TDP:నెల్లూరు టీడీపీలో ‘బీదా’ పెత్తనం.. సీనియర్ల గుస్సా! లోకేష్ అండతోనే చక్రం తిప్పుతున్నారా?

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. ఆయనే ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోయినా, జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ఆయన మాటే శాసనంగా మారిందనే చర్చ జోరుగా సాగుతోంది. అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో, సింహపురి సైకిల్ పార్టీలో బీదా రవిచంద్ర ఒక పవర్ సెంటర్‌గా అవతరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కిలారి రాజేష్ అండ.. బీదా ప్లాన్! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారి రాజేష్ పేరు(KilariRajesh) రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. అయితే, నెల్లూరు జిల్లాలో బీదా రవిచంద్రకు, కిలారి రాజేష్‌కు (BeedaRavichandra) మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు జిల్లా నేతలకు మింగుడు పడటం లేదు. జిల్లాలో ఏ అధికారి బదిలీ కావాలన్నా, ఎవరికి పదవి దక్కాలన్నా ముందుగా బీదాను కలవాల్సిందేనని, ఆ తర్వాతే కిలారి రాజేష్ ద్వారా పనులు పూర్తవుతాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పదవుల భర్తీలో ‘డబుల్ ధమాకా’.. సొంత టీమ్ ఏర్పాటు? ఇటీవల భర్తీ చేసిన రాష్ట్ర, జిల్లా స్థాయి పదవుల్లో బీదా రవిచంద్ర మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ కేడర్ ఆరోపిస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి, తనకు అనుకూలంగా ఉండేవారికి, పైరవీలు చేసుకునే వారికే పదవులు కట్టబెట్టారని విమర్శలు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ వేలు పెడుతూ, అక్కడ సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని, దీనివల్ల స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు చికాకు పుడుతోందని సమాచారం.

కనుమరుగవుతున్న సీనియర్లు.. దేశాయి శెట్టి హనుమంతరావు, నువ్వుల మంజుల వంటి సీనియర్ నేతలు బీదా రవిచంద్ర అనుసరిస్తున్న రాజకీయాల వల్లే వెనుకబడిపోయారనే టాక్ వినిపిస్తోంది. నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే తొక్కేయడం ఆయన నైజమని సొంత పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎందరో సీనియర్లు పోటీ పడినా, సర్వేలు నిర్వహించినా.. తుది ఫలితం మాత్రం బీదాకే అనుకూలంగా రావడం వెనుక ఏదో మర్మం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధిష్టానం మేల్కోకపోతే గతేంటి? ఇప్పటికే పలువురు నేతలు బీదా రవిచంద్ర తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ నేతలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆధారాలతో సహా మొరపెట్టుకున్నా, ఫలితం లేకపోవడంతో కేడర్ డీలా పడిపోయింది. లోకేష్ అండ ఉండటంతో మంత్రులు కూడా ఆయన జోలికి వెళ్లడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే 2024లో వైసీపీకి పట్టిన గతే, నెల్లూరు జిల్లాలో టీడీపీకి పడుతుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం దృష్టి సారించకపోతే సింహపురి కోటలో సైకిల్‌కు బ్రేకులు పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.