడి నుంచే పార్టీని ప్రకటించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బలమైన సంకేతాలు పంపాలని భావిస్తున్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసుకునే పనిలో కవిత టీమ్ నిమగ్నమైంది.

 

ఇప్పటికే ఇతర పార్టీల్లోని పలువురు కీలక నేతలు కవితకు ప్రత్యక్షంగా ఫోన్ చేసి, ఆమె కొత్త ప్రయాణానికి ‘ఆల్ ద బెస్ట్’ చెబుతున్నారట. పార్టీని ప్రకటించిన వెంటనే, వివిధ పార్టీల నుంచి అసంతృప్త నేతలు పెద్ద ఎత్తున కవిత గూటికి చేరే అవకాశం ఉందని ఆమె సన్నిహిత వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

 

కవిత కేవలం పార్టీని ప్రకటించి ఊరుకోవడం లేదు, ప్రతి జిల్లాలోనూ ఒక బలమైన క్యాడర్‌ను సిద్ధం చేసుకున్నారు. ప్రతి జిల్లాలోనూ ఒక ముఖ్య నేతను బాధ్యుడిగా నియమించి, చేరికలపై మంతనాలు సాగిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోని అసంతృప్త నేతలతో కవిత టీమ్ ఇప్పటికే టచ్‌లోకి వెళ్లింది. పార్టీ ప్రకటన రోజే భారీగా ‘వలసల పర్వం’ ఉండేలా ప్లాన్ చేశారు.

 

ఒకప్పుడు తండ్రిని, అన్నను వెనకేసుకొచ్చిన కవిత.. ఇప్పుడు తన రాజకీయ అస్తిత్వం కోసం విమర్శల పదును పెంచారు.లిక్కర్ స్కామ్ కేసులో తాను ఇబ్బందులు పడుతుంటే పార్టీ నాయకత్వం, ముఖ్యంగా కేసీఆర్ మరియు కేటీఆర్ మౌనంగా ఉండటంపై ఆమె బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు.అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ను సమానంగా ఎండగడుతూనే.. బీఆర్ఎస్ వైఫల్యాలను కూడా ఎత్తిచూపుతున్నారు.

 

అదలా ఉంటే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన కవిత భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇక్కడ కవిత పోటీ పరిసర జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని జాగృతి శ్రేణులు భావిస్తున్నాయి. కవిత తనకు అత్యంత పట్టు ఉన్న బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మార్పులు జరిగితే ఆలోచన మారే అవకాశం లేకపోలేదంటున్నారు.

 

కవిత కొత్త పార్టీ పెట్టిన తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణాలు, పరిణామాలు మారడం ఖాయమంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఆమెకు క్లీన్ చీట్ రావడంతో జాగృతిలో జోష్ పెరిగింది. మొన్నటి వరకు స్తబ్దతుగా ఉన్న క్యాడర్ తో పాటు లీడర్లు కూడా యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక కవితతో మొన్నటి వరకు దూరంగా ఉన్న వాళ్ళు కూడా త్వరలో కవిత కొత్త పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారంట.

 

ఐదు నెలల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత బెయిల్ పై బయటకు రాగానే ఛాలెంజ్ చేశారు. అన్నట్లుగానే నిర్దోషిగా బయటపడ్డారు. ఆ కేసులో గతంలో ఆమె అరెస్ట్ అయినప్పుడు గులాబీ పార్టీ పెద్దగా స్పందించలేదు. ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాసీనత, కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లు అయిందని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అదే విషయాన్ని కవిత కోర్టు తీర్పు తర్వాత మీడియా ముందు ఎత్తిచూపారు. పార్టీ ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారని ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. అలాగే కోర్టు తీర్పు తర్వాత కవిత అరెస్ట్ తమకు రాజకీయంగా నష్టం చేసిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కవిత ఖండించారు.

 

మొత్తానికి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన విశ్వరూపం చూపిస్తున్న కవిత రాజకీయాల్లో భవిష్యత్ ను పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు. ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవితకు ప్రధాన అనుచరులు ఉన్నారు. కీలకనేతలు వస్తే బలంగా నిలబడొచ్చనే ఆలోచనతో పావులు కదుపుతున్నారు. ఆమె టార్గెట్ లిస్టులో బీఆర్ఎస్ ప్రధానంగా కనపడుతుండటంతో ఆ పార్టీ నేతలు మింగలేక కక్కలేక సతమతమవుతున్నారంట.