వైసీపీలో జగన్ కొత్త మార్క్ పాలిటిక్స్.. రీజినల్ కోఆర్డినేటర్ల మార్పుతో జ్ఞానోదయం

వైఎస్‌ఆర్‌సీపీలో నియామ‌కాలు…ఎన్నిక‌ల‌కు ముందు, ఆ త‌ర్వాత అని మాట్లాడుకోవాలి. ఎన్నిక‌ల‌కు ముందు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను ఇచ్చే సంద‌ర్భంలో అంతా నా ఇష్టం అనే రీతిలో మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ వ్యవహరించారు. తను ఎవర్ని నిల‌బెట్టినా గెలుస్తార‌నే న‌మ్మ‌కం. అయితే ప్రజాభిప్రాయం వేరేగా ఉంద‌నే చేదు నిజం..ఎన్నిక‌ల్లో ఓడితే త‌ప్ప వైఎస్ జ‌గ‌న్‌కు అర్థం కాలేదు.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కాద‌ని అనామ‌కుల్ని నిలిపి, ప్ర‌జ‌ల‌తో చీవాట్లు పెట్టించుకున్న ఘ‌న‌త వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానానికి ద‌క్కుతుంది. ఎంత‌సేపూ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత‌గా త‌న‌ను మాత్రమే చూసి జ‌నం ఆద‌రిస్తార‌నే భ్రమ‌లో వైఎస్ జ‌గ‌న్ ఉండేవారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల‌ను కూడా చూసి ఓట్లు వేస్తార‌ని ఆయ‌న అనుకోలేదు. వైఎస్ జ‌గ‌న్ అనుకున్నదొక‌టి, ఎన్నిక‌ల్లో అయ్యిందొక‌టి. అదంతా పెద్ద గుణ‌పాఠం. అయితే ఎన్నిక‌ల్లో ఓట‌మితో వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానానికి టన్నుల కొద్దీ జ్ఞానోద‌యం అయ్యిన‌ట్టుంది. ప్రాంతాలు, అక్కడి సామాజిక వ‌ర్గాలు, ప్రజాభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పార్టీ ప‌ద‌వుల్ని భ‌ర్తీ చేస్తున్నట్టుగా క‌నిపిస్తోంది.

 

తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్స్ నియామ‌కాల్ని చేప‌ట్టారు. వైఎస్‌ఆర్‌సీపీలో రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల వ్యవస్థ అత్యంత కీల‌క‌మైంది. ఎన్నిక‌ల్లో అభ్యర్థులు ఎవ‌రైతే బాగుంటారో రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లే నిర్ణయించే ప‌రిస్థితి. మూడు, నాలుగు నెల‌ల‌కు ఒక‌సారి జిల్లాల్లో స‌భ‌లు, స‌మావేశాలు నిర్వహిస్తూ, ఏఏ నాయ‌కుడు బాగా ప‌ని చేస్తున్నారో రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు గ‌మ‌నించేవారు. వారి ప‌నితీరుపై వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి నివేదించేవారు. అందుకే రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లతో ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు బాగా వుండేవారు. వైఎస్ జ‌గ‌న్ అంటే ఎంత భ‌య‌భ‌క్తుల‌తో మెలిగేవారో, అంత‌కంటే రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల మాట వింటే వ‌ణికేపోయేవారు.

ఒక‌ప్పుడు రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లంటే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు మిధున్‌రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పేర్లు మాత్ర‌మే వినిపించేవి. వీళ్లంద‌ర్నీ చూస్తే, వైఎస్‌ఆర్‌సీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల‌నే కంటే , రెడ్ల సంఘానికి ఏమైనా ప్రాంతీయ నాయ‌కుల‌నే అభిప్రాయాన్ని టీడీపీ ప్రజల్లోకి చొప్పించింది. అందుకే వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉండ‌గా, మిగిలిన సామాజిక వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోక‌పోగా, దూరం చేసుకోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఒక‌వేళ గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప‌రిధిలో రెడ్లను రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లగా నియ‌మించారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఉభ‌య గోదావ‌రి, ఉత్తరాంధ్ర, కృష్ణా-గుంటూరు జిల్లాల‌కు కూడా జ‌గ‌న్ త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే బాధ్యత‌లు అప్పగించ‌డం తీవ్ర విమ‌ర్శల‌కు దారి తీసింది.

