Medchal: మల్కాజ్‌గిరిలో ‘మల్లారెడ్డి’ మార్క్ ప్లాన్: కమలంతో కోడలు.. కారులో మామ!

తెలంగాణ రాజకీయాల్లో ‘పాలమ్మినా.. పూలమ్మినా..’ అంటూ తనదైన స్టైల్లో దూసుకుపోయే మల్లారెడ్డి, ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని తన కోడలు ప్రీతిరెడ్డితో కలిసి మల్లారెడ్డి కలవడం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఆయన వర్గం చెబుతున్నా.. లోపల జరుగుతున్న వ్యవహారం వేరే ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

గత కొంతకాలంగా బిఆర్ఎస్ పార్టీలో మల్లారెడ్డి యాక్టివ్‌గా కనిపించడం లేదనే టాక్‌ చక్కర్లు కోడుతోంది.మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి ఆయన తన రాజకీయ వారసురాలిగా కోడలు ప్రీతిరెడ్డిని బరిలోకి దించేందుకు రంగం సిద్దం చేశారు. దీంట్లో భాగంగానే కొద్దిరోజులుగా మల్లారెడ్డి స్టైల్లో కమర్షియల్‌ లుక్‌తో కొడలును ప్రమోట్‌ చేస్తున్నారు. గతంలోనే ఆమె ‘నాకు ఎంపీ కావాలని ఉంది’ అని మనసులో మాట బయటపెట్టిన విషయం తెలిసిందే.ఇటీవలే బిజెపి అగ్రనేత బండి సంజయ్‌ను కూడా కలవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది.

 

బాబు ప్లానేనా..? 

కానీ తెరవెనుక మల్లారెడ్డికి రాజకీయ అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు సూచన మేరకే బీజేపీ గూటికి మల్లారెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కేడర్‌ ఉన్నా నాయకులు లేరు..మరోవైపు బీఆర్‌ఎస్‌లో ఉన్న టిడిపి మాజీ నేతలు కారులో ఉండటానికి ఇష్టపడటం లేదట. అందుకు బాబు ఎంట్రీ ఇచ్చి కమలం పార్టీకి ఇలా మార్గం చూపిస్తున్నారట.

మల్కాజ్‌గిరి.. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడ ప్రస్తుతం బిజెపి తరపున ఈటల రాజేందర్ ఎంపీగా ఉన్నారు. అయితే, ఇప్పుడు మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డిని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని చూస్తున్నారు. మల్లారెడ్డికి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. తనకున్న విద్యాసంస్థలు, ఆర్థిక బలం, కేడర్‌ను చూపిస్తూ.. బిజెపి అధిష్టానం దగ్గర మంతనాలు మొదలుపెట్టారు. గతంలోనే బండి సంజయ్‌ను కలవడం, ఇప్పుడు నేరుగా మోదీతో భేటీ కావడం చూస్తుంటే.. మల్కాజ్‌గిరి సీటు విషయంలో ఆయన గట్టి హామీ కోరుతున్నట్లు తెలుస్తోంది.

 

ఈటెల పట్టు చేజారిపోతుందా..?

ఈటల రాజేందర్ బిజెపిలో కీలక నేత. అయితే, ఆయన భార్య ఈటల జమునను వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని ఈటల వర్గం ఎప్పటి నుంచో పావులు కదుపుతోంది.ప్రస్తుతం ఇది మల్లారెడ్డి సొంత నియోజకవర్గం. ఒకవేళ మల్లారెడ్డి బిజెపిలోకి వస్తే, ఈటల జమునకు మేడ్చల్ టికెట్ దక్కడం అసాధ్యం.మల్కాజ్‌గిరి ఎంపీగా ఈటల కొనసాగితే, మల్లారెడ్డి కోడలికి చోటుండదు. ఒకవేళ మల్లారెడ్డి కుటుంబానికి టికెట్ ఇస్తే, ఈటల తన పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది.ఈటల జమునను మేడ్చల్‌లో అడ్డుకోవడానికే మల్లారెడ్డి ముందస్తుగా మోదీని కలిసి తన ‘బలం’ ప్రదర్శించారా? అనే చర్చ నడుస్తోంది.

మల్లారెడ్డికి రాజకీయాలన్నా, వ్యాపారాలన్నా లెక్కలు పక్కాగా ఉంటాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిఆర్ఎస్ నుంచి కాకుండా బిజెపి నుంచి పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన భావిస్తున్నారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే సంకేతాలు వస్తున్నాయి.

 

కొడలు విషయానికి వస్తే..ప్రీతిరెడ్డి విద్యావంతురాలు, మహిళా కోటాలోనూ, యువతలోనూ ఆమెకు మంచి క్రేజ్ తీసుకురావచ్చని మల్లారెడ్డి ప్లాన్ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం నుంచి ఆమెను బరిలోకి దించేందుకు బిజెపి పెద్దలతో డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఇప్పుడు ఉన్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్లబోతున్నారట. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. కోడలు బిజెపిలోకి వెళ్తే, ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి బిఆర్ఎస్‌లోనే ఉంటారా? ఒకవేళ మల్లారెడ్డి వెళ్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. లేదా అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

తను బిఆర్ఎస్‌లోనే ఉంటూ, తన కుటుంబాన్ని బిజెపిలో చేర్పించడం ద్వారా రెండు పార్టీలతోనూ సంబంధాలు కొనసాగించాలని చూస్తున్నారా? మల్లారెడ్డి వంటి ఆర్థికంగా బలమైన నేత వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ మరింత బలపడుతుందని బిజెపి భావిస్తోంది.మరోవైపు గులాబీ పార్టీలో ఈ భేటీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక కీలక ఎమ్మెల్యే ప్రధానిని కలవడంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఇది పార్టీ ఫిరాయింపుల కిందకు వస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

బిజెపి అధిష్టానం ఇప్పుడు డైలమాలో పడింది. ఒకవైపు బిసి సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్.. మరోవైపు ఆర్థికంగా, సామాజికంగా గ్రేటర్ హైదరాబాద్‌లో తిరుగులేని మల్లారెడ్డి.మల్లారెడ్డి బిజెపిలోకి వస్తే.. మేడ్చల్, మల్కాజ్‌గిరిలలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి.ఈటల వర్గం దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటుంది? సొంత పార్టీలోనే ‘ఇద్దరు మొనగాళ్ల’ మధ్య కోల్డ్ వార్ మొదలవుతుందా?మల్లారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకుంటే, ఈటల జమునమ్మకు సీటు కేటాయింపులో బిజెపి హైకమాండ్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది?

 

పాలమ్మినా.. పూలమ్మినా రాజకీయం నాకు తెలుసు అనే మల్లారెడ్డి.. ఇప్పుడు మోదీతో భేటీ ద్వారా ‘అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటా’ అనే సిగ్నల్ ఇచ్చేశారు. కానీ, ఈ క్రమంలో ఈటల రాజేందర్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మల్కాజ్‌గిరి కోటపై జెండా ఎగురవేసేది ప్రీతిరెడ్డినా? లేక ఈటల తన స్థానాన్ని కాపాడుకుంటారా? మేడ్చల్ గడ్డపై జమునమ్మ వర్సెస్ మల్లారెడ్డి ఫ్యామిలీ యుద్ధం ఎలా ఉండబోతోంది?

రాబోయే రోజుల్లో తెలంగాణ బిజెపిలో పెను మార్పులు ఖాయమని అర్థమవుతోంది. మొత్తానికి మల్లారెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. మరి ప్రీతిరెడ్డి కమలం తీర్థం పుచ్చుకుంటారా? మల్లారెడ్డి తదుపరి అడుగు ఎటు ఉంటుంది? ఇవన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.