Kyathampally : కోట్లు ఆశ చూపినా.. కిడ్నాప్ ప్రయత్నం చేసినా లొంగని కౌన్సిలర్లు

క్యాతంపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లను ప్రలోభపెట్టి, అడ్డదారిలో పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రజా తీర్పు అపహాస్యం

మొత్తం 22 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్-సీపీఐ కూటమి 14 స్థానాల్లో ఘనవిజయం సాధించిందని, స్పష్టమైన మెజారిటీ ఉన్న తమను కాదని, కేవలం 7 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని నేతలు విమర్శించారు. మా కౌన్సిలర్లను లొంగదీసుకోవడానికి కోట్లాది రూపాయలు, బ్లాక్ చెక్కులు ఆఫర్ చేశారని, చివరకు కిడ్నాప్ ప్రయత్నాలు కూడా చేశారని ఆరోపించారు.

50 రోజుల సుదీర్ఘ నిరీక్షణ

ప్రజలు ఇచ్చిన తీర్పును కాపాడటం కోసం మా కౌన్సిలర్లు 50 రోజులుగా తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి, ధైర్యంగా పోరాడుతున్నారని నేతలు ప్రశంసించారు. “మేము చేసుకున్న ఒప్పందం ప్రకారం బీఆర్ఎస్ నుంచి చైర్మన్, సీపీఐ నుంచి వైస్ చైర్మన్ అభ్యర్థులు ఖాయం. దీనికి మా 14 మంది కౌన్సిలర్లు కట్టుబడి ఉన్నారు” అని స్పష్టం చేశారు.

అధికారుల తీరుపై విమర్శలు

జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా, ఏదో ప్రైవేట్ సంస్థ (విశాఖ ఇండస్ట్రీస్) ఉద్యోగుల్లా ప్రవర్తించవద్దు. ప్రజా తీర్పును గౌరవించి ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలి” అని హెచ్చరించారు.

అండగా నిలిచిన కేసీఆర్

పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనీయర్ నేతలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నారదాసు లక్ష్మణ్ రావు తదితరులు క్యాతంపల్లిలో ఉండి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కానాపూర్ మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను అప్పగించారని తెలిపారు.