ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై ఐదు రోజుల కాల్పుల విరమణ చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడం, మిత్రదేశాల రక్షణ వంటి 5 ప్రధాన లక్ష్యాలను అమెరికా నిర్దేశించుకుందని, అవి పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. క్రూడాయిల్ 96 డాలర్లకు చేరింది. ఇంకోవైపు వచ్చే ఐదు రోజుల్లో జరిగే చర్చలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, దానికి ఇరాన్ ప్రతిదాడులు ఇంతవరకు జరిగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ యుద్ధం కూడా రష్యా-ఉక్రెయిన్ వార్‌లా మారే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ వ్యూహకర్తలు ట్రంప్‌ను హెచ్చరించారు. ఇరాన్ యుద్ధంతో ఇరు పక్షాలతో పాటు ప్రపంచ దేశాలూ భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నాయి. తొలిరోజు దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ, ఆ దేశ ముఖ్య సైనికాధికారులు చనిపోవడంతో భారీ విజయం సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. సైనికపరమైన ఈ విజయం…రాజకీయ, వ్యూహాత్మక గెలుపునకు దారితీయకపోగా దీర్ఘకాల యుద్ధంలో ఆ దేశాలు కూరుకుపోయేలా చేస్తోందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ట్రంప్ తక్షణ లక్ష్యం ఇరాన్లో ప్రభుత్వ మార్పు. తొలిరోజు విజయంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సమయం పట్టదని అంచనా వేశారు. కానీ, యుద్ధం ప్రారంభమై మూడు వారాలు దాటినా.. ట్రంప్, నెతన్యాహు ఆశించినట్లు టెహ్రాన్‌లో మత గురువుల పాలన ముగిసిపోయే సూచనలు కనిపించటంలేదు. పైగా ఇరాన్ పన్నిన దీర్ఘకాలిక యుద్ధం ఉచ్చులో అమెరికా చిక్కుకున్నట్లు అనిపిస్తోంది. యుద్ధ పరిధిని భౌగోళికంగా విస్తరింపజేయాలన్నది టెహ్రాన్ వ్యూహం. గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలున్న దేశాలపై దాడులు దీనిలో భాగమే. అమెరికా యుద్ధం ఖర్చులను భారీగా పెంచడం, చమురు సరఫరాలను అడ్డుకోవడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచడం ఇరాన్ నేతల ఉద్దేశమన్న సంగతి ట్రంప్ బుర్రకు అర్థమయ్యేలా వాషింగ్టన్ విధాన రూపకర్తలు గగ్గోలు పెట్టినా వినలేదు. చివరికి ఈ వ్యవహారంలో అన్ని దేశాలు ట్రంప్‌పై ఒత్తిడి తేవటంతో దారికి దిగిరాక తప్పలేదు.
ఇరాన్లో అమెరికా వందశాతం విజయం సాధించిందని ట్రంప్ చెప్పుకోవటమే కానీ..వెనుజులాలో వ్యవహరించే పరిస్థితి ఇరాన్లో ఏర్పడలేదు. పైగా రెండో దశ యుద్ధంలోకి అమెరికా, ఇజ్రాయిల్‌ను ఇరాన్ లాగింది. ఇప్పుడు మూడో దశ ఉచ్చులో అమెరికా ప్రవేశించింది. ఇరాన్లో పాలనా వ్యవస్థను సరిగ్గా అంచనా వేయకుండా యుద్ధరంగంలోకి దిగిన అమెరికా దానికి తగిన మూల్యం చెల్లిస్తోంది. వెనిజువెలా మాదిరిగా ఇరాన్లో కుదరదని ట్రంప్‌కు తెలిసేసరికే చేయిదాటిపోయింది. దీంతో ఈ యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకోవాలని ట్రంప్ నిర్ణయించుకున్నాడు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే.. యుద్ధం ఆగే స్థితి ఉండదని.. చాలా మంది విశ్లేషకులు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. ఆమాటకొస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని పుతిన్ ఏడాదిగా మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఏ ప్రయత్నమూ సఫలీకృతం కావడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్‌లు కొట్టిన దెబ్బతో ఇరాన్ నాయకత్వం ప్రపంచ దేశాలన్నింటినీ ఈ సంక్షోభంలోకి లాగే యత్నం చేసింది. ట్రంప్‌పై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అనుసరించడం ప్రారంభించింది.దాని ఫలితమే ఇప్పుడు సంధి కోసం ట్రంప్ ప్రేలాపనలు.
అమెరికా, గల్ఫ్ దేశాల మధ్య దూరాన్ని పెంచడంలో ఇరాన్ విజయవంతం అయింది. టెహ్రాన్ వ్యూహకర్తల ప్లాన్ సక్సెస్ అయింది. ఇరాన్‌పై దాడులు చేసే కొద్దీ ఇరాన్ చుట్టుపక్కల దేశాలను కూడా అంతే స్థాయిలో దెబ్బ కొడుతుంది. అమెరికాకు ఇరాన్ విజయాన్ని వడ్డించిన విస్తరిలా అందివ్వాలని అనుకోవట్లేదు. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టినప్పటికీ.. ప్రస్తుతం యుద్ధం పూర్తిగా తమ వ్యూహం ప్రకారమే సాగుతుందని ఇరాన్ స్పష్టమైన అంచనాతో ఉంది. అందుకే అమెరికాతో చర్చలకు యత్నించే ప్రస్తావనే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ చర్చలను కోరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ నేతలు ఖండిస్తున్నారు. అవసరమైతే యుద్ధాన్ని కొనసాగించే సత్తా ఇరాన్‌కు ఉందని స్పష్టం చేశారు.
గతంలో తాము రెండుసార్లు అమెరికాతో చర్చలు జరిపినా, ప్రతిగా ఇరాన్‌పై దాడులే చేసిందని ఇరాన్ నేతలు చెప్పారు. ఈసారి కూడా చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే, ఇరాన్‌పై అమెరికా దాడులు చేసిందన్నారు. ఈ చేదు అనుభవాల తరుణంలో ఇక అమెరికాతో చర్చలను కోరుకునేది లేదన్నారు. ప్రస్తుత సైనిక ఘర్షణ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం హర్మూజ్ జలసంధి. అది వ్యూహాత్మకంగా ముఖ్యమైన సముద్ర రవాణా మార్గం. దీని మీదుగా రోజూ గ్యాస్, ముడి చమురు సప్లై జరుగుతుంటుంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ మీదుగా ఇంధన సప్లైలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం పోరాడటం తప్ప, ఇరాన్‌కు మరో మార్గం లేదు. ఈ యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై బలవంతంగా రుద్దాయి. మా ఆత్మగౌరవం, స్వాతంత్య్రం, దేశం కోసం రక్తాన్ని చిందించడానికి మేం రెడీ అని ఇరాన్ అంటోంది.
ఇంతవరకూ ఇరాన్లో శుద్ధిచేసిన యురేనియం ఆనవాళ్లు అమెరికా పసిగట్టలేకపోయింది. అణు కేంద్రాలపై దాడులు చేసి యుద్ధం ఆపేయాలని ఓ దశలో అనుకున్నా.. అవి ఎక్కడ ఉన్నాయో తెలియక.. అమెరికా అయోమయంలో పడిపోయింది. మొత్తం మీద ఇరాన్ యుద్ధం అమెరికాకు రోజురోజుకీ భయం పెంచుతోంది. మొదట్లో ఇరాన్‌ను లొంగదీస్తామనుకున్న అమెరికా.. తర్వాత దీర్ఘకాలయుద్ధానికీ సిద్ధపడింది. కానీ ప్రస్తుతం మాత్రం ఇంకా యుద్ధం ఊబిలో దిగబడేకంటే.. వీలైనంత త్వరగా ముగించి వెనుదిరగటం మంచిదనే ఆలోచన ఫలితమే ఇప్పుడు సీజ్ ఫైర్ ట్రంప్ నోట వెంట వచ్చింది. చూడాలి.. మరి.. త్వరలో ఇరాన్ చేయబోయే డిమాండ్లకు అమెరికా అధ్యక్షుడు లొంగుతాడో.. లేక యుద్ధానికి సిద్ధమో త్వరలో తేలిపోనుంది. ప్రస్తుతానికి అయితే అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లే అని పరిశీలకులు చెబుతున్నారు.