సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబును ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయనను పౌరసరఫరాలశాఖ కమిషనర్గా నియమించింది. పాఠశాల విద్య డైరెక్టర్గా ఉన్న వి.విజయరామరాజును సీఆర్డీఏ కమిషనర్గా నియమించింది. కేవలం కన్నబాబుతో పాటు మరికొందరు అధికారులను బదిలీ చేసిన.. అందరినీ ఆశ్చర్యపరిచేది కన్నబాబు బదిలీనే. కన్నబాబు సీఆర్డీఏ కమిషనర్గా 2025 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. 14 నెలల్లోనే ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. కన్నబాబు కీలకమైన సమయంలో సీఆర్డీఏ కమిషనర్గా వ్యవహరించారు. రాజధానికి నిధుల సమీకరణ, నిర్మాణ పనుల్ని పూర్తిస్థాయిలో పట్టాలెక్కించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఏ రోజు ఎంత పని జరిగిందో మదింపు చేసేందుకు ప్రత్యేక ప్లాట్ఫాం రూపకల్పన, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు పలు సంస్కరణలు తీసుకొచ్చారు.
అంతేకాదు.. సీఆర్డీఏ ఇటీవలే గోల్డెన్ అవార్డుని గెలుచుకుంది. ఆ అవార్డుని అందుకున్న మరుసటి రోజే ఆ కన్నబాబు అమరావతిలో కెనాల్ స్ట్రక్చర్స్ పైన అధ్యయనం చేశారు. వీటిపైన అంటే నిన్న సాయంత్రం వరకు ఆయన కమిషనర్ గా పర్యటనలు జరిపారు. ఆ అమరావతికి సంబంధించి మూడు కీలకమైనటువంటి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుంది. ఆ రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి కాలువలు గ్రావిటీ కెనాల్స్ ఒకవైపు గ్రావిటీ కెనాల్ మరోవైపు కృష్ణాయపాలెం రిజర్వాయర్ కొండవీటివాగు పాలవాగుకు సంబంధించినటువంటి రిజర్వాయర్ వీటి మూడిటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి కాలువలు గతంలో వర్షం పడినప్పుడు లోతటి ప్రాంతాల వైపు వెళ్ళినటువంటి నీటి తీరువ వీటన్నిటిని పరిశీలించేటువంటి క్రమంలోనే కమిషనర్ కన్నబాబు తన చివరి పర్యటనని ఏపీ సిఆర్డిఏ కమిషనర్ గా జరిపారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన బదిలీ జీఓ వచ్చింది.
ముఖ్యంగా అమరావతిలోకి ఎంటర్ అయ్యేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ ఏరియాలో కీలకమైనటువంటి కొండవీటి వాగు సమీపంలో కృష్ణాయపాలెం రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్నాయి వాటికి వెళ్లేటువంటి కాలువలని బలోపేతం చేయడం భవిష్యత్తులో వాటిని అందమైనటువంటి రివర్ బండ్స్ గా తీర్చిదిద్దాలని సీఆర్డీఏ టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఏపీ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఈ ప్రాంతాలను పర్యటించారు. గ్రావిటేషనల్ కెనాల్ నిర్మాణం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతోంది. సీడ్ యాక్సెస్ రోడ్డును కలుపుతూ కొండవీటి వాగు మీదుగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. ఈ ఏరియా మొత్తం కూడా కన్నబాబు పర్యటించారు. పనుల పురోగతిని సమీక్షించారు. కానీ సాయంత్రానికి ఎవరు ఊహించిన విధంగా బదిలీ జీఓ వచ్చింది. సో ముందుగా అమరావతి నిర్మాణంలో లేఔట్లు గాని రోడ్ల స్ట్రక్చర్స్ గాని కంప్లీట్ కావాలంటే ఈ కెనాల్ స్ట్రక్చర్స్ పూర్తి అవ్వాలి.
వాటి పై నుంచి కాలువల నిర్మాణం కావచ్చు లేఔట్ల నిర్మాణం ప్రణాళికను కూడా ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు రాకుండా చూడాలి. తూర్పు కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అమరావతిలో కూడా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డ తర్వాత లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటని అధ్యయనం చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశంగా కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే కన్నబాబు బదిలీకి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది. అయితే కన్నబాబు బదిలీపై పొలిటికల్ సర్కిల్స్లోను, ఇటు బ్యూరోక్రసీలోనూ ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఎలాంటి వివాదాలు లేని కన్నబాబును ఇంత అనూహ్యంగా బదిలీ చేయటం వెనక ఏం జరిగిందని చర్చ స్టార్ట్ అయింది. అయితే, దీనిపై కొందరు ఇదంతా కన్నబాబు అతి మంచితనమే కారణమంటున్నారట.
ఏపి సీఆర్డీఏకి అవార్డు తీసుకొని వచ్చినటువంటి కొద్ది గంటల్లోనే ఆయన ఆ ప్రాంతంలో పర్యటించారు. తన పనితీరు ద్వారానే కాదు.. చేతల ద్వారానూ ఆయన తన నిబద్ధతను నిలబెట్టుకున్నారు. అంతెందుకు చాలా నెలల నుంచి సాగుతున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఈ నెలాఖరికి అంటే మరొ 20 రోజుల్లో పూర్తి అయ్యే ఛాన్స్ ఉందంటే దానికి కన్నబాబు వెంటపడటమే కారణమని నిపుణులు కూడా చెబుతున్నారు.
కాలువల స్ట్రక్చర్స్ కి సంబంధించినటువంటి పనులు కూడా వీలైనంత వేగవంతంగా పూర్తి చేయాలి దాని తర్వాత కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి కాబట్టి వాటిని ప్రణాళికాబద్ధంగా అనుకున్నటువంటి డెడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ చేయాలని కన్నబాబు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అదే సమయంలో రైతులు, కాంట్రాక్టర్ల నుంచి కూడా కన్నబాబు కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కన్నబాబు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో రాజధాని గ్రామాల రైతులు చాలా సమస్యల్ని సీఆర్డీఏ దృష్టికి తెచ్చారు. వాటిని సానుకూలంగా పరిష్కరించడంలో కన్నబాబు విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రభుత్వ పెద్దల్లో ఉంది. తర్వాత కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలకశాఖ మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లతో ప్రభుత్వం కమిటీని నియమించింది. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఆ కమిటీ చొరవ తీసుకోవడంతో రైతుల్లో అసంతృప్తి చాలావరకు తగ్గింది. మరోపక్క కన్నబాబు తయారుచేయించిన సాఫ్ట్వేర్ వల్ల… కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందన్న అభిప్రాయమూ ఉంది. ఈ విషయంపై కాంట్రాక్టర్లు ఏకమై సీఎంఓకు ఫిర్యాదు చేశారట.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రుల వద్ద, కీలక స్థానాల్లో పనిచేసిన కొందరు అధికారులు… తర్వాత సీఆర్డీఏలో చేరారు. వారిని మార్చాలని కన్నబాబుకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చినా ఆయన చర్యలు తీసుకోలేదని ఇవన్నీ మంత్రి నారాయణ, లోకేష్ దృష్టికి వెళ్లాయట. దీంతో, ఈ అంశలన్నీ కలగలిపి… కన్నబాబు ఆకస్మిక బదిలీకి కారణాలని అధికారవర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారట.