Pithapuram: వర్మ వర్సెస్ దొరబాబు.. కూటమిలో ఆధిపత్య పోరుకు అసలు కారణం ఇదేనా?

రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు విజయ కోట.. పిఠాపురం ఇప్పుడు ముఠా తగాదాలకు వేదికగా మారుతోంది. ఢిల్లీ వేదికగా చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మేమంతా ఒక్కటే అని కౌగిలించుకుని చాటుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. కడుపులో కత్తులు.. పైకి కరచలనాలు అన్నట్లుగా సాగుతున్న ఇక్కడి రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. సీఎం ఫోటో లేదన్న సాకుతో మొదలైన ఫ్లెక్సీ వార్, పాత వైరి వర్గాల మధ్య పీక్ స్టేజ్ ఆధిపత్య పోరుగా మారి, కూటమి పునాదులనే కదిలిస్తోంది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఇలాకాలోనే తమ్ముళ్లు, సైనికులు తలపడుతుంటే.. ఇది పొత్తు ధర్మమా లేక మున్ముందు రాబోయే ముసలం కు సంకేతమా? అనే ప్రశ్న వినిపిస్తుంది.

 

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీట్ పిఠాపురం.. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డ.. అగ్రనాయకత్వం మేమంతా ఒక్కటే అని ఢిల్లీ నుంచి గల్లీ దాకా చాటుతుంటే.. క్షేత్ర స్థాయిలో లో మాత్రం సీన్ మరోలా ఉంది. ఫ్లెక్సీల సాక్షిగా పంచాయతీలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడం అధికారుల నిర్లక్ష్యమా లేక జనసేన నేతల వ్యూహమా..? వర్మ వర్సెస్ పెండెం దొరబాబు మధ్య ఆధిపత్య పోరు వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి? అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ.

 

కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలించుకుంటున్నారు. పీకల దాకా కోపం ఉన్నా.. పైకి నవ్వుతూ కరచలనం చేసుకుంటున్నారు. జనసేనాని అడ్డాగా మారిన పిఠాపురం నియోజక వర్గంలో కూటమి పక్షాల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుంది. 15 ఏళ్ల పాటు కూటమిది విడదీయలేని బంధమని పవన్ కళ్యాణ్, చంద్రబాబు పదే పదే చెబుతున్న పిఠాపురంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఇక్కడ టిడిపి, జనసేన శ్రేణుల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. నియోజక వర్గంలో ఎవరికి వారే వారి మాటే చెల్లుబాటు కావాలని పట్టుబడుతున్నారు.

 

 

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయం వేదికగా జరిగిన ఎన్యుమరేటర్ల మొబైల్ పంపిణీ కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. బ్యానర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో మాయం కావడంతో టిడిపి నేత ఎస్ఎస్ఎన్ వర్మ సహనం కోల్పోయారు. ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ అధికారుల గల్లా పట్టుకున్నంత పని చేశారు. ఇది పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించడమేనని టిడిపి వర్గాలు మండిపడ్డాయి. వర్మ ఆగ్రహాన్ని చూసి జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు రంగలోకి దిగారు. అధికారుల నిలదీస్తున్న వర్మను అడ్డుకోవడంతో వివాదం మొదలింది.

 

సాక్షాత్తు డెప్యూటీ సీఎం నియోజక వర్గంలో ప్రోటోకాల్ విషయంలో ఇంత నిర్లక్ష్యమా అని టిడిపి అంటుంటే అనవసరంగా రాదంతం చేస్తున్నారని జనసేన కౌంటర్ ఇస్తుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో పాడ ఆఫీస్‌ పరిసరాలు ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తిపోయాయి. ఈ గొడవలోకి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల వరకు వైసీపీ లో ఉండి పవన్ ను ఓడించాలని కంకణం కట్టుకున్న దొరబాబు ఇప్పుడు జనసేన కండువ కప్పుకొని పెత్తనం చేయడాన్ని వర్మసూటిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్తత పరాకాష్టకు తీసుకెళ్ళింది. కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూసుకెళ్ళడంతో పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించింది.

దొరబాబు టార్గెట్ గా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో చక్రం తిప్పి ఇప్పుడు కూటమి ముసుగులో అక్రమాలకు తెరలేపుతున్నారని తన క్యాడర్ ద్వారా సెటిల్‌మెంట్లు చేస్తున్నారని వర్మ ఆరోపించారు. నీ అక్రమ సంపాదన నీ స్కాములన్నీ నాకు తెలుసు ఒక్కొక్కటిగా బయట పెడతా అంటూ వర్మ చేసిన హెచ్చరిక పిఠాపురంలో కలకలం రేపుతుంది. పొత్తులో ఉన్నా కూడా ఒకరిపై ఒకరు ఇలాంటి ఆరోపణలు చేసుకోవడం కూటమి భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తుంది. ఇక వర్మ తీరుపై జనసేన కార్యకర్తలు కూడా పాత విషయాలను తవ్వుతున్నారు.

 

 

వర్మ దూకుడుపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడం, పల్లా శ్రీనివాసరావును రంగంలోకి దించడం చూస్తుంటే అధిష్టానం ఈ వివాదాన్ని ఇప్పుడే చల్లార్చాలని భావిస్తోంది. అయితే, కేవలం ఫోటోల దగ్గరో, ప్రోటోకాల్ దగ్గరో ఈ సమస్య ఆగిపోవడం లేదు. గత ఎన్నికల వరకు బద్ధ శత్రువులుగా ఉన్న వర్మ, పెండెం దొరబాబులు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు రావడం.. పాత కక్షలు పడగ విప్పడం కార్యకర్తల్లో గందరగోళాన్ని నింపుతోంది. పిఠాపురం డెవలప్‌మెంట్ అథారిటీ సాక్షిగా జరిగిన ఈ రభస, కూటమిలోని అంతర్గత విభేదాలకు అద్దం పడుతోంది. అధిష్టానం ఇప్పుడే కఠిన చర్యలు తీసుకోకపోతే, ఈ ఆధిపత్య పోరు పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా, రాబోయే ఐదేళ్ల పాలనలో కూటమికి పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.