 

ఈ ధోర‌ణిపై వైఎస్‌ఆర్‌సీపీ ముఖ్య నాయ‌కుల్లోనే అసంతృప్తి క‌నిపించింది. ఇలాగైతే పార్టీ బ‌తికి బ‌ట్ట ఎలా క‌డుతుంద‌నే ప్రశ్న సొంత పార్టీ నేత‌ల నుంచే వినిపించింది. ఎన్నిక‌ల్లో అదే నిజ‌మైంది. దీంతో రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల నియామకాల్లో త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో మార్పు తేవాల్సిన అవ‌స‌రాన్ని వైఎస్ జ‌గ‌న్ గుర్తించారు. అందుకు త‌గ్గట్టు దిద్దుబాటు చ‌ర్యలు చేప‌ట్టారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావ‌రి జిల్లాకు బొత్స స‌త్యనారాయ‌ణ‌, ఉమ్మడి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు గుడివాడ అమ‌ర్నాథ్‌, ఉమ్మడి విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌కు కుర‌సాల క‌న్నబాబు, శ్రీ‌కాకుళం, పార్వతీపురం మ‌న్యం జిల్లాల‌కు బూడి ముత్యాల‌నాయుడు నియ‌మితుల‌య్యారు. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ముందు విశాఖ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లుగా విడ‌త‌ల వారీగా విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అలాగే ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిల‌కు బాధ్యత‌లు అప్పగించారు.

 

ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి, అది కూడా వేరే సామాజిక వ‌ర్గాలు బ‌లంగా ఉన్నచోట బాధ్యత‌లు అప్పగించి, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఉత్తరాంధ్రలో బీసీలు, అలాగే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాపులు, ద‌ళిత సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌. ఇలాంటి చోట ఆ సామాజిక వ‌ర్గాల నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న బొత్స స‌త్యనారాయ‌ణ‌, గుడివాడ అమ‌ర్నాథ్‌, కుర‌సాల క‌న్నబాబు, ముత్యాల నాయుడుకు రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల బాధ్యత అప్పగించ‌డం తెలివైన ప‌ని. వీళ్ల నియామ‌కంతో వైఎస్‌ఆర్‌సీపీని త‌మ‌ద‌ని ఆయా సామాజిక వ‌ర్గాలు భావించే అవ‌కాశం వుంటుంది. త‌ద్వారా రాజ‌కీయంగా బ‌ల‌ప‌డ‌డానికి మార్గం ఏర్పడుతుంది. గ‌తంలో విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వైఎస్‌ఆర్‌సీపీకి చేసిన న‌ష్టం అంతాఇంతా కాదు. మ‌రీ ముఖ్యంగా గతంలో ప్రత్యక్ష రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధం లేని వైవీ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లగా ఎక్కువ‌గా క‌నిపించేవారు. వీరికి క్షేత్రస్థాయిలో నాయ‌కుల స‌మ‌స్యలు అర్థమ‌య్యేవి కావు. కానీ ఇప్పటి నియామ‌కాల్లో ప్రత్యక్ష రాజ‌కీయాల‌తో సంబంధం ఉన్నోళ్లే కావ‌డం విశేషం.

 

ప్ర‌జ‌ల‌తో పాటు పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తల మైండ్‌సెట్ ఏంటో తెలిసిన రాజ‌కీయ నాయ‌కులు కావ‌డంతో, ఎలా మెల‌గాలో బాగా తెలుసు. రాజ‌కీయంగా వైఎస్‌ఆర్‌సీపీకి ఇది అద‌నంగా అనుకూలించే అంశం. ప్రజ‌ల్లో ప్రభుత్వంపై వ్యతిరేక‌త పెరుగుతున్న క్రమంలో ప్రత్యక్ష రాజ‌కీయ అనుభ‌వం ఉన్న వారికి కీల‌క ప‌ద‌వులు క‌ట్టబెట్టడం మంచి ప‌రిణామం. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు కోరుకుంటున్నది కూడా ఇలాంటి మార్పే. ఇప్పుడీ నియామ‌కాల‌తో ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాతే, వైఎస్ జ‌గ‌న్ న‌ష్టమెక్కడ జ‌రిగిందో గుర్తించిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే ఆయా ప్రాంతాల్లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాలున్న వారికే ఇప్పుడు పార్టీలో కీల‌క ప‌ద‌వులు అప్పగించారు. ఇది వైఎస్‌ఆర్‌సీపీలో చోటు చేసుకున్న భారీ మార్పుగా చూడాల్సి వుంటుంది. వైఎస్‌ఆర్‌సీపీలో బ‌ల‌మైన నాయ‌క‌త్వానికి కొర‌త‌లేదు. అయితే వారిని ఉప‌యోగించుకోవ‌డంలో ఇంత‌కాలం పార్టీ అధిష్టానం ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించింది. ఎన్నిక‌ల్లో తీవ్ర ప్రతికూల ఫ‌లితాలు రావ‌డంతో ఎట్టకేల‌కు జ్ఞానోద‌యం అయ్యిందనే మాట వినిపిస్తోంది. చూడాలి మరి.. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం తాలూక ఫలితాలు క్షేత్రస్థాయిలో వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడతాయో అన్నది.