గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి నిర్దిష్ట విధానాలు లేని తెలంగాణలో, తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ‘తెలంగాణ రైజింగ్ 2047’ పేరుతో ఒక బృహత్తర పాలసీని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఇందిరా మహిళా శక్తి, టూరిజం మరియు స్పోర్ట్స్ పాలసీలను ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు.
కోటి గొంతుకల ఆర్థిక విప్లవం
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ‘ఇందిరా మహిళా శక్తి పాలసీ’ ద్వారా స్వయం సహాయక బృందాలకు (SHG) ఆర్థిక, సాంకేతిక మరియు మార్కెటింగ్ మద్దతు అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఇప్పటికే బ్యాంకు లింకేజీ ద్వారా రూ.50 వేల కోట్లు మహిళా గ్రూపులకు అందించారు.సక్రమంగా రుణాలు చెల్లించే వారి తరఫున ప్రభుత్వమే వడ్డీ కడుతోందని, ఇప్పటివరకు రూ.1,300 కోట్లు సున్నా వడ్డీ కింద బ్యాంకులకు చెల్లించామని పేర్కొన్నారు. ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల రుణాల పంపిణీ లక్ష్యం కాగా, ప్రస్తుతం ఉన్న వేగాన్ని చూస్తుంటే అది రూ.1.40 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచ స్థాయికి తెలంగాణ పర్యాటకం
రాష్ట్రంలో అద్భుతమైన వారసత్వ కట్టడాలు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు, ఆధ్యాత్మిక కేంద్రాలు సమ్మక్క-సారలమ్మ వంటివి ఉన్నా గతంలో సరైన పాలసీ లేదని సీఎం విమర్శించారు. అంతర్జాతీయ పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించేందుకు పర్యాటక పాలసీ 2025-2030ని రూపొందించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
క్రీడా విధానం & యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ
యువతను డ్రగ్స్, పబ్బుల సంస్కృతి నుంచి కాపాడి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేము ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని రాష్ట్రానికి రప్పించి క్రీడలను ప్రోత్సహించాలని చూస్తుంటే, కొందరు మెక్సికో డ్రగ్ మాఫియా డాన్లను కోరుకుంటున్నారు. మీరు సన్బర్న్ పార్టీలు పెట్టిస్తే, మేము ఇళయరాజా మ్యూజిక్ కచేరీలు నిర్వహిస్తున్నాం అంటూ ప్రతిపక్షాలపై చురకలు అంటించారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) పద్ధతిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, సంజయ్ గోయెంకా, కావ్య మారన్, వీటా దాని వంటి ప్రముఖులను నియమించి ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు.