ఎచ్చెర్లపై మెగా ఫోకస్: 2029 టార్గెట్‌గా నాగబాబు ‘ఆపరేషన్ ఆకర్ష్’.. వైసీపీ ఖాళీ అవుతుందా..?

ఆ నియోజక వర్గంలో చాప కింద నీరుల జనసేన పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయట. దానికోసం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యనేతలు ఏదో ఒక వంకతో నియోజక వర్గంలో పార్టీ మీటింగలు పెడుతున్నారట మీటింగ్ అయిన కొద్ది రోజుల్లోనే జాయినింగ్స్ జరుగుతున్నాయట అది కూడా ఓ స్ట్రాటజీ మెరకు కండువాలు కప్పేస్తున్నారట. నియోజక వర్గంలో ఓటింగ్ ఎక్కువగా ఉండే సామాజిక వర్గ నేతలకే పెద్ద పీట వేస్తున్నారట. 2029 ఎన్నికల కోసం ఆ నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ నుంచి రంగంలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారంట.

 

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్‌ సీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయట. వైఎస్‌ఆర్‌సీపీలోని సీనియర్ నాయకులకు ఆపరేషన్ ఆకర్ష ద్వారా జనసేన పార్టీ లాగేస్తోందట. వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి గ్లాస్ పార్టీలోకి జంప్ అవుతున్న నాయకుల్లో ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గం నేతలే ఉన్నారట. ఇప్పటికే.. నియోజకవర్గంలోని ఎంపిటీసిలు, సర్పంచులు ఉపసర్పంచులతో పాటు మాజీలు సైతం వైఎస్‌ఆర్‌సీపీని వీడుతున్నార. పార్టీని వీడిన వారంతా హైదరాబాద్‌లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. జనసేన పార్టీలో చేరిన ప్రతి నాయకుడు తమ మండలంలో ఉన్న పంచాయతీల వారీగా తమ బలాబలాలను నాగబాబుకు తెలియజేశారట. వీరి వివరాలను ముందుగానే జనసేన ఇంచార్జీలు నాగబాబుకు అంద చేశారట. పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని ఎచ్చర్ల నియోజకవర్గంలోని ఆ సామాజిక వర్గ నాయకులు నిర్ణయించుకొని జనసేన పార్టీలోకి అడుగుపెట్టారట.

 

 

పార్టీ బలోపేతం కోసమే నాగబాబు ఎచ్చర్లను ఎమ్మెల్సీ కోటా కింద ఈ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొన్నారట. ప్రత్యేకించి ఈ ఆకర్ష ద్వారా వైఎస్ఆర్‌సీపీని ఉత్తరాంధ్రలో గట్టిగా దెబ్బ కొట్టాలని జనసేన కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎచ్చెర్లు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పొత్తులో భాగంగా బిజెపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే తమను పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తున్నారనేది స్థానిక జనసేన లీడర్ల ఆవేదన. ఇదే విషయాన్ని పలుమార్లు పవన్, నాదెండ్ల నాగబాబు దృష్టికి స్థానిక నాయకులు తీసుకువెళ్ళారట. అయితే ఈ విషయంలో జనసేన అధినాయకత్వం కొంత భిన్నంగా ఆలోచన చేస్తోందట. ఒకవైపు కూటమి పార్టీల మధ్య పొరపొచ్చాలు రాకుండా చూసుకుంటూనే మరోవైపు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిందట. దీనికోసమే కాపు అస్త్రాన్ని వాడుతుందట.

 

ఎచ్చర్ల నియోజక వర్గానికి ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు ముఖ్య లీడర్లు పర్యటించారు. క్షేత్ర స్థాయిలో కేడర్ చెప్పిన విషయాన్ని ఆకలింపు చేసుకున్న రాష్ట్ర నాయకులు 55% ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని చూస్తోందట. రాబోయే 2029 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో జెండా పాతాలని.. దీనికోసం క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో ముందుగా వైఎస్ఆర్‌సీపీలో ఉన్న సొంత సామాజిక వర్గానికి చెందిన బలమైన కాపు నేతలను జనసేనలోకి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఆకర్షిస్తున్నారు.

 

ఎచ్చర్ల నియోజక వర్గంలో సామాజిక వర్గం వారిగా ఓట్ల వివరాలు కూడా నాగబాబు తెప్పించుకున్నారట. జనసే సర్వేలో 55% కాపు సామాజిక వర్గం కాగా వెలమ 10, రెడ్డి 10, కళింగ 10% మిగతా సామాజిక వర్గం ఓట్లు 15%గా ఉన్నాయట. ఇందులో సగం ఓటు బ్యాంక్ టిడిపి కి మద్దతుగా ఉండగా తర్వాత స్థానాల్లో జనసేన ఉంది. 5% ఓటు బ్యాంకు లేని బిజెపి ఎమెల్యే తమకు కనీస గౌరవం ఇవ్వట్లేదని జనసేన నాయకుల కోపం.

 

అయితే.. ఆపరేషన్ ఆకర్ష కార్యక్రమం ద్వారా వైఎస్‌ఆర్‌ సీపీకి చెందిన నాయకులను జనసేనలోకి ఆకర్షించి 2029 నాటికి జెండా పాతాలన్నది జనసేన టార్గెట్‌. ఈ నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోని కీలక నేతలను కూడా జనసేనలోకి వీలైనంత త్వరగా చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలని నాగబాబు ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే ప్రతిపక్ష నాయకులు అందర్నీ జనసేనలోకి చేర్చుకునేలా ప్లాన్ చేస్తున్నారట నాగబాబు. అయితే మండల నాయకులు వైఎస్ఆర్‌సీపీని వీడుతున్న ఈ నియోజకర్గ నాయకులు ఏమీ అడ్డుచెప్పట్లేదట. పైగా జనసేన చేస్తున్న చర్యలన్నీ గమనిస్తున్నారట. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది చూద్దాం ఎంతమంది వెళ్ళినా పర్వాలేదు అన్న రీతిలో ఉన్నారట. పార్టీ కేడర్ మాత్రం తాడేపల్లికి ఇక్కడ జరుగుతున్న బాగోతాన్ని ఎప్పటికప్పుడు తెలుపుతున్నారట.

 

ఎచ్చెర్లలో జనసేన బలోపేతం కోసం వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి నేతలను టార్గెట్ చేస్తూ మంతనాలు సాగిస్తున్నా నియోజకవర్గ ఇంచార్జి కామ్‌గా ఉండటంపై కేడర్ రగిలిపోతున్నారట. . టిడిపీలో ఉన్నవారు వస్తామన్నా ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాం లే అని దాటవేస్తున్నారనే టాక్ నడుస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి జనసేనలోకి చేరికలతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో పొలిటికల్ సిట్యువేషన్ చాలా వేగంగా మారిపోతోందట.

 

త్వరలో ఎచ్చెర్లలో జనసేన జెండా ఎగరేస్తుందంటూ సంకేతాలు ఇస్తున్నారట ఆ పార్టీ నేతలు. ట్విస్ట్ ఏమిటి అంటే.. వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా జరిగేది అంతా తమ మంచికే అని కామెంట్స్ చేస్తున్నారట. వెళ్లేవాళ్లు వెళ్లనీ.. ఉన్నవాళ్లకే పదవులు దక్కుతాయని అంటున్నారట. చూడాలి మరి.. నాగబాబు ప్లాన్‌తో వైఎస్ఆర్‌సీపీకి ఏం మేలు జరుగుతుందనేది.