కవితకు రిలీఫ్.. బీజేపీతో విలీనాన్ని వ్యతిరేకించినందుకే ఇరికించారా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పెను ఊరట లభించింది. ఈ కేసులో ఆమె నేరం చేసినట్లు నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ‘క్లీన్ చిట్’ ఇచ్చింది. దీంతో ఈ వివాదంలో కవిత నిర్దోషి అని కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది.ఇదే సమయంలో బీఆర్ఎస్.. బీజేపీతో పొత్తుకు సిద్ధమైందని, ఈ ప్రస్తావన తన ముందుకు రాగా, వ్యతిరేకించినట్టు కవిత గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గత కొంతకాలంగా దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ కేసులో కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా 20 మందిని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ సీబీఐ తీరుపై ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.”సరైన సాక్ష్యాధారాలు లేకుండా అగ్రనేతలపై కేసులు ఎలా పెడతారు? అభియోగాలు ఎలా మోపుతారు?” అని న్యాయస్థానం ప్రశ్నించింది.
కావాలనే ఈ కేసులో కవితను, ఇతరులను ఇరికించినట్లు కనిపిస్తోందని, దర్యాప్తు సంస్థల పనితీరుపై కోర్టు మండిపడింది ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేనందున, ఈ కేసు నిలవదని పేర్కొంటూ నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చింది.
గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ పరువు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐని పావుగా వాడుకుందని కవిత మొదటి నుంచీ ఆరోపిస్తూనే ఉన్నారు.నేను ఏ తప్పూ చేయలేదు.. కడిగిన ముత్యంలా బయటకు వస్తాను” అని కవిత గతంలో ధీమాగా చెప్పిన మాటలు నేడు కోర్టు తీర్పుతో నిజమయ్యాయి.
2021-22 ఏడాదిలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తేగా ఇందులో అక్రమాలు జరిగాయని, 2022 జూలైలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించారు. మరోవైపు లైసెన్స్ ఫీజు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందని, మద్యం వ్యాపారులకు మేలు చేసేలా పాలసీని రూపొందించారని అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నివేదిక కూడా ఇచ్చారు.ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు నుంచి కవిత హస్తం ఉందని, ఆప్ పార్టీకి ముడుపులు అందడంలో ఆమె ఇన్వాల్వ్ మెంట్ ఉందని సీబీఐ అభియోగాలు మోపింది. కాగా, ఇదంతా కేంద్రంలోని బీజేపీ కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించిందని ఆమె ఆరోపించారు.నాటి నుంచి ఆమె బీజేపీని టార్గెట్ చేశారు.
తాజాగా ఈ కేసులో కవితకు ఊరట లభించగా ఆమె రాజకీయంగా బీజేపీని శత్రువుగా చూస్తుందా? లేదా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఓ కారణమని ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు కవిత లిక్కర్ స్కామ్‌కు పాల్పడిందని, బీఆర్ఎస్ అవినీతికి అదో పరాకాష్ట అని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్దఎత్తున ప్రచారం చేశాయి. లిక్కర్ స్కాములో చెల్లె అంతగా అవినీతికి పాల్పడితే.. తండ్రీకొడుకులు అంతకుమించి అవినీతికి పాల్పడారని పార్టీలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే కేసీఆర్.. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని ప్రకటించినప్పుడు కవిత వ్యతిరేకించినట్టు పేర్కొంది. ఆ కారణంగానే కల్వకుంట్ల కుటుంబలో మనస్పర్దలు రావడం, కవిత పార్టీ నుంచి బయటకు రావడం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజకీయ జీవితం కోసం భవిష్యత్‌లో కవిత.. బీజేపీతో దోస్తీ చేస్తుందా? శత్రుత్వం కొనసాగిస్తుందా? తెలియాల్సి ఉన్నది.