తెలుగుదేశం పార్టీ అంటే కేవలం ఒక రాజకీయ పక్షం కాదు.. అదొక బలమైన భావోద్వేగం. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పసుపు జెండా, ఇప్పుడు సరికొత్త ‘ఫ్రెష్ లుక్’తో ముస్తాబైంది. మంగళగిరి వేదికగా జరిగిన చారిత్రాత్మక ఘట్టంలో, అటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూనే, ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు నూతన సైన్యాన్ని సిద్ధం చేశారు.
మండల స్థాయి నుంచి పొలిట్ బ్యూరోకు..
టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తలకు అత్యున్నత గౌరవం దక్కింది. మండల క్లస్టర్ స్థాయి నేతలను నేరుగా పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టి, ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని చంద్రబాబు నిజం చేసి చూపించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వంటి ప్రముఖులు కింద కూర్చుంటే, సామాన్య కార్యకర్తలు వేదికపై ఆశీనులవ్వడం టీడీపీలోనే సాధ్యమని ఆయన చాటిచెప్పారు.
లోకేష్‌కు దళపతి బాధ్యతలు!
పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ ఆశయాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని ఆయన ప్రమాణం చేశారు. లోకేష్‌కు ఈ పదవి ఇవ్వడంపై చంద్రబాబు స్పష్టతనిస్తూ..
-
విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కేడర్‌ను సమర్థవంతంగా నడిపించారు.
-
కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా వేలాది కుటుంబాలకు అండగా నిలిచారు.
-
ఐటీ మంత్రిగా ఏపీకి దిగ్గజ కంపెనీలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సొంత నేతలకు చంద్రబాబు ‘స్వీట్ వార్నింగ్’
అధికారంలోకి వచ్చామన్న గర్వంతో ఇగోలకు పోవద్దని చంద్రబాబు తన పార్టీ నేతలకు సున్నితంగా, కఠినంగా హెచ్చరించారు. ఆయన ఇచ్చిన ప్రధాన సూచనలు ఇవే:
-
బూతులు, వివాదాలకు దూరం: నేతలు దాడులు, సెటిల్మెంట్లు, బూతు పురాణాలకు దూరంగా ఉండాలి.
-
ఫ్లెక్సీల గొడవలు వద్దు: ఫోటోలు లేవని, కుర్చీలు దక్కలేదని చిన్నపిల్లల్లా గొడవ పడటం సరికాదు.
-
పొత్తు ధర్మం ముఖ్యం: క్షేత్రస్థాయిలో బీజేపీ, జనసేన కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలి.
-
నియోజకవర్గాలపై పట్టు: వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలి.
44 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని రాబోయే తరాలకు అనుగుణంగా మార్చిన తీరు అద్భుతం. కష్టపడే తత్వానికి పెద్దపీట వేస్తూ, యువతకు ప్రాధాన్యతనిస్తూ చంద్రబాబు వేసిన ఈ అడుగు పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. లోకేష్ నాయకత్వంలో ఈ నూతన కమిటీలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఎలా మలచబోతున్నాయో వేచి చూడాలి.