T Congress: మిర్యాలగూడలో ‘మాయాబజార్’.. BLR సొంత మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్! రెండేళ్లయినా అడుగు పడని 18 హామీలు!

ఎన్నికల వేళ ఓట్ల వేటలో అభ్యర్థులు రకరకాల హామీలు ఇవ్వడం సహజం. కానీ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మాత్రం రూట్ మార్చి, ఏకంగా పార్టీ మేనిఫెస్టో కంటే మిన్నగా ‘బిఎల్ఆర్ బ్రదర్స్ మేనిఫెస్టో’ అంటూ 18 హామీలతో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించారు. తీరా గెలిచి రెండున్నరేళ్లు గడిచినా, ఆ హామీలన్నీ కాగితాలకే పరిమితం కావడంతో ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ‘బత్తుల గారూ.. మీ మేనిఫెస్టో ఏమైంది?’ అంటూ నిలదీస్తున్నారు.

సొంత మేనిఫెస్టోతో ‘డబుల్ గేమ్’! కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే, బత్తుల మాత్రం తన ఫౌండేషన్ ద్వారా చేసే సేవలను జోడిస్తూ ఒక ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించారు. మిర్యాలగూడను జిల్లాగా మారుస్తానని, నిరుపేదలకు దసరా కానుకలు ఇస్తానని, విద్యా-వైద్య రంగాలను సమూలంగా మారుస్తానని ఇచ్చిన హామీలు ఓటర్లను ఆకర్షించాయి. ఆయన గెలుపులో ఈ ‘ఓన్ మేనిఫెస్టో’ కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.

చలివేంద్రాలు తప్ప సాగిన అభివృద్ధి శూన్యం? హామీల చిట్టా భారీగా ఉన్నా, ఆచరణలో మాత్రం చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ వంటి చిన్నపాటి సేవా కార్యక్రమాలకే ఆయన పరిమితమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. 18 కీలక అంశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా క్షేత్రస్థాయిలో అమలు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా:

  • మిర్యాలగూడ జిల్లా సాధన: ఈ హామీ ఏమైందో అడ్రస్ లేదు.

  • సామాజిక సేవ: తన ఫౌండేషన్ ద్వారా కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి.

  • కులాల అభివృద్ధి: ముస్లిం, క్రిస్టియన్ మరియు ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలు అటకెక్కాయి.

సోషల్ మీడియాలో ‘ట్రోలింగ్’.. అబద్ధాల అడ్డాగా మారిందా? ఎమ్మెల్యే వైఖరిపై విసిగిపోయిన జనం ఇప్పుడు ఆయన ప్రచార వీడియోలను, ఆనాటి కరపత్రాలను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. “అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు దండుకున్నారు” అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏరు దాటాక బోడ మల్లన్న అన్న చందంగా ఎమ్మెల్యే వ్యవహారం ఉందని కేడర్ సైతం గుసగుసలాడుతోంది.

విశ్వసనీయతకు పరీక్షా కాలం! రాజకీయాల్లో మాట తప్పడం అంటే ప్రజలను వంచించడమే. ఫౌండేషన్ ద్వారా సంపాదించుకున్న మంచి పేరును, రాజకీయ అబద్ధపు హామీలతో పోగొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బిఎల్ఆర్ తన సొంత మేనిఫెస్టోను ఒక్కసారి తిరగేసి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.