జూలై లేదా ఆగస్టులో స్థానిక ఎన్నికలు? చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదే!
గత అసెంబ్లీ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిచిన పాలక టీడీపీ కూటమి.. వచ్చే ఎన్నికల్లోనూ విక్టరీ రిపీట్ చేయాలని అనుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిచిన పాలక టీడీపీ కూటమి.. వచ్చే ఎన్నికల్లోనూ విక్టరీ రిపీట్ చేయాలని అనుకుంటోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ ప్రతి రోజూ రేపే ఎన్నికలు అన్నంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం నిరంతరం అధికారం కాపాడుకునే ఆలోచనతోనే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారని అంటున్నారు. తమ ప్రభుత్వాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తేనే అభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రచారం చేస్తున్నారు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు కూటమిలో కీలక నేతలు అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సైతం మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలని అనుకుంటున్నారు. ప్రజలకు కూడా ఇదే విషయం చెబుతూ కూటమిగా కొనసాగుతామని తమను మళ్లీ మళ్లీ గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మరి, దాని కోసం కూటమి వేస్తున్న స్కెచ్ ఏమిటో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం..
కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ రెండేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో ఇక కూటమి ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించడంలో ఎలాంటి సందేహాలు లేవన్నది నాయకత్వానికి స్పష్టమయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుండటం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతుండటంతో ఇక కూటమి ప్రభుత్వం కూడా త్వరలోనే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే ఎండల సమయంలో కంటే తర్వాత పోలింగ్ జరపడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. ఎండాకాలంలో ఓటింగ్ శాతం పై ప్రభావం పడుతుందని, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశముందన్న అంచనాలో ఉంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. జులై నెలలో అయితే కొంత ఎండల తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు. లేదంటే ఆగస్టులోనైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమన్న సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. మున్సిపాలిటీల్లోనూ తాడిపత్రి ఒక్కటే టీడీపీ గెలుచుకుంది. ఈ సారి అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ ను స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించే ప్లాన్ ను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా జిల్లాల పర్యటనలు కూడా ఆయన చేస్తారని తెలిసింది.
స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే తమ ఓటు బ్యాంకు మరింత బలపడుతుందని, రాజకీయంగా తమకు లాభిస్తుందని చంద్రబాబు అంచనా. అనేక మందికి పదవులు దక్కుతాయి. ఇప్పటి వరకూ పదవులు దక్కలేదని నిరాశలో ఉన్న వారి అసంతృప్తిని చల్లారవచ్చు. మరొకవైపు శాసనసభ్యులను కూడా యాక్టివ్ చేయవచ్చు. వారి నియోజకవర్గంలో జరిగే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలిపించుకునే బాధ్యత వారిపైనే ఉండటంతో వారు నిరంతరం ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. దానివల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వీలయినంత త్వరగానే స్థానిక సంస్థలకు వెళ్లేలా చంద్రబాబు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
గత 20 నెలలుగా పకడ్బందీ వ్యూహంతో కదులుతున్న కూటమి సర్కారు మిషన్- 2029 ప్రణాళికలను సిద్ధం చేసిందని అంటున్నారు. ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ అధికార కూటమి ఆలోచనలు చూస్తుంటే ప్రతి రోజూ ఎన్నికే అన్నస్థాయిలో పనిచేస్తున్నట్లు ఉందని అంటున్నారు. దీనికి సీఎం చంద్రబాబు రీసెంట్గా చేసిన కామెంట్స్ గుర్తు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మార్కాపురం జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు అనేక అంశాలపై మాట్లాడారు. ప్రధానంగా విపక్షం వైఎస్ఆర్సీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా, గత ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు చోట్ల ఓడిపోవడాన్ని ప్రత్యేకంగాప్రస్తావించారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్‌గా ఉన్నచోట టీడీపీ ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై చంద్రబాబు అండ్ టీం ఫోకస్ పెట్టారు.
మార్కాపురం జిల్లా పర్యటన సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఇద్దరు రైతులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆ పనులు జరుగుతున్న యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ గెలవకపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలో ఉన్న నేత ఒక నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయామో తెలుసుకునే ప్రయత్నం చేయడం, అదీ సాధారణ వ్యక్తులతో ఈ అంశంపై చర్చించడం చూస్తే క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి చంద్రబాబు ఎంతలోతుగా ఆలోచిస్తున్నారో అర్థమవుతోందని అంటున్నారు.
మిషన్ 2029 దిశగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు ప్రతి నెల నియోజకవర్గాల వారీగా సమాచారం తెప్పించుకుంటున్నారు. ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఏం పనిచేస్తున్నారు? ప్రజల స్పందన ఎలా ఉంది? వంటి విషయాలపై నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రత్యేక సర్వేల ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూ వెనకబడిన ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగు పరుచుకునే అంశాలపై సూచనలు సలహాలిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు యర్రగొండపాలెం నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారని అంటున్నారు.
యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ గెలుపు రుచిచూడలేదు. 1955 నుంచి అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న యర్రగొండపాలెం 1972లో రద్దు అయింది. మళ్లీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఎస్సీ రిజర్వు నియోజకవర్గంగా ఆవిర్భవించింది. ఇలా రెండున్నర దశాబ్దాల క్రితం పుట్టుకొచ్చిన
యర్రగొండపాలెం నియోజకవర్గంలో వరుసగా టీడీపీ ఓడిపోతూనే వస్తోంది. 2009లో కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే యర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటూ వస్తోంది.
యర్రగొండపాలెం నియోజకవర్గంలో గెలుపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతి ఎన్నిక సమయంలోనూ అంతకుముందు ఎన్నికల వైఫల్యాలను సరిదిద్దుకుని తలపడుతున్నా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు మాత్రం సాధ్యం కావడం లేదు. చివరికి 2024 ఎన్నికల్లో సునామీలా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ జెండా రెపరెపలాడినా యర్రగొండపాలెంలో మాత్రం ఆ పార్టీకి విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో మిషన్ 2029లో అయినా ఈ నియోజకవర్గంలో గెలవాలన్న టార్గెట్ తో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని చెబుతున్నారు.
కరువు, కాటకాలకు నిలయమైన యర్రగొండపాలెం నియోజకవర్గానికి జలకళ తీసుకురావడానికి వెలిగొండ ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారు. మరో నాలుగు నెలల్లో ఈ పనులు పూర్తి చేయించి ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు యర్రగొండపాలెంను కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పరిధిలో చేర్చి ఒంగోలుకు వెళ్లాల్సిన బాధలు తప్పించారు. ఇంతలా ఆ నియోజకవర్గానికి మేలు జరిగేలా తాను పనిచేస్తున్నా, ఓట్లు ఎందుకు పడటం లేదన్న ఆవేదన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ నాయకులు అంటున్నారు. అందుకే తన మనసులో మాటను బయటపెట్టారని అంటున్నారు.
సీఎం ఎలాంటి శషబిషలకు గురికాకుండా రైతులతో యర్రగొండపాలెంలో ఓట్లు వేయలేదని ప్రశ్నించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. చంద్రబాబు స్థాయిలో ఉన్న నేత.. ఒక నియోజకవర్గంపై గురిపెట్టడం చూస్తే వచ్చే ఎన్నికలకు పెద్ద స్కెచ్చే వేస్తున్నారని అంటున్నారు. కేవలం యర్రగొండపాలెంపై ఫోకస్ మాత్రమే కాదు.. ఉన్న 11 సీట్లలో మెజార్టీ స్థానాల్లో కూటమి పాగా వేసేలా చంద్రబాబు ప్లాన్ వేస్తున్నారని టీడీపీ నుంచి లీక్‌లు వస్తున్నాయి. చూడాలి మరి.. గత ఎన్నికల్లోనూ ఇలాగే వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అంది. ఇప్పుడు టీడీపీ అలాంటి స్లోగన్స్ ఇవ్వట్లేదు కానీ.. చేతల్లో చేసి చూపడానికి తెగ ఉత్సాహపడిపోతోంది. చూడాలి.. ఏం జరుగుతుందో. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందో. ఇది ఇవాళ్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్లీ కలుద్దాం. నమస్తే..