తిరుపతి నగర పాలక మండలి పదవీ కాలం పూర్తి అయింది. దీంతో తిరుపతి నగరం ఎన్నికల మూడులోకి వెళ్తోంది. ఒకవైపు పాలన.. ప్రత్యేక అధికారి చేతులోకి వెళ్లగా.. మరోవైపు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పద్దును పెడుతున్నాయి. సడలిన పట్టును మళ్ళీ సాధించాలని వైఎస్ఆర్సీపీ.. క్లీన్ స్వీప్ చేయాలని పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యేకించి కూటమి పార్టీలు .. వైఎస్ఆర్సీపీ మళ్లీ మేయర్ పీఠం మీద పాగా వేయకుం డా ప్లాన్ వేస్తున్నాయి. అసలు తిరుపతి మున్సిపల్ మీద పట్టు సాధించటంతో పాటు.. భూమన కుటుంబానికి చెక్ పెట్టాలన్నది టీడీపీ వ్యూహంలా కనిపిస్తోంది.
ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మీద కూటమి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈసారి ఎన్నికలు కూటమి వర్సెస్ భూమన ఫ్యామిలీ మధ్యే తీవ్ర పోటీగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అంటే భూమన అన్నట్లు టీడీపీ నాయకులు భావించటమే దీనికి కారణం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మీద అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. తిరుపతి ఆధ్యాత్మిక పర్యటక కేంద్రంగా ఉండటంతో పాటు ఆదాయం పరంగా కూడా కీలక నగరం. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. అధికార పార్టీలు, ప్రతిపక్షాలు రెండు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ గ్రౌండ్ స్థాయిలో చురుకుగా పని చేస్తున్నాయి. అధికారిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోయినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం స్పష్టంగా ఎన్నికల మూడ్ కనిపిస్తోందని పొలిటికల్ క్రిటిక్స్ అంటున్నారు.
ముఖ్యంగా తిరుపతి స్థానిక సమస్యలపై చర్చలు పెరిగాయి. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ట్రాఫిక్ సమస్యలు ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. పార్టీలు గెలిచే అవకాశం ఉన్న వారిని ఎంపిక చేయడానికి సర్వేలతో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో 50 డివిజన్ల సీట్ల కోసం ఈసారి తీవ్ర పోటీ కనిపిస్తోంది. గతంలో 48 సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్క డివిజన్ లోనే టీడిపి జెండా ఎగురవేసింది. అయితే ఇప్పుడు కూటమి రాజకీయాలు స్థానిక సమస్యలు అభివృద్ధి హామీలు ఖచ్చితంగా ఓటర్లను
ప్రభావితం చేయనున్నాయి.
ఈసారి ఎన్నికలు వన్ సైడెడ్ కాకుండా క్లోజ్ ఫైట్ గా ఉండే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేడర్ బలంతో ముందుగా ఉన్న కూటమి పార్టీల రాజకీయ శక్తి మళ్ళీ సమీకరణాన్ని మార్చే అవకాశం ఉంది. తిరుపతి కార్పొరేషన్ పీఠాన్ని నిలబెట్టుకోవడం భూమాన ఫ్యామిలీకి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఐదేళ్లలో తిరుపతిలో చేసిన మాస్టర్ ప్లాన్, రోడ్లు, స్మార్ట్ సిటీ పనులు, సుందరీకరణను ప్రధాన ప్రచారస్త్రాలుగా మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. అదే సమయంలో తమపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని రాజకీయంగా వేధిస్తున్నారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని భూమాన కుటుంబం ప్లాన్‌గా కూటమి నేతలు అనుమానిస్తున్నారు.
ముఖ్యంగా ముస్లిం మైనారిటీ, ఎస్సీ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో కూటమి నేతలు పడ్డారు. మరోవైపు కూటమి పార్టీల దశాబ్ద కాలం తర్వాత కార్పొరేషన్ పై జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. గత పాలనలో జరిగిన భూకబ్జాలు టిడిఆర్ బాండ్లు టిటిడి నిధుల దుర్వినియోగం వంటి అవినీతి అక్రమాలని ఎండగట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన కేడర్‌ను టీడిపి ఇంచార్జ్‌ను సమన్వయంతో వైఎస్ఆర్సీపీ కోటలను బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు స్థానిక సమస్యల పరిష్కారమే తమకు శ్రీరామ రక్ష అని కూటమి నేతలు భావిస్తున్నారు. అదీగాక అధికారంలో ఉండటం తమకు ప్లస్ పాయింట్‌గా కూటమి నేతలు భావిస్తున్నారు. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికార పాలన కొనసాగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో గ్రౌండ్ లెవెల్లో పట్టు పెంచుకోవాలని పార్టీలు లెక్కలేస్తున్నాయి.
కార్పొరేటర్ల పదవి కాలం ముగిసిన ప్రజలతో టచ్ లో ఉండాలని అభినయ రెడ్డి తన అనుచరులకు ఆదేశించారని తెలుస్తోంది. అటు కూటమి నేతలు కూడా ఇంటింటికీ ప్రభుత్వం చేసిన మంచిని పాంప్లేట్ల రూపంలో పంచాలని ప్లాన్ చేస్తోంది. అదీగాక అధికార యంత్రాంగం ద్వారా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయించి ప్రజల నుంచి క్రెడిట్ కొట్టేయాలని భావిస్తున్నారు. ఈ సెమీఫైనల్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తే వారికే వచ్చే అసెంబ్లీ రేసులో తిరుగుండదని పార్టీ నేతలు భావిస్తున్నారట.
గతంలో కార్పొరేటర్లుగా ఉన్న వారిలో నమ్మకమైన వారికే మళ్ళీ టికెట్లు ఇవ్వాలని వ్యతిరేకత ఉన్నచోట కొత్తవారిని దింపాలని భూమన భావిస్తున్నారట. అయితే కూటమి నేతల్లో ఆశావహులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి పంచాయతీ సక్రమంగా జరిగితే మున్సిపల్ ఎన్నికల సీట్ల సర్దుబాటులో 50 డివిజన్లకు గాను జనసేన 20 టిడిపి 25 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. అదేవిధంగా బిజెపీకి కూడా మూడు నుంచి నాలుగు సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తాజా మాజీ కార్పొరేటర్లు జంపింగ్ కు అవకాశం ఉందంటున్నారు. కొంతమంది మాజీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు టీడిపి కానీ జనసేన తీర్థం పుచ్చుకుంటారనే టాక్ బలంగా వినిపిస్తోందట.
మరోవైపు మేయర్ పీఠం రిజర్వేషన్ ఈసారి మారే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుందట. దీంతో ఆయా సామాజిక వర్గాల నేతలు పైరవీలు మొదలు పెట్టారు. మొత్తం మీద తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలను అన్ని పార్టీలు సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. మొత్తానికి అధికారిక ప్రకటనకు ముందే తిరుపతిలో ఎన్నికల వేడి సమ్మర్‌ను మించిపోతోంది. అయితే.. కూటమి టార్గెట్ మాత్రం భూమన ఫ్యామిలీకి చెక్ పెట్టడమే అని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భావిస్తున్నారట.