తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక శకం.. ఒక ఉద్వేగం.. ఒక పోరాట గీతం భారత రాష్ట్ర సమితి. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండాగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, నేడు 25 వసంతాల మైలురాయిని అధిగమించింది. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక తామేనని చాటుతూ, పాతికేళ్ల పండగ వేళ సరికొత్త వ్యూహాలతో గులాబీ దళం కదం తొక్కుతోంది. ఒకవైపు సంబరాలు.. మరోవైపు సవాళ్లు.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ వేడుకలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసారి వేడుకలు అట్టహాసంగా చేయాలని పార్టీ నేతలు భావించినట్లుగానే సక్సెస్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన ఆఫీసు తెలంగాణ భవన్ గులాబీ తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. పార్టీ కార్యాలయంలో కేటీఆర్ జెండా ఆవిష్కరించి సంబరాలు ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రొపెసర్ జయశంకర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాతికేళ్ల మాట ఒక లెక్క.. ఇకపై ఆ పార్టీ మరొక లెక్కని అంటున్నారు ఆ పార్టీ నేతలు.బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో వేడుకలు భారీ ఎత్తున చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత కేసీఆర్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్‌కు వచ్చారు.
ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ నిర్ణయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పాతికేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న వేళ సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై రోడ్ మ్యాప్ సిద్దం చేశారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఉద్యమ ప్రణాళికను ఈ సమావేశంలో కేసీఆర్ ఖరారు చేశారు. అంతకుముందు అమర వీరులకు నివాళులర్పించి పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేశారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.‘ నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!.. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం! 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అంటూ ప్రస్తావించారు. బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు …ఒక విప్లవం! పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ తెలిపారు.
కీలక నేతల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఎక్స్ వేదికగా కొన్ని అంశాలు రాసుకొచ్చారు. నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక అంటూ ప్రస్తావించారు.సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక, పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక అంటూ రాసుకొచ్చారు. తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక, ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.
ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ అని పేర్కొన్నారు. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.ఇది నాణెనికి ఒకవైపు.. మరోవైపు వద్దాం. ఆ పార్టీలో సమస్యలు లేకపోలేదు. అధికార పోయిన తర్వాత నేతలు వాయిస్ బలంగా వినబడలేదు. ఎవరు, ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. దీనికితోడు కవిత సొంత పార్టీ పెట్టడం, ఆమె వైపు ఎంతమంది నాయకులు వెళ్తారోనన్న టెన్షన్ ఆ పార్టీ నాయకత్వాన్ని వెంటాడుతోందని ప్రత్యర్థుల నుంచి సౌండ్ బలంగా వినిస్తోంది. మొత్తానికి బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలతో తెలంగాణ భవన్ సరికొత్త కళను సంతరించుకుంది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఒక ప్రాంతపు ఉనికిని కాపాడే శక్తిగా పుట్టిన పార్టీకి ప్రజామద్దతే అసలైన కవచం. పాతికేళ్ల మైలురాయిని చేరుకున్న బీఆర్ఎస్, ఇప్పుడు మలుపులో ఉంది. “గతం ఘనం.. భవిష్యత్తుపై ధీమా” అన్నట్లుగా సాగిన ఈ వేడుకలు పార్టీ కార్యకర్తల్లో ఎంతటి భరోసాను నింపాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, తెలంగాణ గొంతుకగా గులాబీ జెండా మళ్ళీ రెపరెపలాడుతుందని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. పోరాటమే ఊపిరిగా పుట్టిన పార్టీకి.. ఈ 25 ఏళ్లు కేవలం ఆరంభం మాత్రమేనని కేటీఆర్ ముగించారు.