వైట్ ప్లేట్ కార్లతో అక్రమ సెల్ఫ్ డ్రైవ్ దందా ఆరోపణలు.. ప్రభుత్వ ఆదాయానికి గండి?

నగరంలోని మాదాపూర్, అత్తాపూర్ కేంద్రంగా ఓ భారీ అక్రమ సెల్ఫ్ డ్రైవ్ కార్ల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ప్రైవేట్ అవసరాల కోసం వాడుకోవాల్సిన ‘వైట్ ప్లేట్’ లగ్జరీ కార్లను అక్రమంగా అద్దెకు తిప్పుతూ ఓ వ్యక్తి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సదరు నిర్వాహకుడు నిబంధనలకు పాతరేస్తూ.. కోట్లాది రూపాయల పన్నులు ఎగవేస్తున్న వైనం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

నిబంధనల ప్రకారం అద్దెకు ఇచ్చే సెల్ఫ్ డ్రైవ్ వాహనాలకు కమర్షియల్ (ఎల్లో లేదా బ్లాక్ బోర్డు) రిజిస్ట్రేషన్ ఉండాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. కానీ, ఇవేవీ పట్టని ఆ వ్యక్తి వైట్ బోర్డు ఉన్న లగ్జరీ కార్లను సెల్ఫ్ డ్రైవ్ కింద ఇస్తూ యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నాడు.

కస్టమర్లకు వేధింపులు.. కేసుల ఉచ్చు

ఈ అక్రమ దందాలో కేవలం పన్ను ఎగవేత మాత్రమే కాదు, వినియోగదారులకు వేధింపులు కూడా తీవ్రంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్లకు అమర్చిన జీపీఎస్ (GPS) సిస్టమ్ ఆధారంగా కస్టమర్ల కదలికలను ట్రాక్ చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సమేతంగా టూర్లలో ఉన్న వారిని టార్గెట్ చేసి, తన ప్రైవేట్ రికవరీ టీమ్స్ తో అడ్డగించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

మరోవైపు ఈ వైట్ ప్లేట్ కార్లు అద్దెకు తీసుకున్న కొందరు వాటిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తుండటంతో అవి పలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటున్నాయి. పోలీసు స్టేషన్లలో ఈ వాహనాలపై కేసులు నమోదవుతున్నా.. అసలు సూత్రధారిపై మాత్రం ఎలాంటి చర్యా ఉండటం లేదు.

అధికారుల ఉదాసీనతపై విమర్శలు

ఇన్ని ఫిర్యాదులు, అక్రమాలు, పోలీసు కేసులు కళ్ళెదుటే కనిపిస్తున్నా అటు పోలీసులు గానీ, ఇటు రవాణా (RTA) శాఖ అధికారులు గానీ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా అధికారులు చోద్యం చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉక్కుపాదం మోపాలని ట్యాక్సీ యూనియన్ల డిమాండ్

లక్షలు వెచ్చించి, ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కట్టి, పర్మిట్లు తీసుకుని చట్టబద్ధంగా నడుపుకుంటున్న తమ పొట్ట కొడుతున్నారని ట్యాక్సీ వెహికల్స్ యూనియన్ నేతలు మండిపడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి వైట్ బోర్డు కార్లతో దందా చేస్తున్న ఆ ఖమ్మం వాసిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ లగ్జరీ కార్ల అక్రమ నెట్‌వర్క్‌ను ఛేదించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని క్యాబ్, ట్యాక్సీ సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.