ఏపీలో ‘మావిగన్’ చిచ్చు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రణరంగాన్ని సృష్టించింది. ఒక విశ్లేషణ.. ఒక కథనం.. ఒక పార్టీని ఎంతలా ఉడికించింది అంటే, ఏకంగా సరిహద్దులు దాటి వచ్చి మీడియా ఆఫీసుపై దాడి చేసేంతలా! హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం సాక్షిగా మంగళవారం హైడ్రామా నడిచింది. మాజీ మంత్రులు, వైఎస్‌ఆర్‌సీపీ అగ్రనేతలు రోడ్డుపై బైఠాయించారు. అసలు ఆర్కే రాసిన ఆ కథనంలో ఏముంది? వైఎస్‌ఆర్‌సీపీ ఎందుకు ఇంతలా ఉలిక్కిపడింది? ప్రభుత్వం ఏమంటోంది?
హైదరాబాద్ ఫిలింనగర్.. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా వైఎస్‌ఆర్‌సీపీ జెండాలతో నిండిపోయింది. పక్కా ప్లాన్.. ముందస్తు వ్యూహం! ఆంధ్ర నుంచి కారుల్లో తరలివచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఏబీఎన్ ఆఫీసును ముట్టడించాయి. గేట్లు తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ జరిగింది నిరసన కాదు.. మీడియా సంస్థపై దాడి యత్నం అని ఏబీఎన్ వర్గాలు చెబుతున్నాయి. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’లో వచ్చిన విశ్లేషణ జగన్ పార్టీకి కంటగింపుగా మారిందని ఏబీఎన్ జర్నలిస్టులు అంటున్నారు.
హైదరాబాద్‌లోని ఫిలింనగర్ ఒక్కసారిగా రణరంగమైంది! ఏపీ రాజకీయ సెగలు తెలంగాణ సరిహద్దులు దాటి భాగ్యనగర వీధుల్లోకి చేరాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం లక్ష్యంగా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి. ఏకంగా మాజీ మంత్రులు, సీనియర్ నేతలు రోడ్డుపైకి వచ్చి మీడియా సంస్థపైకి వెళ్లటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.
అసలు ఈ గొడవకు కారణమేంటి? “మావిగన్” అనే పదం వెనుక ఉన్న అసలు కథేంటి? దానిపై మీడియా అధినేత చేసిన కామెంట్స్‌పై వైఎస్ఆర్‌సీపీ సీరియస్ అవ్వటం వెనకున్న కారణాలేంటి? ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అసలు గొడవ ఎక్కడ మొదలైంది? జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ రాజధాని కాన్సెప్ట్‌పై ఆర్కే తన విశ్లేషణలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతల విధేయతను ప్రశ్నించారు. అయితే దీనికి ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాల్సింది పోయి.. దాడులకు దిగడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి ‘మావిగన్’ పేరుతో జగన్ చేసిన ప్రతిపాదనపై ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన ‘వీకెండ్ కామెంట్’లో తీవ్రమైన విశ్లేషణ చేశారు. అయితే, ఆ విశ్లేషణలో వాడిన కొన్ని పదాలు, వైఎస్ఆర్‌సీపీ నేతల వైఖరిని ఎండగట్టిన తీరు ఆ పార్టీ వర్గాల్లో, నేతల్లో ఆగ్రహానికి కారణమైంది. మా కుటుంబ సభ్యులపై, భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?” అంటూ అంబటి రాంబాబు లాంటి నేతలు ఏబీఎన్ ఎమ్‌డీ రాధాకృష్ణపై విరుచుకుపడుతున్నారు.
దీనిపై వైఎస్ఆర్‌సీపీ నేతలు వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టిన రాధాకృష్ణపై విమర్శలు చేశారు. చోటా మోటా నేతలపై రాధాకృష్ణను ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. మరోవైపు “మావిగన్” అనే అసంబద్ధ ప్రతిపాదన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ దాడుల డ్రామా అని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఆరోపిస్తున్నారు. ఏబీఎన్ మీద దాడిని కూటమి నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
ఈ గొడవలో అంబటి రాంబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తిరుమల లడ్డూ వివాదం సమయంలో చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పానని, కానీ మీడియా తన తప్పును ఒప్పుకోవడం లేదని ఆయన వాదిస్తున్నారు. రాజకీయంగా విమర్శించండి.. కానీ వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకు లాగితే ఊరుకోమని వైఎస్ఆర్‌సీపీ నేతలు హెచ్చరిక చేస్తున్నారు. ఒక మీడియా సంస్థ ఆఫీసు మీదకు వందలాది మందిని పంపి, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన సంస్కారం అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారని, ఇప్పుడు మీడియాపై పడ్డారని మండిపడ్డారు. మరోవైపు, ఐకేయూ, ఏపీయూడబ్ల్యూజే వంటి సంఘాలు ఈ చర్యను నాలుగో ప్రజాస్వామ్యంపై గొడ్డలి పెట్టుగా అభివర్ణించాయి. జగన్ స్వయంగా మీడియా సంస్థ నడుపుతూ.. మరో సంస్థపై దాడులను ఉసిగొల్పడం దారుణమని సోమసుందర్ వంటి సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. ఆర్కే ఫ్యాక్షన్ బెదిరింపులకు లొంగే వ్యక్తి కాదు.. ఈ దౌర్జన్యాలు ఇక సాగవని నారా లోకేశ్ సంఘీభావం తెలిపారు
అయితే వైఎస్‌ఆర్‌సీపీ వాదన మరోలా ఉంది. “మేము దాడులు చేయలేదు, మా ఆవేదనను వ్యక్తం చేశాం” అంటున్నారు వైస్ఆర్‌సీపీ నేతలు. గతంలో చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పానని, కానీ మీడియా తన కుటుంబ సభ్యులపై అవాకులు చవాకులు రాస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. “మావిగన్” అంశం నుంచి దృష్టి మళ్లించడానికి తాము ప్రయత్నిస్తున్నామన్న వార్తలను వారు కొట్టిపారేస్తున్నారు. తమ నాయకుడిని, తమ కుటుంబాలను విమర్శిస్తే సహించేది లేదని వైఎస్ఆర్‌సీపీ తేల్చి చెబుతున్నారు.
ఆర్కే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లో చంద్రబాబును ఇంద్రుడు చంద్రుడు అని రాసుకోవచ్చు. దానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కానీ వైఎస్ఆర్‌సీపీ అగ్ర నాయకత్వాన్ని కించపరుస్తూ నాయకుల్ని బ్రోకర్లు అనే అర్థం వచ్చేలా రాయటం పత్రికా స్వేచ్ఛ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. మేం వ్యక్తిగతంగా ప్రశ్నిస్తే రాధాకృష్ణ పరిస్థితేంటని అంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ నాయకుల భార్యలను సోదరీమణులుగా భావించి పెళ్లిళ్లు చేస్తారా అంటున్నారు. మరి, ఆ వయస్సులో ఉన్న వ్యక్తి చేస్తున్న దానిపై ఏమనాలని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
మరోవైపు పౌర సమాజం నుంచే కాదు.. పొలిటికల్ క్రిటిక్స్ కూడా రాజకీయ విమర్శలు శృతిమించకూడదని అంటున్నారు. అలాగని మీడియా స్వేచ్ఛను భౌతిక దాడులతో అణచివేయలేరు. “మావిగన్” చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ క్రీడ ఎటు దారితీస్తోందని నేతలు టెన్షన్ పడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.
మీడియా అంటే సమాజానికి అద్దం పట్టేది. ఆ అద్దంలో కనిపించే రూపం నచ్చలేదని అద్దాన్ని పగలగొట్టాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఒకవేళ విశ్లేషణ తప్పు అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, లేదా అంతకంటే బలమైన వాదనతో కౌంటర్ ఇవ్వొచ్చు. కానీ ఇలా ఆఫీసుల మీదకు వందలాది మందిని పంపి భయబ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన రాజకీయం? ఈ ఘటన ఇప్పటితో ముగిసినట్లు కనిపించినా మున్ముందు ఇది తీవ్రమైన చర్యలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.