T Congress: మంత్రి అజారుద్దీన్ కుర్చీకి ముప్పు? రేవంత్ రెడ్డి ‘రాజ్ భవన్’ వ్యూహం ఫలించేనా!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్ భవన్ పైనే ఉన్నాయి. మంత్రి మహ్మద్ అజారుద్దీన్ కుర్చీ ఉంటుందా? ఊడుతుందా? అన్న ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. మరో 10 రోజుల్లో డెడ్‌లైన్ ముగుస్తుండటంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయి అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఫైల్‌ను క్లియర్ చేయాలని కోరారు. అసలు అజారుద్దీన్ పదవికి ఎందుకు ముప్పు వచ్చింది? రాజ్ భవన్ రియాక్షన్ ఏంటి?

 

తెలంగాణ క్యాబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న అజారుద్దీన్ భవితవ్యం ఇప్పుడు ‘కౌంట్ డౌన్’ లో పడింది. గతేడాది అక్టోబర్ 31న ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఆరు నెలల లోపు అంటే.. ఈ నెల 30వ తేదీ లోగా ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావాలి. లేనిపక్షంలో ఆ పదవి గాలిలో దీపంలా మారుతుంది. అజారుద్దీన్ ఎమ్మెల్యేగా గెలవలేకపోవడంతో, ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడమే ఏకైక మార్గంగా ప్రభుత్వం భావించింది.

 

 

అందుకే గవర్నర్ కోటాలో అజారుద్దీన్‌తో పాటు కోదండరాం పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల ఈ ఫైల్ పెండింగ్‌లో పడటంతో ఉత్కంఠ నెలకొంది. ఈ గడువు ముగియడానికి కేవలం కొద్దిరోజులే సమయం ఉండటంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు.అజారుద్దీన్ కుర్చీ కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే, ఒకవేళ గవర్నర్ నిర్ణయం ఆలస్యమైతే ఏం చేయాలి? అనే దానిపై ప్రభుత్వం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

 

అజారుద్దీన్ భవితవ్యం ఇప్పుడు రాజ్ భవన్ చేతుల్లో ఉండటంతో సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. సమయం తక్కువగా ఉండటంతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి ఫైల్‌ను క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేశారు.ఒకవేళ అలా కుదరని పక్షంలో గవర్నర్ ఆమోదం రాకపోతే, ప్రభుత్వం ‘రీ-అపాయింట్‌మెంట్’ ఫార్ములాను పరిశీలిస్తోంది. లేదంటే ఏప్రిల్ 30న అజారుద్దీన్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించడం. మే 1వ తేదీన లేదా ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే ఆయనతో మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

 

బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లను సిఫార్సు చేయగా, అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ పేర్లను తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత సిఫార్సులను పక్కన పెట్టి ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను మంత్రివర్గం గవర్నర్‌కు సిఫార్సు చేసింది. దీనిని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో సిఫార్సు పొందిన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ వివాదాన్ని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానాలు గతంలో కీలక ఆదేశాలు ఇచ్చాయి. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో, ప్రస్తుత నియామక ప్రక్రియపై న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చాల్సి వచ్చింది.

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అనూహ్యంగా మంత్రి పదవి చేపట్టిన మొహమ్మద్ అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు రాజ్‌భవన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీల నియామకంపై గతంలో నెలకొన్న అడ్డంకులను తొలగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల కీలక మార్గదర్శకాలను ఇచ్చింది. వీరి ఎంపికకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఇద్దరి నియామకానికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. గవర్నర్ దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటే, అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం అవుతుంది.

ఒకవేళ మళ్ళీ ప్రమాణం చేసినా, తదుపరి ఆరు నెలల్లోగా ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది.అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు ప్రస్తుతం అంత సులభంగా కనిపించడం లేదు. నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయినప్పటికీ, ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో ఓటర్లు లేరు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఈ సీటు భర్తీ అయ్యే అవకాశం ఉంది.

నవంబర్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. కానీ అజారుద్దీన్ అక్టోబర్ లోపే సభ్యుడిగా ఎన్నికవ్వాలి. ఈ గడువు పొంతన కుదరకపోవడం పెద్ద చిక్కుగా మారింది. ఒకవేళ ప్రభుత్వం అజారుద్దీన్ పేరును గవర్నర్ కోటాకు సిఫార్సు చేసినా, గతంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.మొత్తానికి అజారుద్దీన్ మంత్రి పదవి ఈ నెల 30తో ముగియనుండటంతో, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? రాజ్యాంగపరమైన చిక్కులను ఎలా అధిగమిస్తుంది? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.