హైదరాబాద్‌ను మళ్ళీ ‘నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్’గా మారుద్దాం: సీఎం రేవంత్ రెడ్డి

క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరూ పబ్ కల్చర్‌కు స్వస్తి చెప్పి క్రీడా మైదానాల్లోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగిన 74వ బి.ఎన్. మల్లిక్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

యువత పెడదారి పట్టకుండా ఉండాలంటే క్రీడలే సరైన మార్గమని సీఎం స్పష్టం చేశారు. “యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి. పబ్‌ల చుట్టూ తిరగడం మానేసి, ఆటల మీద దృష్టి సారించాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ఒకప్పుడు ఉన్న ‘నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్’ అనే గుర్తింపును మళ్ళీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో కొత్త శకం
తెలంగాణ నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తోందని సీఎం తెలిపారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా మన క్రీడాకారులకు ఈ యూనివర్సిటీలో ప్రపంచస్థాయి శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన జట్లను సీఎం అభినందించారు.

పురుషుల విభాగం: విజేతగా నిలిచిన CISF జట్టుకు ట్రోఫీ అందజేశారు.

మహిళల విభాగం: టైటిల్ సాధించిన అస్సాం రైఫిల్స్ జట్టును ప్రత్యేకంగా ప్రశంసించారు.

తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి  భారీ భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి కీర్తి తెచ్చే క్రీడాకారులకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగాలు ఇస్తామని కీలక ప్రకటన చేశారు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.