అమరావతి ఒక రాజధాని కాదు.. అది చంద్రబాబు అండ్ కో బినామీ సామ్రాజ్యం. ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును తాకట్టు పెట్టి, నిబంధనలను తుంగలో తొక్కి సాగిస్తున్న ఈ ‘ప్లాన్డ్ అవినీతి’ చిట్టా ఇప్పుడు బట్టబయలవుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ద్వజమెత్తారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సుస్థిరమైన రాజధాని కావాలి అన్నది ప్రజల కోరిక. కానీ, చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో కొన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చి, ఆ భారాన్ని ప్రజల నెత్తిన వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు—పాతికేళ్లా? ఏభై ఏళ్లా? కేవలం ఒక వ్యక్తి ‘కల’ కోసం రాష్ట్ర ప్రజల జీవితాలను రిస్క్‌లో పడేయడం ఎంతవరకు ధర్మం?
సెల్ఫ్ గ్రోత్ ఇంజన్ ఎక్కడ? మచిలీపట్నం పోర్టు పూర్తవుతున్న వేళ, మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేస్తే, అది ప్రజలపై భారం పడకుండా రాష్ట్రానికి సిరులు కురిపించే ‘గ్రోత్ ఇంజన్’గా మారుతుందని జగన్ ఎప్పటి నుంచో చెప్తున్నారని అన్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా కేవలం అమరావతి పైనే ఎందుకు మక్కువ చూపిస్తోందని ప్రశ్నించారు.
సామాన్యుడికి ఒక రూలు.. బాబుకు మరో రూలు!
సిఆర్డీఏ (CRDA) చట్టం ప్రకారం సామాన్య రైతులకు అనేక కఠిన నిబంధనలు ఉన్నాయి:
-
ప్లాట్ల విభజన నిషేధం: రైతుకు ఎకరానికి ఇచ్చిన 1250 గజాల ప్లాటును తన ఇద్దరు కొడుకులకు పంచి ఇవ్వడానికి వీలు లేదు. సబ్-డివిజన్ చేసే అధికారం లేదు.
-
కఠిన నిబంధనలు: సామాన్యులు తమ సొంత భూమిలో ప్లాన్ అప్రూవల్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్నారు.
కానీ, ఈ రూల్స్ ఏవీ చంద్రబాబు నాయుడు , ఆయన చుట్టాలకు, బినామీలకు వర్తించవు. ఇది పక్కాగా స్కిల్డ్ కరప్షన్ అని ఎద్దేవా చేశారు పేర్ని నాని.
బాబు ఇల్లు – ఈ6 రోడ్డు మాయాజాలం
అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక మెతుకు పట్టుకుంటే చాలు. అమరావతి అవినీతికి చంద్రబాబు ప్లాట్ ఒక నిదర్శనంగా ఉన్నారన్నారు.
-
కేటాయింపుల పర్వం: 2024లో అధికారంలోకి రాగానే, పాత సచివాలయానికి వెనుక ఉన్న ‘ఈ6’ రోడ్డు ప్రాంతంలో బినామీల పేరుతో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించారు.
-
ప్రైమ్ లొకేషన్: సచివాలయం ముందు, హైకోర్టు వెనుక, అసెంబ్లీ పక్కన.. ఇలా అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఐదు ఎకరాల చిల్లర స్థలాన్ని చంద్రబాబు గారి కోసం ప్లాన్ చేశారు.
-
ఇరుగు-పొరుగు మిత్రులు: నారాయణకి కూడా సరిగ్గా బాబు ఇంటి పక్కనే ప్లాట్ కేటాయించారు. డాబా మీద నిలబడి పిలిస్తే పలికేంత దగ్గరగా ఈ కేటాయింపులు జరగడం యాదృచ్చికమేనా?
తాడేపల్లి ‘ప్యాలెస్’ అన్నోళ్లకి నోరు పడిపోదా?
జగన్ మోహన్ రెడ్డి కేవలం ఒక ఎకరంలో ఇల్లు కట్టుకుంటే దాన్ని ‘తాడేపల్లి ప్యాలెస్’ అని విమర్శించే పచ్చ చొక్కాల బ్యాచ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నడిబొడ్డున ఐదు ఎకరాల్లో కడుతున్న భారీ భవనాన్ని ఏమని పిలుస్తారు? ఇది ప్యాలెస్ కాదా?
రాష్ట్ర ప్రజల ఆశలను, కలలను తాకట్టు పెట్టి కేవలం తన బినామీలకు, బంధువులకు మేలు చేసేలా అమరావతి ప్రాజెక్టును చంద్రబాబు డిజైన్ చేశారు. జగన్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వ్యక్తిగత దూషణలకు దిగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారు.