Nara Lokesh: వారసుడి నుంచి తిరుగులేని ‘నావికుడి’ వరకు.. చినబాబు పొలిటికల్ రైజ్!

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది పాత సామెత. కానీ, ఇంటా బయటా ఎదురైన సవాళ్లను చిరునవ్వుతో స్వీకరించి, తనను తాను మలచుకొని, నేడు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ‘నావికుడు’గా నిలిచారు నారా లోకేష్. నిన్నటి దాకా విమర్శలు చేసిన నోళ్లే నేడు ‘అవురా’ అని ఆశ్చర్యపోయేలా తన రాజకీయ పంథాను మార్చుకున్నారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని, కష్టకాలంలో క్యాడర్‌కు వెన్నుదన్నుగా నిలిచి, నారా వారి రెండో తరం నాయకత్వంపై అపారమైన నమ్మకాన్ని కలిగించారు. అపజయాల అగాధంలో నుంచి సక్సెస్ శిఖరాలకు చేరుకున్న ‘చినబాబు’ ప్రయాణం ఇప్పుడు చూద్దాం

 

నారా లోకేష్ 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఒక రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపిస్తుంది. ప్రారంభంలో ఎదురైన అవమానాలు, ప్రత్యర్థుల వెక్కిరింతలు ఆయన్ను కుంగదీయలేదు. బదులుగా, మరింత పట్టుదలతో తన వాగ్ధాటిని, పనితీరును మెరుగుపరుచుకున్నారు. కేవలం వారసుడిగా కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో కలిసి నడిచిన నాయకుడిగా ఎదిగారు. మంత్రిగా ఉన్న సమయంలో ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల్లో ఆయన చూపిన చొరవ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. కష్టకాలంలో అధినేత చంద్రబాబుకు అండగా ఉంటూ, ప్రత్యర్థుల కుతంత్రాలను తిప్పికొట్టడంలో ‘చండశాసనుడి’ పాత్రను పోషించారు.

 

గతంలో లోకేష్(Nara Lokesh) నాయకత్వంపై ఉన్న సందిగ్ధత నేడు పటాపంచలైంది. పార్టీలో కౌన్సిలర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా అందరితోనూ ఆత్మీయ బంధాన్ని పెనవేసుకున్నారు. సర్వజన ఆమోదంతో పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టి, క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని, తన హామీలను అమలు చేస్తూ మాట మీద నిలబడే నాయకుడిగా ముద్ర వేసుకున్నారు.

 

తెలుగు రాజకీయాల్లో నారా లోకేష్ అంటే ఒకప్పుడు ‘తండ్రి చాటు బిడ్డ’. కానీ, పుష్కర కాలం తిరగకముందే ఆయన ‘తండ్రికి తగ్గ తనయుడిగా’, రేపటి రోజున ‘తండ్రిని మించిన నాయకుడిగా’ తన ముద్ర వేస్తున్నారు. కేవలం వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, నేడు స్వతంత్రంగా తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రస్థానం ఒక కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ఆయనకు, పార్టీ ఇప్పుడు ‘జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్’ గా పట్టం కట్టింది. చంద్రబాబు తర్వాత పార్టీలో తిరుగులేని నెంబర్ 2 స్థానానికి ఇది ఒక అధికారిక ముద్ర. ఈ పదోన్నతి ద్వారా టీడీపీ పగ్గాలను పూర్తిస్థాయిలో చేపట్టే దిశగా లోకేష్ మరో కీలక అడుగు వేశారు.

 

రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ప్రత్యర్థుల నుంచి లోకేష్ ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే, సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవాలి అనే తన తండ్రి సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన, విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ అంచలంచలుగా ఎదిగారు.రాజకీయ అరంగేట్రం చేసిన కొత్తలో తడబాట్లు పడ్డా వెనకడుగు వేయలేదు. అలా ముందుకెళ్లడంతో పాటు ఇప్పుడు పార్టీ వ్యూహకర్తగా, క్షేత్రస్థాయి కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడిగా పరిణతి చెందారు. పార్టీని నడిపించే సంపూర్ణ వారసుడిగా సిద్ధం అయ్యారు.

 

2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు(Chandrababu) కేబినెట్‌లో మంత్రిగా రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం లోకేష్‌కు ఉంది. అయితే, 2024 ఎన్నికల్లో NDA కూటమి సాధించిన ఘనవిజయం తర్వాత, లోకేష్ బాధ్యత మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వంలో తన తండ్రి చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉంటూ, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.పది మందిని ఎదగనిచ్చి, తాను ఎదగాలనుకునేవాడే నిజమైన నాయకుడనే సిద్ధాంతాన్ని లోకేష్ అక్షరాలా పాటిస్తున్నారు. తాజాగా ప్రకటించిన పార్టీ కమిటీల కూర్పులో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలకు పూర్తి స్థాయిలో ‘న్యూ లుక్’ తీసుకొచ్చారు.ఎవరూ ఊహించని విధంగా మండల పార్టీ అధ్యక్షులకు, క్లస్టర్ ఇంచార్జీలకు రాష్ట్ర స్థాయి కమిటీల్లో ఉన్నత పదవులు కల్పించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

 

పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని లోకేష్ గతంలోనే మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ సామాన్య కార్యకర్తలకు సైతం ఉన్నత పదవులు కట్టబెట్టారు. దీని ద్వారా పార్టీ పట్ల కార్యకర్తల్లో నమ్మకాన్ని రెట్టింపు చేశారు.కష్టపడితే పదవులు వస్తాయనే సంకేతాన్ని పంపారు.వారసత్వ రాజకీయాల కంటే పనితీరుకే ప్రాధాన్యత అని నిరూపించారు.

 

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సరికొత్త జోష్ కనిపిస్తోంది. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని నినాదంగానే వదిలేయకుండా, క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత ఏడాది కాలంగా ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు పార్టీలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. లోకేష్ ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, కేవలం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సామాన్య కార్యకర్తలకు మాత్రమే వేదికపై ప్రాధాన్యత కల్పించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పైరవీలు చేసే వారికి చెక్ పెడుతూ, కష్టపడే వారికే గుర్తింపు ఉంటుందని చేతల్లో చూపించి కేడర్‌లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

 

భవిష్యత్తు నాయకత్వాన్ని సిద్ధం చేసే క్రమంలో లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. పార్టీ కమిటీల్లో యువతకు సముచిత స్థానం కల్పిస్తూ, ‘తండ్రికి తగ్గ తనయుడు’ అనిపించుకుంటున్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, పార్టీ పట్ల విధేయతతో ఉన్న సామాన్య కార్యకర్తలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.సీనియర్ల సలహాలను తీసుకుంటూనే, జూనియర్ల వేగాన్ని పార్టీకి పెట్టుబడిగా మారుస్తున్నారు. ఈ సమన్వయంతో టీడీపీని ఒక ‘రేసు గుర్రం’లా ఎన్నికల బరిలో సిద్ధం చేయడంలో లోకేష్ వ్యూహరచన విజయవంతమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నారా లోకేష్ రాజకీయ ప్రయాణం అటు విద్యావంతుడిగా, ఇటు క్షేత్రస్థాయి నాయకుడిగా ఆసక్తికరంగా సాగింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందిన లోకేష్, తొలుత వరల్డ్ బ్యాంకులో పనిచేసి అంతర్జాతీయ అనుభవాన్ని గడించారు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి 2008 నుండి 2013 వరకు హెరిటేజ్ సంస్థ బాధ్యతలను నిర్వహించారు.లోకేష్ రాజకీయాల్లోకి అధికారికంగా రాకముందే తనదైన ముద్ర వేశారు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో సంచలనం సృష్టించిన ‘నగదు బదిలీ పథకం’ లోకేష్ ఆలోచన నుంచే పుట్టిందని నాడే చంద్రబాబు ప్రకటించారు.

 

2013లో హైదరాబాద్‌ గండిపేటలో జరిగిన మహానాడు వేదికగా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2017 మార్చి 30న తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు.
చంద్రబాబు క్యాబినెట్‌లో ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టారు.ఏపీకి దిగ్గజ ఐటీ కంపెనీలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సృజనాత్మకతను జోడించి గ్రామీణ అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కించారు.ఆయన చేసిన కృషికి గానూ ప్రతిష్టాత్మకమైన ‘అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్’ పురస్కారం లభించింది.

 

2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోకేష్ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఓటమితో కుంగిపోకుండా, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగారు.ఏపీలో టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో 2023 జనవరి 27న కుప్పం నుంచి ‘యువగళం’ పేరిట భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, యువతలో ఉత్తేజం నింపుతూ సాగుతున్న ఈ యాత్ర లోకేష్ రాజకీయ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ కార్డు మాత్రమే ఇస్తుంది, కానీ ఉనికిని చాటుకోవాలంటే సొంతంగా పోరాడాల్సిందే. నారా లోకేష్ విషయంలో ఇదే జరిగింది. 2013 నుంచి 2025 వరకు.. ఈ పుష్కర కాలంలో లోకేష్ ఒక సాధారణ నాయకుడి నుంచి తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ‘నావికుడి’గా ఎదిగిన తీరు అసామాన్యం.

 

లోకేష్ రాజకీయ జీవితంలో బిగ్ టర్నింగ్ పాయింట్ కుప్పం నుంచి మొదలై విశాఖ జిల్లా అగనంపూడి వరకు సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేసింది.3,132 కిలోమీటర్లు 226 రోజులుఈ యాత్ర కేవలం పాదయాత్ర మాత్రమే కాదు, లోకేష్‌లోని నాయకత్వ పటిమకు సానబెట్టిన పాఠశాల. యువత, మహిళల సమస్యలను నేరుగా తెలుసుకుని, వారు అడిగిన క్లిష్టమైన ప్రశ్నలకు దీటుగా సమాధానాలిస్తూ తనలోని పరిపూర్ణ నాయకుడిని ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు.

 

2019లో మంగళగిరిలో ఓటమి ఎదురైనప్పుడు అందరూ విమర్శించారు. కానీ, పోయిన చోటే వెతుక్కోవాలి అన్న సామెతను నిజం చేస్తూ, 2024లో మళ్ళీ అదే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 30 ఏళ్లుగా టీడీపీకి కొరకరాని కొయ్యగా ఉన్న మంగళగిరిలో 90,000 పైచిలుకు మెజారిటీతో రికార్డు సృష్టించి, విమర్శకుల నోళ్లు మూయించారు.2023 సెప్టెంబర్‌లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ వ్యవహరించిన తీరు పార్టీ శ్రేణుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది.జాతీయ స్థాయిలో పొలిటికల్ లాబీయింగ్ చేయడంలోనూ, నేషనల్ మీడియా చర్చల్లో కేసుల్లోని డొల్లతనాన్ని ఎండగట్టడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. అటు కుటుంబానికి, ఇటు పార్టీకి అత్యంత క్లిష్ట సమయమైనా అదరక బెదరక సీనియర్లు, జూనియర్లను సమన్వయం చేసుకుంటూ ముందుండి నడిపించారు.

 

2024 ఎన్నికల్లో కూటమి 164 స్థానాలు సాధిస్తుందని లోకేష్ ముందు నుంచే ధీమాగా చెబుతూ వచ్చారు. ఆయన అంచనా నిజమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహాలకు తోడు, క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేయడంలో లోకేష్ పాత్ర వెలకట్టలేనిది. నేడు టీడీపీలో ఆయన ‘నెంబర్ 2’ అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు.మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖలో రూ. 80 వేల కోట్లతో అదానీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర. కేవలం పాలిటిక్సే కాకుండా, ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

 

ఒకప్పుడు ప్రత్యర్థుల ఎగతాళిని తన పనితీరుతో ఫైర్‌ బ్రాండ్‌గా మార్చుకున్నారు. ప్రధాని మోదీ వంటి అగ్రనేతల దృష్టిని సైతం ఆకర్షించిన లోకేష్, నేడు టీడీపీ భవిష్యత్ నావికుడిగా ఎదిగారు. ఇంట గెలిచి రచ్చ గెలిచిన ఈ యువనేత, ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు.